Latest posts
-
ఎప్పుడు దప్పులు వెదకెడు
ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్ సర్పంబు పడగనీడను గప్పవసించిన విధంబు గదరా సుమతీ! తాత్పర్యము నల్లతాచు నీడలో నివశించే కప్ప బతుకు ఎంత అస్థిరమో ఆవిధంగానే ఎప్పుడూ తప్పులు వెతికే యజమానిని సేవిచే వాడి బతుకూ ప్రాణభయంతో కూడినదే సుమా!
-
ఎప్పుడు సంపద కలిగిన
ఎప్పుడు సంపద కలిగిన అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్ దెప్పలుగ జెరువునిండిన గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ! తాత్పర్యము చెరువు నిండా నీరు చేరగానే వేలకొద్దీ కప్పలు అందులో చేరునట్లే సంపద కలిగిన వారి వద్దకే బంధువులు ఎక్కువగా జేరుకొందురు.
-
ఏరకుమీ కసుగాయలు
ఏరకుమీ కసుగాయలు దోరకుమీ బంధుజనుల దోషముసుమ్మీ పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ! తాత్పర్యము భూమిపై… పచ్చికాయలు ఏరి తినకు. చుట్టాలను దూషించకు. యుద్ధం నుంచి వెనుతిరిగి పారిపోకు. పెద్దల ఆజ్ఞలను జవదాటకు సుమా!
-
ఒకయూరికి నొక కరణము
ఒకయూరికి నొక కరణము నొక తీర్పరియైనఁ గాక వొగిఁదరుచైనం గకవికలు గాక యుండునె సకలంబును గొట్టువడక సహజము సుమతీ! తాత్పర్యము ఒక గ్రామానికి ఒక లేఖరి, ఒక ధర్మాధికారి ఉండాలి. అలాకాక ఎక్కువమంది అయితే అనేక గందరగోళాలు పుట్టి సమస్తం చెడిపోవుట సహజము.
-
ఒల్లనిసతి నొల్లనిపతి
ఒల్లనిసతి నొల్లనిపతి నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే గొల్లండు గాక ధరలో గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ! తాత్పర్యము తన్ను ప్రేమించని భర్యను, యజమానిని, స్నేహితుడ్ని విడిచి పెట్టడానికి అంగీకరించనివాడే వెర్రి గొల్లవాడు గానీ జాతిచేత గొల్లవాడైనంత మాత్రాన గుణాల్లో వెర్రి గొల్లవాడు కాదు.
-
ఓడల బండ్లును వచ్చును
ఓడల బండ్లును వచ్చును ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చును ఓడలు బండ్లును వలెనే వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ! తాత్పర్యము నావలపై బళ్లు, బళ్లపై నావలు వచ్చునట్లే, భాగ్యవంతులకు దారిద్య్రం, దరిద్రులకు భాగ్యం పర్యాయంగా వస్తూంటాయి.
-
కడు బలవంతుడైనను
కడు బలవంతుడైనను బుడమిని బ్రాయంపుటాలి బుట్టినయింటం దడవుండనిచ్చె నేనియు బడుపుగ నంగడికి దానె పంపుట సుమతీ! తాత్పర్యము ఎంత సమర్థత కలవాడైనా యవ్వనంలో భార్యను చిరకాలం పుట్టింట ఉండనిచ్చినచో తానే స్వయంగా భార్యను వ్యభిచార వృత్తికి దింపినవాడగును.
-
కనకపు సింహాసనము
కనకపు సింహాసనము శునకముఁ గూర్చుండబెట్టి శుభలగ్నమునఁ దొనరఁగ బట్టముగట్టిన వెనకటి గుణమేల మాను వినరా సుమతీ! తాత్పర్యము శుభ ముహూర్తంలో కుక్కను తీసుకొచ్చి బంగారు సంహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా, దాని నిజనైజాన్ని ఎలా మానలేదో అల్పునికి ఎంత గౌరవం చేసి మంచి పదవి ఇచ్చినా తన నీచత్వాన్ని వదలలేడు.
-
కప్పకు నొరగాలైనను
కప్పకు నొరగాలైనను సప్పమునకు రోగమైన సతి తులువైనన్ ముప్పున దరిద్రుడైనను దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతీ! తాత్పర్యము కప్పకు కాలు విరిగినా, పాముకు రోగం వచ్చినా, భార్య దుష్టురాలైనా, ముసలితనంలో దారిద్య్రం సంభవించినా ఎక్కువ దుఃఖప్రదాలు అవుతాయి.
-
కమలములు నీడఁ బాసినఁ
కమలములు నీడఁ బాసినఁ గమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్ దమ దమ నెలవులు దప్పినఁ దమ మిత్రులు శతృలౌట తథ్యము సుమతీ! తాత్పర్యము కమలములు పుట్టిల్లయిన నీటిని విడిచిపెట్టి మిత్రుడు అయిన సూర్యుని ఎండ తాకిన వెంటనే కమిలిపోతున్నాయి. అలాగే, మానవులు తమ నివాసాలను విడిచిపెడితే స్నేహితులే శతృలవుతారు.