"మల్టీ ఫేసేటేడ్ క్వీన్ అఫ్ ఇండియన్ సినెమా" అన్న ఒక్క మాటలో భానుమతి గారికి చక్కగా నిర్వచనం ఇచ్చారు ఎవరోగాని. ఒక వ్యక్తిలో సంగీతం, సాహిత్యం, నటనా వైదుష్యం,కార్య నిర్వహణా దక్షత, దర్శకత్వ ప్రతిభా, ఎడిటింగ్ నైపుణ్యం, పాటలు వ్రాయడం, సంగీతం సమకూర్చడం, స్టూడియో నిర్వహణా, మంచితనం, మానవత్వం, ధైర్యం --ఇలా అన్నన్ని సుగుణాలు ఎలావచ్చాయో అని ఆలోచిస్తే అది భగవద్దత్తం అని అనిపించక మానదు.
భారతదేశం గర్వంచదగ్గ నటీమణుల్లో ఆమె ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు అనితరసాధ్యమైనవి. ఏడు దశాబ్దాలు ఆమె సినీకళామతల్లికి చేసిన సేవలు అజరామరం.