ఆయన్ని చూస్తే అచ్చం తెలుగు రైతులాగా వుండేవాడు కాని 'కవి వేషం' కనబడేది కాదు. ఆరడుగుల నల్లని విగ్రహం. పల్లెటూరి పెద్దరికం తొణికసలాడే నుదురు. పొడుగైన ముక్కు. గుబురైన మీసాలు. ఖద్దరు దుస్తులు. ఆచితూచి మాటలు. సద్గుణాల ప్రోగు. ఆయన ఒక విషయంలో మాత్రం గర్వి ష్ఠి! తాను తెలుగు వాడైనందుకు ఆయన గర్విస్తాడు. తెలుగుజోదుల తుటారి కటారి చెలరేగి పగర చీల్చిన దినాన్ని జ్ఞప్తి చేసుకొని, పారతంత్య్రానికి, కులతత్వాలకు, ఈర్ష్యకులోనై, కుక్కలు చింపిన విస్తరిగా దేశాన్ని చేసిన ఆంధ్రజాతిని ఈసడించుకున్నాడు. రాష్ట్ర సిద్ధి కోసం 'రాష్ట్ర గానం' రచించి, రాష్ట్ర వృద్ధికోసం 'ఉదయగానం' ఆవిష్కరించాడు తుమ్మల.
గ్రామజీవనము, గాంధీతత్త్వము, సర్వోదయము, ఆంధ్రాభ్యుదయము, తిక్కన కవితామార్గము, చిన్నయసూరి సిద్ధాంతము ఆయనకు అభిమాన విషయాలు. తుమ్మల కవిత్వంలో గ్రామీణ జీవిత, ఆంధ్రత్వ, భారతీయత్వ, విశ్వమానవత్వ లక్షణాలుంటాయి. ఆయనది ప్రధానంగా ధర్మప్రబోధనాత్మక కవిత్వం. తాను తెలుగువాడననే అభిమానం ఆయనలో ఎక్కువ. తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు చరిత్ర, తెలుగు సంస్కృతి అంటే పులకించిపోయేవారాయన.
ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు. తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రి, దువ్వూరి వెంకటరమణశాస్త్రి వంటి ప్రముఖుల వద్ద విద్యనభ్యసించిన తుమ్మల, కవిగా, పండితుడిగా, తనకు తానే తీర్చిదిద్దుకొన్నాడు. తుమ్మల అచ్చమైన గాంధేయవాది. తెలుగుదనం మూర్తీభవించిన జాతీయోద్యమ కవి. "మహాత్ముని ఆస్థానకవి" అని కట్టమంచి రామలింగారెడ్డితో పలికించుకున్న తుమ్మల, ఆత్మకథ,మహాత్మకథ వంటి ఆదర్శ ప్రౌఢకావ్యాలు, ఆత్మార్పణము, రాష్ట్రగానము, ఉదయగానము, పఱిగపంట, పైర పంట, శబల, సమదర్శి, నా కథలు వంటి సామాజిక కవిత్వాన్ని అందించారు. అచ్చ తెలుగు మాటలతో అందమైన పద్యాలు అల్లగలిగిన ఆధునిక కవుల్లో తుమ్మలను మించిన వారు లేరంటె అతిశయోక్తి కాదు. ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడైన తుమ్మల గాంధీ భక్తి, తెలుగు భాషానురక్తి కలిగిన జాతీయోద్యమ కవి.
విశ్వజన శ్రేయస్సును కాంక్షించిన అరుదైన సంప్రదాయ బద్ధుడైన కవి తుమ్మల సీతారామమూర్తి. భాషాపరంగా ఆయన సంప్రదాయ బద్ధుడైనా భావనాపరంగా ఆధునికుడు. పద్య కవి అయిన ఆయన సాహిత్యానికి సాంఘిక ప్రయోజనం ఉండాలని గాఢంగా విశ్వసించాడు. నైతిక పునర్జీవనం, జాతీయ వికాసం, విశ్వ జనతా శ్రేయస్సు తన కవిత్వ లక్షణాలని చెప్పుకున్నారు. సమాజంలో జరుగుతున్న దోపిడీని, అన్యాయాలను, అక్రమాలను అభ్యుదయ కవుల కంటె ఎంతో ముందుగానే తన కవిత్వం ద్వారా బట్టబయలు చేశారు.
జీవిత విశేషాలు :
తుమ్మల సీతారామమూర్తి 1901 డిసెంబర్ 25 న గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని కావూరు గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు చెంచమాంబ, నారయ్య. ఆయనకు విద్యాబుద్ధులు చెప్పి తీర్చిదిద్దిన గురువులు కావూరి శ్రీరాములు, జాస్తి సుబ్బయ్య, తాడేపల్లి వేంకటప్పయ్యశాస్త్రి, దువ్వూరి వేంకటరమణశాస్త్రి. 1930 లో అన్నపూర్ణమ్మతో అయనకు పెళ్ళి జరిగింది. వారికి ఒక కుమార్తె నలుగురు కుమారులు కలిగారు. 1930 లో ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి ప్రథమశ్రేణిలో ఉభయభాషాప్రవీణ పట్టాను అందుకున్నాడు. చదువు పూర్తయ్యాక, తన స్వగ్రామం కావూరు లోని తిలక్ జాతీయ పాఠశాల లో 1924 నుండి 1929 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. 1930 నుండి 1957 వరకు గుంటూరు జిల్లా బోర్డునందలి దుగ్గిరాల, బాపట్ల, నిడుబ్రోలు, అప్పికట్ల ఉన్నతపాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. 1920 – 1930 మధ్య కాలంలో కాంగ్రెసులో చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1922లో జైలుశిక్ష అనుభవించాడు.
1928లో తుమ్మల ‘ఆత్మార్పణము’ అనే కావ్యాన్ని రచించారు. 1938లో ‘సోదరా లెమ్ము, నీ హక్కులాదుకొమ్ము’ అని ఆంధ్ర రాష్ట్ర సిద్ధి కోసం తన ‘రాష్ట్ర గానం’ ద్వారా తెలుగువారిని వెన్ను తట్టి లేపారు. తెలుగువారి పూర్వవైభవాన్ని ఎలుగెత్తి చాటి ప్రత్యేక రాష్ట్ర సాధనకు ప్రబోధించారు. 1840లో ధర్మజ్యోతి అనే ఒక ధర్మవరీ గాథను రచించారు. 1943లో ‘పఱిగి పంట’ రచించారు. 1950లో గాంధీజీ ఆత్మకథకు పద్య అనువాదమైన ‘ఆత్మకథ’ను రచించారు. 1953లో ‘ఉదయగానం’ గావించారు. 1955లో ‘శబిల’ అనే ఖండకావ్యాల సంపుటిని వెలువరించారు.
తెలుగు సాహిత్య సరస్వతికి శిరోభూషణమైన ‘సంక్రాంతి తలపులు’ ఈ సంపుటిలోనివే. 1957లో ‘గీతాధర్మము’ పేరుతో భగవద్గీతకు అనువాదం చేశారు. భర్తృహరి నీతిశతకాన్ని ‘తెలుగు నీతి’ పేరుతో తెనిగించారు. జాతీయోద్యమంలో పాల్గొన్న కవులలో తుమ్మల అగ్రగణ్యులు. ఆయన జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ‘సర్వోదయ’ సిద్ధాంతాన్ని విశదీకరిస్తూ 1960లో ‘సర్వోదయ గానం’ చేశారు. 1963లో తన అభిరుచులు, ఆదర్శాలు, అనుభవాలు వెల్లడి చేస్తూ ‘నేను’ అనే కావ్యాన్ని రచించారు. 1964లో ‘పైరపంట’ రచించారు. 1967లో ఆదర్శప్రాయులైన కొందరు త్యాగధనుల గుణగణాలను విశదీకరిస్తూ ‘సమదర్శి’ రచించారు.
తెలుగు భాషా సాహిత్యాలకు ఆయన చేసిన సేవలను ప్రస్తుతిస్తూ, ఘన సన్మానం చేసి 'అభినవ తిక్కన' అనే బిరుదును ఇస్తే, వినయపూర్వకంగా, తాను తిక్కన అంత ఘనుణ్ణికాదని, 'తెలుగు భాషకు సేవకుడను' అనే అర్థం వచ్చేలా 'తెనుగు లెంక' అని పేరు పెట్టుకున్న మహాకవి తుమ్మల సీతారామమూర్తి చౌదరి. ఇరవై నాలుగు వేల పద్యాలు వ్రాసినా, విద్యార్థులకు ఆయన రచనలను పాఠ్యాంశాలుగా నిర్ణయించకపోవడంతో ఆయన సాహిత్యం నిరాదరణకు గురవుతున్నది.
రైతు జీవితానికి కావ్య గౌరవం కల్పించి, తెలుగు నుడికారానికి ప్రాణంపోసి, తెనుగుదనానికి నిర్వచనంగా నిలిచిన తుమ్మలను కొంగర జగ్గయ్య 'కళా తపస్వి'గా సంభావించాడు. 'వాస్తవిక జగత్తుకు కాల్పనిక ప్రతిబింబమే కావ్యజగత్తు అన్న నిజాన్ని సీతారామమూర్తిగారు తమ రచనల ద్వారా నిరూపించారు.
పదవుల కోసం కుమ్ములాటను గాంచి కవి మనసు కలత చెందింది. ఇలా అంటాడు.
దొడ్డ తలపులున్న రెడ్డికైనను మాల
బిడ్డకైన నిమ్ము పెత్తనమ్ము కులము లింక నిల్వగలవటోయీ! వేరు
పరువు పడియె, వాని పరువు సెడియె
'బిచ్చగాడు లేని, మ్రుచ్చులేని, కటారిలేని, దొర తనమ్ములేని కుట్రలేని' దేశపరిస్థితుల కోసం కవి ఎదురుచూశాడు. నిజంగా అటువంటి రోజువస్తే అదే 'క్రొత్త సంక్రాంతి' కవికి. నేటి రచయితలకు 'పునాది తక్కువ' అని వారి నిశ్చితాభిప్రాయం.
ఒక ఇంటర్వ్యూలో తుమ్మల ఇలా అన్నారు. 'నా రచన పద్యము. దీనికి వ్యవహారిక భాష సాయపడదు. గణము కోసమో యతి ప్రాసల కోసమో సలక్షణ భాషనాశ్రయింపక తప్పదు. వచనము గేయము ఆధారముగా చేసుకొని యువ కవులు వ్యవహారిక భాషలో కవిత్వము వ్రాయుచున్నారు. వీరిలో శ్రీశ్రీ వంటి సిద్ధహస్తులు కొందరున్నారు. భాషా మార్గము ఏదైనను రచయిత లోతుగా సాహిత్య కృషి చేసినపుడే పది కాలాల పాటు అది చరిత్రలో నిలుచును. మా తరం వారు చదివినంత గట్టిగా నేటి యువతరం కావ్య పఠనం చేయడం లేదు. పత్రికల నిండా ఏదో రాస్తున్నారు.'
చాలా మంది పలుకులలో ప్రాణం లేదు. పునాది తక్కువ. తనదంతా విప్లవ కవిత్వం అని ఆయన భావన. తమతరం కవుల్లో శృంగారం జోలికి వెళ్లని వారిలో తుమ్మల మొదట నిలుస్తాడు. ఆయన రచన చేయడం ప్రారంభించాక భావ కవిత్వం వచ్చింది. తుమ్మల మనసు దాని మీదకు పోలేదు. తరువాత అభ్యుదయ, విప్లవ కవిత్వాలు వచ్చాయి. వాటి పద్ధతి తుమ్మల చూశాడు. అప్పటికి తుమ్మల రాసిందంతా విప్లవ కవిత్వమే! కాకపోతే ఒక తేడా ఉంది. తుమ్మల విప్లవం అంతా అహింసాయుతం.
తుమ్మల సీతారామమూర్తి స్వగృహంలోనే 1990 మార్చి 21న పరమపదించారు
సాహితీ కృషి :
సీతారామమూర్తి పలు రచనా రూపాలను స్పృశించాడు. ఆయన రచనలను స్థూలంగా కింది విధాలుగా విభజించవచ్చు.
- గాంధీకావ్యాలు – ఆత్మకథ, మహాత్మకథ, అమరజ్యోతి, సర్వోదయగానము, గాంధీగానము, మహాత్మగాంధీ తారావళి.
- రాష్ట్రకావ్యాలు – రాష్ట్రగానము, ఉదయగానము.
- ఖండకావ్యాలు – పఱిగపంట, పెద్దకాపు, శబల, పైరపంట, సమదర్శి, కదంబకైత, చక్కట్లు, దివ్యజ్యోతి.
- కథాకావ్యాలు – ఆత్మార్పణము, ధర్మజ్యోతి.
- సామాజిక కావ్యాలు – ఎక్కట్లు, సందేశసప్తశతి.
- స్వీయచరిత్ర కావ్యాలు – నేను, నా కథలు, తపస్సిద్ధి.
- వేదాంతకావ్యాలు – గీతాదర్శము, భజగోవిందం, లక్ష్మీనృసింహ స్తోత్రము, హనుమాన్ చాలీసా.
- నీతికావ్యాలు – తెనుగు నీతి, నీతికుసుమావళి.
- స్మృతికావ్యాలు – రామకృష్ణస్మృతి.
- శతకములు – పురాంతక శతకము, రామశతకము, రామలింగేశ్వర శతకము.
- జంగం కథలు – బిల్హణీయము.
- నాటకాలు – గిరికా పరిణయము, హనుమద్విజయము,మహేంద్ర జననము.
- హరికథలు – అన్నదాన మాహాత్మ్యము, సాత్రాజితీ పరిణయము, నామదేవ చరిత్రము.
కృతులు (ప్రచురించిన సంవత్సరము క్రమములో)
- గిరికా పరిణయము, 1911-1918
- మధ్య హనుమద్విజయము, 1911-1918 మధ్య
- అన్నదాన మాహాత్మ్యము, 1911-1918 మధ్య
- సాత్రాజితీ పరిణయము, 1911-1918 మధ్య
- పురాంతక శతకము, 1911-1918 మధ్య
- రామశతకము, 1919
- రామలింగేశ్వర శతకము, 1919
- బిల్హణీయము, 1920
- మహాత్మగాంధీ తారావళి, 1921
- నామదేవ చరిత్రము, 1922
- రామకృష్ణస్మృతి, 1923
- భజగోవిందం, 1923
- లక్ష్మీనృసింహ స్తోత్రము, 1925
- మహేంద్ర జననము, 1924
- ఆత్మార్పణము (4 ముద్రణలు), 1932-1953
- ఆత్మకథ (ప్రథమ భాగము), 1936
- నీతికుసుమావళి, 1937
- రాష్ట్రగానము (7 ముద్రణలు), 1938-1973
- ధర్మజ్యోతి (5 ముద్రణలు), 1943-1985
- పఱిగపంట (2 ముద్రణలు), 1943-1952
- పెద్దకాపు, 1948
- అమరజ్యోతి, 1948
- తపస్సిద్ధి, 1949
- ఆత్మకథ (మొత్తం అయిదు భాగములు), 1951
- ఉదయగానము (2 ముద్రణలు), 1955-1973
- శబల, 1955
- సర్వోదయగానము, 1961
- తెనుగు నీతి, 1961
- నేను, 1963
- గీతాదర్శము, 1963
- పైరపంట, 1964
- సమదర్శి, 1967
- మహాత్మకథ, 1968
- నా కథలు, 1973
- ఎక్కట్లు, 1976
- హనుమాన్ చాలీసా, 1978
- సందేశసప్తశతి, 1981
- కదంబకైత, 1983
- గాంధీగానము, 1987
- చక్కట్లు, 1993
- దివ్యజ్యోతి, 1994
-
తెనుఁగులెంక తుమ్మల సమగ్ర సాహిత్యము, తుమ్మల శతజయంతి ఉత్సవ సంఘ ప్రచురణ, గుంటూరు, 2001
- మొదటి భాగము – బాపూజీ ఆత్మకథ
- రెండవ భాగము – మహాత్మకథ
- మూడవ భాగము – ఖండకావ్యములు – రామశతకము, రామలింగేశ్వర శతకము, మహాత్మగాంధీ తారావళి, మహేంద్ర జననము, రామకృష్ణస్మృతి, ఆత్మార్పణము, రాష్ట్రగానము, ధర్మజ్యోతి, పఱిగపంట, శబల, ఉదయగానము, సర్వోదయగానము, తెనుగు నీతి, నేను, గీతాదర్శము
- నాల్గవ భాగము – ఖండకావ్యములు – పైరపంట, సమదర్శి, నా కథలు, హనుమాన్ చాలీసా, సందేశసప్తశతి, కదంబకైత, గాంధీగానము, చక్కట్లు, దివ్యజ్యోతి
తుమ్మల కవితా సంకలన గ్రంథములు
- యుగకవిత, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1984
- రంగా – భారతి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1986
- సంక్రాంతి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1988
- రైతుజీవనము, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1990
- సత్యం శివం సుందరం, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1990
- తుమ్మల వాణి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1992
- తుమ్మల యుగవాణి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1996
- తుమ్మల సుభాషితములు, తుమ్మల శ్రీనివాసమూర్తి , 2000
- తుమ్మల వాణి, తుమ్మల శతజయంతి ఉత్సవ కమిటి, 2001
- ఆంధ్రప్రశస్తి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 2004
- పండుగ కవితలు, తుమ్మల శ్రీనివాసమూర్తి , 2005
- తెనుఁగుతీపి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 2005
సన్మానములు
- 1949 నిడుబ్రోలులో – గజారోహణము, గండ పెండేరము, కనకాభిషేకము, సువర్ణకంకణము.
- 1960 లో అఖిల భారత తెలుగురచయితల మహాసభ సత్కారము.
- 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్టసభ్యత్వ ప్రదానము.
- 1969లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమానము
- 1969లో ఆంధ్ర విశ్వవిద్యాలయము "కళాప్రపూర్ణ" బిరుదుతో సత్కారము.
- 1984 మద్రాసులో శ్రీ ఎల్. వి. రామయ్య చారిటీస్ జాతీయకవి అవార్డు.
- 1985లో నాగార్జున విశ్వవిద్యాలయం నాగార్జున విశ్వవిద్యాలయము "డాక్టర్ ఆఫ్ లెటర్స్"(డి.లిట్) బిరుదుతో సత్కారము
- 1985 విశాఖపట్నంలో సహస్ర చంద్రదర్శన మహోత్సవము.
- నెల్లూరు, అప్పికట్ల, ముక్త్యాల, తెనాలి, గుడివాడ, మద్రాసు, గుంటూరు, విజయవాడ చీమకుర్తి మొదలగు తావులలో సన్మానాలు జరిగాయి.
- జయంతి మహోత్సవములు: 1952 నుండి పెక్కుచోట్ల జరిగాయి.
బిరుదులు
- ఇతరుల దృష్టిలో "అభినవతిక్కన"
- తన దృష్టిలో "తెనుఁగులెంక".
తుమ్మల జీవితము, కవిత్వము, వ్యక్తిత్వము పై ఇతరులు వ్రాసిన గ్రంథములు
- తెనుఁగులెంక తుమ్మల, గొల్లపూడి ప్రకాశరావు, 1975
- యుగకవి తెనుఁగులెంక శ్రీ తుమ్మల సీతారామమూర్తి, తుమ్మల శ్రీనివాస మూర్తి, 1989
- తెనుఁగులెంక తుమ్మల సీతారామమూర్తి కవిత్వం – వ్యక్తిత్వం, జూపూడి అమ్ములయ్య (అమూల్యశ్రీ), 1995
- తుమ్మల సీతారామమూర్తి (భారతీయ సాహిత్య నిర్మాతలు), నాగళ్ల గురుప్రసాదరావు, సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ, 2000
- అజరామరవాఙ్మయమూర్తి తుమ్మల సీతారామమూర్తి, సూర్యదేవర రవికుమార్, 2002