కందుకూరి వీరేశలింగం పంతులు (1848 -1919)- తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు,తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా,హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి.
విశిష్టత
ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. ఆయనకున్న ఇతర విశిష్టతలు:
- మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి
- మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు
- తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే
- తెలుగులో తొలి నవల రాసింది ఆయనే
- తెలుగులో తొలి ప్రహసనం రాసింది కందుకూరి
- తెలుగుకవుల జీవిత చరిత్ర రాసిన మొదటి వ్యక్తి
- విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు రచయిత
ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసాడు.
తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి ఆయన. యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.
ఆంధ్ర సమాజాన్ని సంస్కరణాల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం. ఆయన చేసిన ఇతర సంస్కరణా కార్యక్రమాలొక ఎత్తు, వితంతు పునర్వివాహాలొక ఎత్తు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేసాడు.
వీరేశలింగం హేతువాది .ఆయన జీవితం సంఘసంస్కరణ, సాహిత్య కృషిలతో పెనవేసుకు పోయింది; ఒకదానినుండి మరో దానిని విడదీసి చూడలేము. ప్రభుత్వంలోని అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని, అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న వ్యక్తి అటువంటి దురాచారాలపై ధ్వజమెత్తి తన సంస్కరణాభిలాషను నిరూపించుకున్నాడు.
తన దేహము తన గేహము
తన కాలము తన ధనంబు తన విద్య జగ
జ్జనులకే వినియోగించిన
ఘనుడీ వీరేశలింగకవి జనులార!
చిలకమర్తి లక్ష్మీనరసింహం వీరేశలింగం గురించి ఇలా అన్నాడు: ఇది వీరేశలింగం సమాధిపైఈ నాటికీ కనుపిస్తుంది.
బాల్యం
1848 ఏప్రిల్ 16వ తేదీన సుబ్బారాయుడు, పున్నమ్మ దంపతులకు జన్మించారు. నాలుగేళ్ల వయసులో తండ్రి చనిపోయారు. ‘నాలుగైదు సంవత్సరముల ప్రాయము వచ్చు వఱకును నన్నుఁ గూర్చి చెప్పకోవలసిన దేదియు నాకు స్ఫురణకు రాలేదు’ అని స్వయంగా ఆయనే తన ‘స్వీయచరిత్రము’ మొదటి ప్రకరణంలో రాసుకున్నారు.తండ్రి మరణం, తల్లి ప్రేమ … ఇవి రెండే పంతులుగారి తొట్టతొలినాళ్ల జ్ఞాపకాలు! కొడుకుపై తల్లికి ఎంత ప్రేమంటే… ఇలాంటి ప్రేమ ఏ తల్లికీ ఉండకూడదని వీరేశలింగం పంతులు కోరుకున్నంత!!.
‘అన్నమెంత యెక్కువగాఁ దిన్ననంత బలియుదురన్న నమ్మకము కలదయి యజ్ఞానము చేత నా ప్రియమాత నన్ను శీఘ్రముగా బలిపింపవలెనన్న యుత్కంఠతోను, సచ్చింతతోను నాకన్నమెక్కువగాఁ బెట్టి నోటిలోని ముద్దను మ్రింగకున్నప్పుడు మిరెపుకాయలగుండ నా నాలుకకు రాచుచుండుటయు, నోటిలోని ముద్ద మ్రింగి కారముచే నే నేడ్చినప్పుడు నెత్తి మీఁద మొట్టుచుండుటయు నెందుచేతనో కాని నేడు జరిగినట్టుగా నా మనస్సున దృఢముగా నాటుకొని యిప్పటికిని మఱపునకు రాకున్నవి. బిడ్డలయందలి యతిప్రేమచేతఁ దల్లు లెప్పుడు నిట్టియవివేక కార్యములను జేయకుండుదురు గాక ’ అని పంతులుగారు అదే మొదటి ప్రకరణంలో వాపోయారు!
ఎవరి జీవితపు తొలి జ్ఞాపకమైనా అమ్మ ముద్దుతోనో, అమ్మ పెట్టిన ముద్దతోనో ఆరంభం అవుతుంది. పంతులుగారికీ అంతే. అయితే ఆయనకు అమ్మ ముద్దు కన్నా ముందు తన తండ్రి అకస్మాత్తుగా ఒకానొక రోజు నుండి కనిపించకపోవడం స్ఫురణకొస్తుంది. అలాగే – వేళకింత ముద్ద పెట్టేందుకు లేకుండా ఒకానొక రాత్రి తన అర్ధాంగి తనను విడిచి వెళ్లిపోవడం గుర్తుకొస్తుంది.
జీవితం మొదలయ్యే ప్రత్యేక సందర్భాలు, ప్రత్యక్ష క్షణాలు కొన్ని ఉంటాయి. లంకంత ఇల్లుందని జీవితం మొదలు కాదు. పెద్ద బంధుగణం ఉందని మొదలు కాదు. గొప్ప చదువు, మంచి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఫ్యాన్ కింది టేబుల్… ఇవేవీ జీవితాన్ని మొదలుపెట్టవు. పెట్టినా అది పెట్టుడు ముహుర్తంలా ‘పెట్టుడు జీవితం’ అవుతుంది తప్ప జీవితం అవదు.
కందుకూరి వీరేశలింగం జీవితం అనేక సంఘర్షణలతో, అనేక సందర్భాలతో, అనేక క్షణాలతో మొదలైంది.
పిల్లలకు చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసి పడేస్తారెందుకు?
ఆడపిల్లల్ని చదువుకోనివ్వరెందుకు? అడుగు బయటికి పెట్టనివ్వరెందుకు?
చిన్న వయసులో భర్త చనిపోతే మళ్లీ పెళ్లి చేయరెందుకు?
లంచం ఇవ్వకుండా ఉద్యోగం రాదెందుకు?
కులమతాల అడ్డుగోడలెందుకు? అబద్ధాలెందుకు? అవినీతి ఎందుకు?
కళ్ల ముందే నచ్చని విషయాలు జరుగుతుంటే మనుషుల్లో ఇంత మౌనం ఎందుకు?
అన్నీ ఆలోచనలే వీరేశలింగానికి. వాటిని పట్టుకుని సంఘంతో గొడవకు, ఘర్షణ దిగాడు.
పదేళ్ల వయసు వరకు… అతడి జీవితం బాగుంది. పదేళ్ల తర్వాత – సమాజంలో స్త్రీలు, పిల్లల జీవితం బాగోలేదన్న విషయం కొద్దికొద్దిగా అర్థమౌతున్న కొద్దీ అతడి జీవితమూ బాగోలేకుండా పోయింది!
ఏం చేసి వీళ్లను కాపాడాలి? చిన్న వయసుకు పెద్ద సమస్య! వీరేశలింగం తన ఐదో యేట బడిలో చేరి నేర్చుకున్నవి… బాల రామాయణం, ఆంధ్రనామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కల్యాణం, సుమతీ శతకం, కృష్ట శతకం. పన్నెండో ఏట నుంచీ పూర్తిగా ఇంగ్లీషులోకి వచ్చేశాడు. ఇంగ్లిష్ పుస్తకాలు, ఇంగ్లిష్ భావాలు, ఇంగ్లిష్‌లో సంభాషణలు. సిలబస్‌తో పాటు అతడు కేశవ్ చంద్రసేన్ పుస్తకాలు చదివాడు. బెంగాల్ రచయిత అతడు. స్త్రీని స్థిమితంగా ఉంచలేని సమాజం అది ఎంత ఆధునికమైనదైనా, నాగరికమైనది కానే కాదని చంద్ర సేన్ రాశాడు. అది పట్టేసింది వీరేశలింగాన్ని. తను అనుకుంటున్నదే ఆయనా రాశాడు!
అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్నాడు వీరేశలింగం. ఘోరంగా ఉంది. చాలా ఘోరంగా! ఎవరి స్వార్థం వారిదే. ఎవరి నమ్మకాలు వారివే. ప్రజలారా మారండి అని వ్యాసాలు రాశాడు. ఉపన్యాసాలు ఇచ్చాడు.ఎవరూ మారలేదు. వీడెవరో పిచ్చివాడు అనుకున్నారు. కొత్త పిచ్చోడు అనుకున్నారు. రాజారామ్మోహన్ రాయ్‌ననీ, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్‌ననీ అనుకుంటున్నాడేమో అన్నారు. ఇది బెంగాల్ కాదు, ఆంధ్రదేశం బ్రదర్ అని హితవు చెప్పారు.
వీరేశలింగానికీ సమాజానికీ పడడం లేదు. సమాజం అతడికన్నా బలమైనది. అంతకన్నా మొండివాడు వీరేశలింగం. ఉపాధ్యాయుడుగా అతడు శక్తిమంతుడు. ఒక తరాన్ని మలచగలడు. పత్రికా సంపాదకుడిగా అతడు శక్తివంతుడు. భావ విప్లవం తేగలడు. కానీ తరాన్ని మలచడానికి, విప్లవం రావడానికి సమయం పడుతుంది. అప్పటివరకు బాల్యవివాహాల బలిపీఠాల నుంచి చిన్నారులను రక్షించేదెలా? బాల వితంతువుల యవ్వనాన్ని భద్రపరిచేదెలా? సమాజం ఉలిక్కిపడి లేచేలా గట్టి దెబ్బ వేయాలి అనుకున్నాడు వీరేశలింగం.
ఆ దెబ్బ ఎంత గట్టిగా ఉండాలంటే – ఊరూరూ తిరిగి, వీధి వీధి తిరిగి తనకు తగిలిన గాయాన్ని ఈ దురాచార సమాజం ఏడ్చుకుంటూ చూపించుకోవాలి.పంతులుగారికి అప్పటికే రాజమహేంద్రవరం నిండా, ఆంధ్రదేశం నిండా శత్రువులు మొనదేలిన రాళ్లలా తయారై ఉన్నారు. విజయనగరం మహారాజుగారి బాలికల పాఠశాల ప్రాంగణంలో రెండు నెలల వ్యవధిలో ఆయన ఇచ్చిన రెండు స్పీచ్‌లు సంప్రదాయాల తాళాలు బద్దలు కొట్టి, ఇళ్లలో చొరబడి, వితంతు బాలికల కోసం వెదకడం మొదలుపెట్టాయి. ఎక్కడ చూసినా అదే చర్చ. ఆయనదే రచ్చ!
"ఎవరయ్యా ఈ త్రాష్టుడు. విలువల్ని భ్రష్టుపట్టించడానికే పుట్టాడా ఈ రాజమహేంద్రవరంలో?, ఒక పెళ్లి చాల్లేదా సంఘ సంస్కర్త గారికి! వితంతువులను ఉద్ధరించే పేరుతో ఊరిమీద పడ్డాడు!!, వీడిదసలు బ్రాహ్మణ పుట్టకేనా? సభల్లో ఏం కూస్తున్నాడో విన్నారా?" వీరేశలింగం కనిపిస్తే పట్టుకుని కుళ్లబొడిచేయాలన్నంత కోపంతో ఉంది ఊరూవాడ. ‘మనవాళ్లు పూర్వాచార పరాయణులగుట చేత నీతిబాహ్యమైన గూఢ వ్యభిచారమునైన నంగీకరింతురుగాని, యాచార విరుద్ధమైన ధర్మవివాహము నంగీకరింపరు’ అని వీరేశలింగం ఏమాత్రం మొహమాటం లేకుండా, మర్యాద లేకుండా సభల్లో ఉపన్యసించడం పెద్దపెద్దవాళ్లకు ఆగ్రహం తెప్పించింది.
1881 డిసెంబర్ 11వ తేదీన మొదటి వితంతు వివాహం
భువనగిరి పరదేశీ సోమయాజులు, శ్రౌతము కోటీశ్వరశాస్త్రులుగారు, కొక్కొండ వేంకటరత్నం పంతులు, ఓగిరాల జగన్నాథం, వేంకటరాయ శాస్త్రులు, దంతులూరి నారాయణ గజపతిరావు, దాసు శ్రీరాములు పంతులు వంటి మహామహులు వీరేశలింగంపై విరుచుకుపడ్డారు. ఆయనపై ఖండన గ్రంథాలు రాశారు. ఉత్తరాలు రాశారు. వాటిలో ఏ ఉత్తరానికీ ఆయన విలువ ఇవ్వలేదు. ఒక ఉత్తరానికి తప్ప. అది.. కృష్ణమండలంలోని తిరువూరు డిప్యూటీ తాసిల్దారు బ్రహ్మశ్రీ దర్భా బ్రహ్మానందం గారి నుంచి వచ్చిన ఉత్తరం. ‘తిరువూరు తాలూకా రేపూడి గ్రామంలో గౌరమ్మ అనే పన్నెండేళ్ల బాల వితంతువు ఉన్నదనీ, ఆమెకు మళ్లీ పెళ్లి చేసేందుకు ఆమె తల్లి సీతమ్మ సిద్ధ్దంగా ఉన్నారని’ అందులోని సారాంశం. ‘మీదే ఆలస్యం’ అని పంతులుగారు తక్షణం రిప్లయ్ ఇచ్చారు. అమ్మాయిని భద్రంగా రాజమహేంద్రవరం తెప్పించి తన ఇంట్లో, తన భార్య సంరక్షణలో ఉంచుకున్నారు. ఆ వెంటనే వరుడి వేట మొదలైంది!
విశాఖపట్నం పోలీస్ హెడ్ క్వార్టర్ట్స్‌లో పనిచేస్తున్న గోగులపాటి శ్రీరాములు అనే యువకుడు ఆ క్షణంలో పంతులుగారి మదిలో మెదిలారు. గతంలో అతడు పంతులుగారి ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. అతడికి కబురు పంపారు. శ్రీరాములు గౌరమ్మను చూడకుండానే పెళ్లికి ఒప్పుకున్నాడు. అది అతడికి పంతులుగారిపై ఉన్న గౌరవం. శ్రీరాములుకు అంతకుముందే పెళ్లయింది. భార్య అకస్మాత్తుగా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఆ ఒంటరితనాన్ని పోగొట్టేందుకు పిల్లనిస్తామని ఎంతోమంది వచ్చినా వితంతు వివాహం చేసుకోడానికి అతడు వేచి ఉన్నాడు. చివరికి గౌరమ్మ దొరికింది!
పెళ్లి పనులు రహస్యంగా జరుగుతున్నాయి. వరుడి పేరును కూడా పంతులుగారు రహస్యంగా ఉంచారు. గౌరమ్మ అనే బాల వితంతువుకు పంతులుగారింట్లో పెళ్లి జరగబోతోందని ఊరంతటికీ తెలిసింది కానీ వరుడెవరో బయటికి పొక్కలేదు. పెళ్లికి కావలసిన రక్షణ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కర్నల్ పోర్చిస్ దొరగారి నుంచి లభించింది. పెళ్లికి అవసరమైన డబ్బును పంతులుగారి స్నేహితుడు పైడా రామకృష్ణయ్యగారు సమకూర్చారు. వధూవరులకు కావలసిన నైతిక స్థయిర్యాన్ని పంతులుగారు ఇచ్చారు. అలా రాజమహేంద్రవరంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం జరిగింది.
చివరి నిమిషంలో వరుడి తల్లిదండ్రులకు విషయం తెలిసి గగ్గోలు పెడుతూ కల్యాణ మంటపానికి చేరుకున్నారు. వేయడానికి అక్షింతలు, ఇవ్వడానికి అశీర్వచనాలు తప్ప వాళ్లకేం మిగల్లేదు. ఆ వివాహానికి వెళ్లిన వాళ్లందరినీ సమాజం గుర్తుపెట్టుకుని మరీ వెలి వేసింది. వేడుకలకు, వివాహాలకు పిలవడం మానేసింది. పంతులుగారిని చీడపురుగుగా చూసింది. పనిగట్టుకుని వేధించింది. వీరేశలింగం భయపడలేదు. వెనకడుకు వెయ్యలేదు. నేనింతే అన్నాడు. ఇదొక్కటే కాదు ఇంకా చాలా పెళ్లిళ్లు చేస్తానని సవాల్ విసిరాడు. ‘‘ఈ బక్క పీనుగకు చావైనా రాదే! వీడి మీది గౌరవంతో వీడి పెళ్లానికి ఇంకో పెళ్లి చేద్దుము’’ అని శుద్ధ సంప్రదాయవాదులు పంతులుగారిని రహస్యంగా తిట్టుకున్నారు. ఆ రహస్యం ఆయన చెవిన పడి నవ్వుకున్నారే గానీ, నమ్మిన తోవను వదిలి వెళ్లలేదు.
వీరేశలింగం పంతులుగారు శారీరకంగా బలహీనులైతే కావచ్చు. మానసికంగా బలవంతులు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, విద్యార్థుల బలం ఆయనకు తోడయ్యింది. అన్నిటికన్నా పెద్ద బలం ఆయన అర్ధాంగి రాజ్యలక్ష్మిగారు. వీళ్లందరి సహకారంతో పంతులుగారు తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడ్డారు. తను బతికుండగా నలభై వరకూ వితంతు వివాహాలు జరిపించారు. ఈ దుస్సాహసమే ఆయన్ని నేడు సంఘసంస్కర్తగా నిల బెట్టింది.
వివేక వర్థిని
ఉన్నత విద్యానంతరం వీరేశలింగం అధ్యాపక వృత్తిని చేపట్టారు. రాజమండ్రి, కోరంగి, ధవళేశ్వరం, మద్రాసులలోని పాఠశాలల్లో పని చేశారు. అధ్యాపకుడిగా పనిచేస్తుండడంతో ‘పంతులు’గారని, వీరేశలింగం పంతులుగారని ప్రాచుర్యం
పొందారు. సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి 1876లో ఉపాధ్యావృత్తి నుండి జర్నలిస్టుగా మారి ‘వివేకవర్థిని’ అనే మాసపత్రికను ప్రారంభించారు. మొదట ఈ పత్రిక మద్రాసు నుండి వచ్చేది. తర్వాత కొంతమంది స్నేహితులతో కలిసి – రాజమండ్రిలోనే సొంత ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి పత్రికను నిర్వహించారు.ఆ రోజుల్లోనే లంచగొండితనం, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు… ఇలా ఎన్నో అన్యాయాలు సమాజంలో జరుగుతుండేవి. వాటిపైకి తన పత్రిక ‘వివేకవర్థిని’ని ఆయన ఎక్కుపెట్టారు.
బాల్య వివాహాల వ్యతిరేకంగా, కుల నిర్మూలన కు ఆయన అకుంఠిత దీక్షతో పనిచేసాడు. వేశ్యా వ్యవస్థ పాతుకుపోయిన ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా వివేకవర్ధని లో వ్యాసాలు రాసాడు.
ఖండించారు, కళ్లు తెరిపించారు
19వ శతాబ్దంలో దేశమంతటా సంస్కరణ ఉద్యమం మొదలైంది. బ్రిటిష్ భాషాసంస్కృతుల సహచర్యం, వారి విజ్ఞానశాస్త్రం అన్ని రంగాలలో కొత్త ఆలోచనలు కలిగించాయి. ఆ ఆలోచనలకు తెలుగునాట కందుకూరి వీరేశలింగం ప్రధాన చోదకశక్తి అయ్యారు. సాహిత్యంతో ఉద్యమాన్ని ముందుకు నడిపారు.కేవలం రచనలకు, ఉపన్యాసాలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా, ఆచరణాత్మకంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.తొలి వితంతు పునర్వివాహాన్ని 11 డిసెంబర్ 1881న తన ఇంట్లోనే జరిపించారు!
ఈ క్రమంలో అనేక విమర్శలకు, అవమానాలకు, సంఘ బహిష్కరణలకు గురయ్యారు.పంతులుగారి కంటే ముందు బెంగాల్‌లో రాజా రామ్మోహన్‌రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ స్త్రీ అభ్యుదయం కోసం కృషి ప్రారంభించారు. వారి నుంచి పంతులుగారు ప్రేరణ పొందారు. స్వయంగా పత్రికలు నడిపారు.
నవల, వ్యాసం, ఉపన్యాసం, విమర్శ వంటి ప్రక్రియలకు ఆద్యులు.తెలుగులో వచ్చిన తొలి సాంఘిక నవల ‘రాజశేఖర చరిత్ర’ (1878) పంతులు గారు రాసిందే. సమకాలీన సమాజంలోని కుళ్లును, అజ్ఞానాన్ని ఎత్తి చూపుతూ, రకరకాల గుడ్డి నమ్మకాలను సహేతుకంగా ఖండించి, కళ్లు తెరిపించే ప్రయత్నం ఈ నవల్లో జరిగింది. పంతులుగారి ప్రతి రచనలోనూ సంఘ సంస్కరణే అంతర్లయ.
స్త్రీ విద్యా వ్యాప్తి
1907 ఫిబ్రవరిలో హిందూ సమాజాన్ని స్థాపించిదాని ఆధ్వర్యంలో ఎన్నో సంస్థలను, ఆస్తులను కూడబెట్టారు. వీరేశలింగంగారు సతీమణి శ్రీమతి రాజ్యలక్ష్మమ్మ కూడా సంఘ సేవాభిలాషి కావడం వల్ల భర్త ప్రారంభించిన సంఘ సంస్కరణోద్యమానికి ఆమె పూర్తి సహాయ సహకారాలను అందించారు. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్న నానుడి వీరేశలింగం వంటి ప్రముఖుల విషయంలో అక్షరాలా రుజువైంది. రాజ్యలక్ష్మమ్మగారు కూడా స్త్రీ విద్యా వ్యాప్తి కోసం కృషి చేశారు. రాజమహేంద్రవరం వంకాయలవారి వీధిలో ఇప్పటికీ పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో మ్యూజియంగా నిర్వహించబడుతున్న వీరేశలింగంగారి ఇంటి నుంచి ఎన్నో సంస్కరణ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. వీరేశలింగం,రాజలక్ష్మమ్మ దంపతులు నివాసం ఉండిన ఇంట్లోనే ముద్రణాలయం, పరిశోధనా కేంద్రం ఇప్పటికీ నెలకొన్నాయి.
వీరేశలింగంగారు సంస్కరణ ఉద్యమానికి చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు ఎంతో చేయూతనిచ్చారు. వీరేశలింగ ఆస్తికోన్నత పాఠశాలను స్థాపించడంలో, స్త్రీ విద్యా వ్యాప్తిలో వీరేశలింగంగారికి చిలకమర్తి వారు ఎంతో సాయం అందించారు. వీరేశలింగ ఆస్తికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసించే వారికి మామూలు చదువుతోపాటు దైవ ప్రార్థన అలవాటు చేసేవారు. వీరేశలింగంగారు రూపొందించిన ప్రార్థన ఒక మతానికీ, ఒక కులానికీ సంబంధించినది కాక, నామరూప రహితుడైన పరమాత్మ గురించి పంతులుగారు రచించిన ఆ ప్రార్థన అన్ని మతాల వారికీ వర్తించే విధంగా ఉంటుంది. అంతేకాక, ఆ పాఠశాలలో సంఘ సేవాభిలాషను పిల్లలకు బాల్యం నుంచి అలవర్చుకునేందుకు తగిన వాతావరణం నెలకొల్పుతారు. వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాల జూనియర్, డిగ్రి కళాశాలలతో అలరారుతో ఏటా వేలాది విద్యార్ధులకు విద్యా దానం చేస్తున్నాయి. రాజ్యలక్ష్మమ్మగారి పేరిట మహిళా కళాశాలను నెలకొల్పి ఆ సంస్థ ద్వారా మహిళా విద్యా వ్యాప్తి చేస్తున్నారు.
1880 నవంబరులో స్త్రీ విద్యపై ఆయన ఇచ్చిన ఉపన్యాసం తెలుగులో పాఠ్యాంశం అయింది.
స్త్రీ విద్యపై పంతులుగారి ఉపన్యాసం (1880)లోని కొన్ని భాగాలు
ఒక్క పురుషులకు మాత్రమే కాక స్త్రీలకు సహితమూ విద్య యావశ్యకమనుట, స్త్రీలకు కూడా వినయ వివేకాది సద్గుణములు కలుగవలయునని కోరు వారికెల్లరకును గరతలామలకమై యుండును. పూర్వకాలమునందు మనదేశంలో స్త్రీ విద్య వ్యాపించి యున్నదనుటకు భోజరాజు ప్రభుత్వ కాలమునందును, కృష్ణదేవరాయల ప్రభుత్వ కాలమునందును స్త్రీలు చెప్పిన శ్లోకములును, పద్యములును చాలినంత నిదర్శనములుగానున్నవి.
మొల్ల యనునామె రామాయణమును సైతము రచించి యున్నది. అంతియకాక పూర్వకాలమందు పురుషుల వలెనే స్త్రీలును ఎల్లర చేతను గౌరవింపబడుచుండిరి. సీత మొదలగు వారు తమ భర్తలతో సభలకు వచ్చి సింహాసనము మీద కూర్చుండుట మొదలగు సంగతుల పెక్కింటి నిందుకు దృష్టాంతముగా జెప్పవచ్చును.
స్త్రీలు స్వతంత్రురాండ్రుకారన్న మాత్రమున వారు గౌరవింపనర్హురాండ్రు కారని యెంచుట కేవలము పొరపాటు. స్త్రీలను పురుషులతో సమానంగా గౌరవించుచున్నంతకాలమును మనదేశము యున్నతస్థితి యందే ఉండినది. అట్లు గౌరవించుటమాని, విద్య చెప్పించుట వదిలివేసి, వారిని దాసీజనులవలె చూడ మొదలుపెట్టిన తరువాతనే మన దేశమునకిట్టి దౌర్భాగ్యదశ యారంభమయినది.
స్త్రీలు తమ పురుషులకాలోచన చెప్పుటయందు మంత్రుల వంటివారయి యుండవలయునని స్మృతులు ఘోషించుచుండుట చేత వారియెడ గౌరవముంచి వారి యాలోచనలను గణ్యతలోనికిదెచ్చుట పురుషుల విధియని వేరు చెప్పనక్కర యుండదు. మన వారు స్త్రీలకు మంచి విద్యను జెప్పించి వివేక మహితురాండ్రనుగాజేసి, పిమ్మల వారి యాలోచనను సహితము తగిన విషయములందంగీకరించి వారిని గౌరవించుచు మన పూర్వులు పొందియుండిన మహోన్నతదశను మరల పొందుటకయి ప్రయత్నింతురని మరి మరి కోరుచున్నాము.
వీరేశలింగంగారు గొప్ప సంస్కర్తే కాదు,గొప్ప కవి,రచయిత.తెలుగు సాహిత్యంలో ఆయన స్పృశించని సాహితీ ప్రక్రియ లేదు. ఆయన రచనలు, కవిత్వాల్లో కూడా అభ్యుదయ భావాలు నిండి ఉండేవి. తెలుగుసాహిత్యంలో వీరేశలింగం గారికి సమున్నతమైన స్థానం ఉంది.నవలలు,కథలు,వ్యాసాలు అన్ని రకాల సాహితీ ప్రక్రియల్లో వీరేశలింగం గారు తన దైన ముద్ర వేశారు. తెలుగుసాహిత్యం ఉన్నంత వరకూ వీరేశలింగంగారు ఉంటారు.అలాగే,సంస్కరణోద్యమం ఉన్నంత వరకూ ఆయన పేరు చిరస్థాయిలో నిలుస్తుంది. ఆయన వ్యక్తి కాదు,గొప్ప వ్యవస్థ.
సాహితీ వ్యాసంగం
సంఘసేవలో వీరేశలింగం ఎంత కృషి చేసాడో, సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేసేవాడు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకరు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవాడు కందుకూరి.
ఆయన 130కి పైగా గ్రంధాలు రాసాడు. ఆన్ని గ్రంధాలు రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంధాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు రాసాడు. స్వీయ చరిత్ర రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు.
సంగ్రహ వ్యాకరణం రాసాడు. నీతిచంద్రిక (తెలుగు పంచతంత్రం) లోని సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం పూర్తి చేసాడు.
కందుకూరి రచనల జాబితా
పద్య కావ్యాలు
- "మార్కండేయా" మకుటంతో శతకం (తొలినాళ్ళ రచన)
- "శ్రీరాజమహేంద్ర పురవర గోపాలా" మకుటంతో శతకం (తొలినాళ్ళ రచన)
- శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధం (నల చరిత్ర) – మూడు ఆశ్వాసాల కావ్యం
- రసికజన రంజనం (ప్రబంధం) – 1870 – చిత్ర కవిత్వం, శృంగారం ప్రధానంగా ఉన్నాయి. ఇటువంటివి రచించడం సరి కాదని కాలక్రమాన మానివేశానని స్వీయరచనలో పేర్కొన్నాడు
- అభాగ్యోపాఖ్యానము – హేళనా పూర్వకమైన సంఘ సంస్కార దృష్టితో కూడిన వ్యంగ్య కావ్యం
- శుద్ధాంధ్ర భారత సంగ్రహము – అచ్చతెలుగులో మూడు ఆశ్వాసాల కావ్యం
- సరస్వతీ నారద విలాపము (1895) – పద్యాత్మకమైన వ్యంగ్య ప్రహసనం – భాషా ప్రయోగం పట్ల కందుకూరి దృక్పథంలో వచ్చిన మార్పును ఈ కావ్యంలో చూడవచ్చును. అర్ధ సారస్యం లేని ఊహలతో, పాండిత్య ప్రకర్షతో ఇటు సరస్వతిని, అటు నారదుని అవమానిస్తున్నారని ఇందులో చూపారు.
- నీతి పద్యాలు
- స్త్రీ నీతి దీపిక
- జాన్ గిల్పిన్ – ఆంగ్లంలో "విలియమ్ కౌపర్" వ్రాసిన కావ్యానికి తెలుగు సేత
- పథిక విలాసము – ఆంగ్లంలో "ఆలివర్ గోల్డ్‌స్మిత్" వ్రాసిన "ది ట్రావెలర్" కావ్యానికి తెలుగు సేత
నాటకాలు
- చమత్కార రత్నావళి – "కామెడీ ఆఫ్ ఎర్రర్స్" అనే షేక్సుపియర్ నాటకాన్ని తెలుగులో వ్రాసి విద్యార్ధులచే ప్రదర్శింపజేశారు.
- కాళిదాసు శాకుంతలం – తెలుగులో
- రత్నావళి – సంస్కృత రూపకానువాదం
- దక్షిణ గోగ్రహణం
- సత్య హరిశ్చంద్ర
- మాళవికాగ్ని మిత్రం వంటి 12 నాటకాలు
నవలలు
- రాజశేఖర చరిత్రము – తొలి తెలుగు సాంఘిక నవల. ఆంగ్లంలో ఆలివర్ గోల్డ్‌స్మిత్ వ్రాసిన "వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డ్" అనే నవలకూ దీనికీ కొన్ని పోలికలున్నాయి. అయితే ఆ నవల కొంత ఉపకరించిందనీ, కాని ఇది అనువాదం కాని అనుకరణ కాని కాదని వీరేశలింగం చెప్పాడు. "పంతులుగారి మహాయశస్సుకునకు శరత్కౌముది వంటిది" అని అక్కిరాజు రమాపతిరావు అన్నాడు. ఇందులో రచయిత సాంఘిక దురాచారాలను, మూఢ నమ్మకాలను విమర్శించాడు. చక్కని తెలుగు సామెతలను, లోకోక్తులను ప్రయోగించి ముందుతరం నవలలకు మార్గదర్శకంగా నిలచాడు.
- ప్రధాన వ్యాసం: రాజశేఖర చరిత్రము
- సత్యరాజా పూర్వదేశ యాత్రలు – ఆంగ్లంలో "జోనాథన్ స్విఫ్ట్" వ్రాసిన "గల్లివర్స్ ట్రావెల్స్" ఆధారంగా వ్రాశాడు. ఇందు సమాజపు వికృత సంఘటనలను అవహేళన చేశాడు. "ఆడ మళయాళం" అనే పదం ఇందులోంచే ప్రసిద్ధమయ్యింది.
- సత్యవతీ చరిత్రము (1883) – స్త్రీ విద్యాభివృద్ధిని, ప్రాముఖ్యతను బోధించే నవల – ఆ రోజులలో ఇది మంచి ప్రాచుర్యాన్ని పొందిందట.
- చంద్రమతీ చరిత్రము (1884) – మత విషయాలను, ధర్మాలను, స్త్రీ అభ్యుదయాన్ని ప్రోత్సహించే నవల.
ప్రహసనాలు
సాంఘిక దురాచారాలను సంభాషణాత్మకంగా, వినోదాత్మకంగా విమర్శించే ఇటువంటి ప్రయోగానికి వీరేశలింగమే ఆద్యుడు. చాలా ప్రహసనాలను "వివేక వర్ధిని" పత్రికలో ప్రచురించాడు. "ప్రహసనము ఆయన కరములకు చితపరికరమయ్యెను. శైలి సొంపులతోను, హాస్యంపుదళులతోను శోభిల్లెడి ఈ ప్రహసనావళియందు దుష్టాంగమును ఖండించి శేషాంగ స్ఫూర్తికి రక్షణ చేయు శస్త్ర చికిత్సకునివలె ఈ రచయిత సాంఘిక అనర్ధములను దునుమాడెను" అని "రాయసం వెంకట శివుడు" ప్రశంసించాడు. షుమారు 50పైగా వ్రాసిన ప్రహసనాలలో 10 వరకు ఆంగ్లమూలాలపై ఆధారపడినాయి. తక్కినవి స్వతంత్ర రచనలు. ప్రహసనాలు "హాస్య సంజీవని" పేరుతో మూడు భాగాలుగా ప్రచురితమయ్యాయి. కొన్ని ప్రసిద్ధ ప్రహసనాలు
- పెళ్లి వెళ్ళిన తరువాత పెద్ద పెళ్ళి, లోకోత్తర వివాహము – వేశ్యాభిమానం, చాదస్తపుటాచారాలు, శాఖా భేదాలు, అజ్ఞానం, అమాయకత్వం, స్వార్ధం వంటి అంశాలు కలగలిపినవి.
- జమా బందీ, యోగాభ్యాసము – కులాచారాన్ని నిరసిస్తూ
- వేశ్యా విషయ సంవాదము
- చంద్ర గ్రహణం
- తేలు మందు
- హిందూ మతసభ
- బహుభార్యాత్వం
- బాల భార్యా వృద్ధభర్తృ సంవాదం
- మ్యునిసిపల్ నాటకము
- కామరూప ప్రహసనము
- కలిపురుష శనైశ్చర విలాసము – కలి, శని కలిసి దేశంలో ప్రజలను అజ్ఞానులుగా, మూఢులుగా, మద్యపాన ప్రియులుగా చేస్తున్నారని
- వేశ్యాప్రియ ప్రహసనం – 5 అంకాల ప్రహసనం, ఎంతో హాస్యం మిళితమైనది. ఆనాటి భోగం ఆచారాలను గురించి
- అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనం
- విచిత్ర వివాహ ప్రహసనం
కధలు
అధికంగా కందుకూరి కధలు స్త్రీల అభ్యుదయాన్ని ప్రోత్సహించేవిగా ఉన్నాయి. కొన్ని ఆంగ్ల మూలాలనుండి అనుసరించినవి కాని అధికంగా స్వతంత్ర రచనలే. "సతీ హిత బోధిని" అనే పత్రికలో ఎక్కువగా ప్రచురించాడు. "నీతి కధా మంజరి" అనే 158 చిన్న కధల సంకలనాన్ని కూడా వెలువరించాడు.
వ్యాసాలు
వివిధ అంశాలపై వీరేశలింగం 190 దాకా వ్యాసాలు / ఉపన్యాసాలు వ్రాశాడు. సత్య వాదిని, వివేక వర్ధిని, సతీహితబోధిని, చింతామణి, సత్య సంవర్ధిని, తెలుగు జనానా నంటి పత్రికలలో ఇవి ప్రచురితమైనాయి. ఉదాహరణకు కొన్ని వ్యాసాల శీర్షికలు
- దేశీయ మహాసభ – దాని యుద్దేశ్యములు
- రాజ్యాంగ సంస్కరణము – కులాచార సంస్కరణము
- ఇంగ్లీషు ప్రభుత్వము వలన లాభములు
- నీతి, విద్య కంటె నీతి ముఖ్యము, మానుష ధర్మము, ఈశ్వరోపాసనము
- చదువెఱుగని స్త్రీలు తమ బిడ్డలకు శత్రువులు
- అత్తగారి కోడంటికము, భార్యా భర్తల ఐకమత్యము, స్త్రీపునర్వివాహ శాస్త్ర సంగ్రహము, స్త్రీ పునర్వివాహ విషయకోపన్యాసము
చరిత్రలు
- ఆంధ్ర కవుల చరిత్ర – ఈ గ్రంధ రచన ఆంధ్ర వాఙ్మయ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టము. సమగ్రమైన, పరిశోధనాత్మకమైన, ప్రణాళికా బద్ధమైన కవుల చరిత్ర రచనకు ఆది యత్నము. అనేక తాళపత్రాలను, శాసనాలను, ముద్రిత అముద్రిత గ్రంధాలను పరిశీలించి వెలువరించిన గ్రంధము. 1886 నుండి 1917 వరకు ఇది విస్తరింపబడింది.
- స్వీయ చరిత్ర – 1903- 1915 మధ్య సాగిన రచన. నిష్పక్షపాతంగా, వచన శైలిలో సాగిన రచన. కొమర్రాజు వేంకటలక్ష్మణరావు నడిపే విజ్ఞాన చంద్రికా గ్రంధమాల వారు దీనిని ప్రచురించారు. ఇది ఆనాటి సామాజిక స్థితికి అద్దం పట్టే రచన. తెలుగులో వచన స్వీయ చరిత్రకు ఇది ఆద్యం.
- దేశ చరిత్ర
- నాయకుల చరిత్ర
- ఉత్తమ స్త్రీల జీవిత చరిత్రలు
ఇతర రచనలు
- సంగ్రహ వ్యాకరణం – లక్షణ గ్రంధం
- కావ్య సంగ్రహం – లక్షణ గ్రంధం
- తర్క సంగ్రహానికి ఆంధ్రీకరణం
- ఋగ్వేదానికి తాత్పర్యం
- శారీర శాస్త్ర సంగ్రహము
- జ్యోతిశ్శాస్త్ర సంగ్రహము
- జంతు స్వభావ చరితము
వీరేశలింగం నడిపిన పత్రికలు
- వివేక వర్ధిని
- సతీహిత బోధిని
- సత్య సంవర్ధిని
- సత్యదూత
- చింతామణి
-
తెలుగు జనానా
మూలం: savvadi
