పురికిని బ్రాణము కోమటి వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం గరికిని బ్రాణము తొండము సిరికిని బ్రాణము మగువ సిద్ధము సుమతీ!
పులిపాలు దెచ్చిఇచ్చిన నలవడఁగ గుండెగోసి యరచే నిడినం దలపొడుగు ధనము బోసిన వెలయాలికి గూర్మిలేదు వినురా సుమతీ!
పెట్టిన దినములలోపల నట్టడవులకైనవచ్చు నానార్థములున్ బెట్టని దినములఁ గనకపు గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ!
పొరుగున పగవాడుండిన నిర వొందగ వ్రాతగాఁడె ఏలికయైనన్ ధరఁగాఁపు కొండెమాడినఁ గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!
బంగారు కుదువబెట్టకు సంగరమునఁ బారిపోకు సరసుఁడవగుచో నంగడి వెచ్చములాడకు వెంగలితో జెలిమి వలదు వినురా సుమతీ!
బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!
మండలపతి సముఖంబున మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్ గొండంత మదపుటేనుగు తొండము లేకుండినట్లు తోచుర సుమతీ!
మంత్రిగలవాని రాజ్యము తంత్రము సెడకుండ నిలచుఁ దరచుగ ధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రపుఁగీలూడినట్లు జరుగదు సుమతీ!
మాటకు బ్రాణము సత్యము కోటకుఁ బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్ బోటికిఁ బ్రాణము మానము చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!
మానఘనుఁ డాత్మధృతిఁ జెడి హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్ మానెడు జలములలోపల నేనుఁగు మెయి దాఁచినట్టు లెరగుము సుమతీ!