పద్మనాభం

Padmanabham పద్మనాభం! తెలుగు తెర హాస్య నటశ్రేణిలో అగ్రగణ్యుడు. రెండు మూడు దశాబ్దాల పాటు ప్రేక్షక జనాన్ని నవ్వుల జల్లుల్లో తడిపిన నట ప్రముఖుడు. అనేకానేక చిత్రాలు నిర్మించి విజయాలూ ప్రశంసలూ పొందిన విలక్షణ కళాభిజ్ఞుడు. అనేకమంది కొత్తవారిని పరిచయం చేసి సినీజీవితం అందించిన అనుభవశాలి. శ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను గాయకునిగా పరిచయం చేసిన ఘనత పద్మనాభానిదే  

కెవిరెడ్డి, బిఎన్‌రెడ్డి వంటి మహోన్నత దర్శకుడిని అందించి కడపజిల్లానుంచి తారాపథానికి చేరిన కొద్దిమంది అగ్రతారల్లో ఆయనొకరు. ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు. ఈయన తొలి తెలుగు సినిమా విడుదలైన సంవత్సరం 1931లో ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా  పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు. తల్లి శాంతమ్మ. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య కడపజిల్లా వేంపల్లెకి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవాడు.ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. మూడవయేటి నుంచి పద్యాలుపాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ ఊరి టెంటు హాలులో "ద్రౌపదీ వస్త్రాపహరణం", "వందేమాతరం", "సుమంగళి", శోభనావారి "భక్త ప్రహ్లాద" మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు, అనుకరిస్తుండేవాడు.
 
నాటకాల మీద రక్తితో సినీరంగంలో ప్రవేశించి అనేక ఢక్కాముక్కీలు తింటూ దాన్నే నమ్ముకుని అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి ఆయన. మాయాలోకం ఆయన తొలి చిత్రమైనా బాగా దగ్గరైంది మాత్రం 1951లో 'పాతాళ భైరవి'లోని పాత్రతోనే. 'సాహసము సేయరా డింభకా రాజకుమారి లభిస్తుంది' అంటూ ఎస్వీఆర్‌ నేపాల మాంత్రికుడి డైలాగులతో వూపేస్తుంటే సదాజపుడుగా పద్మనాభం 'మోసం గురూ' అంటూ దర్శనమిస్తాడు. 1932లో పుట్టి కన్నాంబ నాగభూషణం దంపతుల సహాయంతో రంగప్రవేశం చేసిన పద్మనాభం ఆ తర్వాతే పరిశ్రమ దృష్టిలో పడ్డాడు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్‌కు దగ్గరయ్యాడు. విజయా వారి కళాఖండం 'షావుకారు'(1949)లో మొద్దబ్బాయి పాత్రలో(ఆహార్యం దాదాపు అరగుండు బ్రహ్మానందం తరహాలో వుంటుంది) మెప్పించి తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు.
 
రేలంగి ఏకచ్ఛత్రంగా ఏలుతున్న కాలంలో ఆయనకూ రమణారెడ్డికి మధ్య తనకూ చోటు చిక్కించుకోవడం పద్మనాభం ప్రతిభకు నిదర్శనం. అలా అలా ఆయన 400కు పైగా చిత్రాల్లో నటించేశాడు. హాస్యనటులందరూ నవ్వించే వారే అయినా అందులో రకరకాలు. చలాకీతనం, హావభావాలు, తమాషా పోకడలు, సంభాషణలు విచిత్ర విన్యాసాలు ఇలా ఒక్కొక్కరూ ఒక్కో దాంట్లో పట్టు సాధిస్తారు. రేలంగి టక్కరి తరహా మాటలు, ఎదుటి వారిని బుట్టలో పెట్టేయడం వంటివి ఎక్కువగా చేసేవారు. అల్లు రామలింగయ్య 'వ్వువ్వూ' అంటూ మూలగడం, ఎదుటి వారిని ఎగాదిగా చూడడం వంటివి చేస్తాడు. రమణారెడ్డి రూపమే సగం నవ్వు పుట్టిస్తే ఆపైన ఆయన టక్కరి వేషాలు ఇంకా అలరిస్తాయి. పద్మనాభం వీటన్నిటికీ భిన్నమైన ప్రక్రియలు చూపించవలసివచ్చింది. ఆయన డైలాగ్‌ మాడ్యులేషన్‌పై దృష్టి పెట్టాడు. 'మాయాలోకం'లోనే ఆయన తన ప్రత్యేక ఉచ్ఛారణ చూపించడం అందరినీ ఆకర్షించింది. తర్వాత అదే ట్రేడ్‌మార్క్‌గా మారింది. తను నటించిన 'కార్తవరాయని కథ' తమిళ వెర్షన్‌లో నటించిన తంగవేలు నుంచి పద్మనాభం ఆ విద్యను మరింత బాగా వంటపట్టించుకున్నాడు.
 Padmanabham
మిగిలిన హాస్య నటులెవర్ని గుర్తుచేసుకున్నా వారి హావభావాలు, సన్నివేశాలు గుర్తుకొస్తాయి. వారందరిలోనూ అతి ప్రఖ్యాతులైన రాజబాబును తల్చుకుంటే హడావుడి, బ్రహ్మానందంను గుర్తుచేసుకుంటే వింత వింత వేషాలు మదిలో మెదులుతాయి. అదే పద్మనాభంను అనుకోగానే 'అయ్యొ అయ్యొ' అని ముక్కుతో మాట్లాడే విదూషకుడే సాక్షాత్కరిస్తాడు. అదే ఆయన ప్రత్యేకత. ఎక్కువ చిత్రాల్లో గీతాంజలి ఆయనకు జోడీ. వీరిద్దరూ కలిసి నటించిన పూలరంగడులో ఈ విద్యను మరీ ఎక్కువగా చూపించాడు. జమునతో ఒక పాట కూడా వుంటుంది. వాస్తవానికి ప్రతి చిత్రంలోనూ పద్మనాభంకు ఒక పాట తప్పనిసరి. వాటిలో కొన్ని బాగా హిట్టయ్యాయి కూడా. ఇది ఆయన స్టార్‌డమ్‌ను తెలుపుతుంది. తర్వాతికాలంలో విషాద పాత్రలకు పేరెన్నికగన్న శారద కూడా ఆయనతో వినోద పాత్రలో కనిపించడం ఒక విశేషం.
 
'మూగమనసులు'లో సావిత్రిని పెళ్లి చేసుకునే పాత్రలో నటించడం కూడా ఆయనకే చెల్లింది. పద్మనాభం పాత్రల్లో హాస్యంతో పాటు ఒకింత బరువు బాధ్యతలు కూడా వుండేవి. చాలాసార్లు ఆయన అమాయకుడైన, కొత్తవాడైన హీరోకు అండదండగా నిలిచి నడిపించడం చూస్తాం. చలం సొంత చిత్రం 'మట్టిలో మాణిక్యం'లో గానీ ఆఖరుకు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల కొన్ని చిత్రాల్లో గానీ కథకు సూత్రధారిగా ఆయన అగుపిస్తాడు. అక్కినేనితో 'పవిత్రబంధం, ఆత్మీయులు, దసరా బుల్లోడు, విచిత్రబంధం, జై జవాన్‌, అదృష్టవంతులు' వంటి ఎన్నో చిత్రాల్లో అగుపించిన ఆయన ఎన్టీఆర్‌తో మరింత ఎక్కువగా నటించారు. సాంఘిక, పౌరాణిక, జానపద అన్న తేడా లేకుండా అన్నింటిలోనూ అమరిపోయాడు.
 
అయితే అందులో చెప్పుకోవలసింది - శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ సత్య వంటి చిత్రాల్లో ఎన్టీఆర్‌, కృష్ణ పాత్రల పక్కన వయస్యుడు వసంతయ్యగా నటించిన పద్మనాభం గురించి. 'దాగుడు మూతలు, పాండురంగ మహత్యం, రాము, కోడలు దిద్దిన కాపురం, కథానాయకుడు' వంటి చాలా చిత్రాలు వారి కాంబినేషన్‌లో రూపొందాయి. కృష్ణతో నటించిన 'రాజేశ్వరి విలాస్‌ కాఫీ క్లబ్‌'లో అలవాటులేని మాంసాహారం చేసి కోడి మీదకు వచ్చినట్టు భ్రమపడే నరసింహశాస్త్రి పాత్ర మర్చిపోలేనిది. 'బంగారుబాబు'లో దర్శకుడు పుల్లయ్య వేషభాషలను అనుకరించే పాత్ర కూడా వెరైటీనే.
 
తక్కిన హాస్యనటులతో పోలిస్తే పద్మనాభం ఎక్కువకాలం నటించగలిగారు. వేషభాషలు మారిన తర్వాత కూడా కొనసాగాడు. ఇందుకు ఆయన క్రమశిక్షణ కూడా చాలా కారణం. ఎనిమిదిపదుల దరిదాపుకు చేరుతున్నా ఆయన నటన మానలేదు. కొన్నేళ్ల కిందట చక్రం సినిమాలో తన పాత్రలో తనే నటించి 'జగమంత కుటుంబం నాది' అన్న చరణాలు వినిపించి చిత్రానికి ప్రాణం పోశాడు.
 
పద్మనాభం కేవలం నటుడుగానే గాక నిర్మాతగానూ దర్శకుడుగానూ కూడా ప్రఖ్యాతి గాంచారు. ఎన్టీఆర్‌తో ఉన్న  స్నేహాన్ని పురస్కరించుకుని సావిత్రి ద్విపాత్రాభినయంతో ఆయన హీరోగా దేవత చిత్రం తీసి ఘన విజయం సాధించారు. ఇందులో పద్మనాభం పిచ్చి రామదాసుగా నటించాడు. ఈ చిత్రం పెద్ద మ్యూజికల్‌ హిట్‌. ఎన్టీఆర్‌ 'బొమ్మను చేసి ప్రాణము పోసి' వంటి బరువైన విషాద గీతం ఆలపించిన చిత్రం కూడా అదే. ఈ ఊపుతో పద్మనాభం భమిడిపాటి రచించిన నాటిక ఆధారంగా పొట్టి ప్లీడరు చిత్రం తీశారు. ప్రధాన పాత్ర ఆయనదైనా శోభన్‌బాబు, గీతాంజలి జంటగా నటించారు. జానపద కథతో 1967లో 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కద'¸ తీసి విజయం సాధించారు. ఈ చిత్రంతోనే గాయకుడిగా ఎస్పీబాలసుబ్రహ్మణ్యం పరిచయమైన సంగతి ఇప్పుడు సుప్రసిద్ధమే. సంగీత దర్శకుడైన కోదండ పాణి ఇందుకు ప్రధాన కారకుడైనా కొత్తగొంతును ధైర్యంగా ఆదరించిన పద్మనాభంను కూడా మర్చిపోలేము.
 
ఈ మూడు చిత్రాలు హేమాంబరదరరావు దర్శకత్వంలో తీసినా తర్వాత పద్మనాభం తనే ఆ బాధ్యతను కూడా నెత్తిన వేసుకోవడంతో ఆయన జీవితంలో మలి అధ్యాయం మొదలైంది. అలా మొదట 'శ్రీరామకథ' తీశారు. ఇందులో హరనాథ్‌, జయలలిత నాయకానాయికలు. అయితే ఈ కథ అందరికీ తెలిసిన రామాయణం కాక 'శ్రీమతి కళ్యాణం' అనే కొత్త కోణాన్ని తీసుకున్నారు. తను నారదుడి వేషం వేశారు. ఇందులో బాలు 'రామకథ శ్రీ రామకథ' అనే సుదీర్ఘ గీతం పాడారు. తర్వాత కుమ్మరి మొల్లగా సుపరిచితమైన రామాయణ రచయిత్రి కథను వాణిశ్రీతో 'కథానాయిక మొల్ల'గా చాలా చక్కగా తీసి బంగారు నంది పొందారు. కానీ ఆర్థికంగా ఈ చిత్రాలేవీ ఆయనను గట్టెక్కించలేదు.
 
ఆయన నిర్మాణమూ ఆపలేదు. నూతన తారలతో కొంతభాగం రంగుల్లో 'జాతకరత్న మిడతంభొట్లు' తీసి చేతులు కాల్చుకున్నారు. అలాగే నాగభూషణం ప్రధాన పాత్రధారిగా చాలామంది తారలతో ఆజన్మ బ్రహ్మచారి తీసినా ఫలితం దక్కలేదు. తుఫాను బాధితుల సహాయార్థం తెలుగు నటీనటులు వేసిన సాంస్కృతిక ప్రదర్శనలను సినిమా వైభవం పేరిట చిత్రంగా విడుదల చేసి వైవిధ్యం కనబర్చారు. తర్వాత హిందీలో మొహమూద్‌ తీసిన 'కువారబాప్‌' అనే బరువైన చిత్రాన్ని పెళ్లికాని తండ్రిగా తెలుగులో తీసి నష్టపోయారు. భానుమతితో 'మాంగల్య భాగ్యం' అనే మరో సినిమా తీశారు. రేఖా అండ్‌ మురళీ ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌లో ఇలా చిత్రాల జాబితాతో పాటు ఆయన ఆర్థిక భారాలూ పెరిగిపోయాయి.
 
పద్మనాభం తనే ఆ బాధ్యతను కూడా నెత్తిన వేసుకోవడంతో ఆయన జీవితంలో మలి అధ్యాయం మొదలైంది. అలా మొదట 'శ్రీరామకథ' తీశారు. ఇందులో హరనాథ్‌, జయలలిత నాయకానాయికలు. అయితే ఈ కథ అందరికీ తెలిసిన రామాయణం కాక 'శ్రీమతి కళ్యాణం' అనే కొత్త కోణాన్ని తీసుకున్నారు. తను నారదుడి వేషం వేశారు. ఇందులో బాలు 'రామకథ శ్రీ రామకథ' అనే సుదీర్ఘ గీతం పాడారు. తర్వాత కుమ్మరి మొల్లగా సుపరిచితమైన రామాయణ రచయిత్రి కథను వాణిశ్రీతో 'కథానాయిక మొల్ల'గా చాలా చక్కగా తీసి బంగారు నంది పొందారు. కానీ ఆర్థికంగా ఈ చిత్రాలేవీ ఆయనను గట్టెక్కించలేదు. ఆయన నిర్మాణమూ ఆపలేదు.

మారిన కాలంతో పాటు మారిన పద్ధతులు, వయోభారం వల్ల పద్మనాభం చాలా కాలంగా పరిశ్రమకు దూరంగా వుండిపోయారు. 'టాటా బిర్లా మధ్యలో లైలా' ఆయన ఆఖరి చిత్రం. అడపా దడపా తన జ్ఞాపకాలు చెబుతూ కాలం గడిపి చివరికి నవ్వులే మిగిల్చి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 20, 2010 ఉదయం గుండెపోటుతోఆయన మృతి చెందాడు. ఆయనకు సంతాపం తెలిపేందుకు ఎవరూ రాలేదని విమర్శలు వచ్చాయి గానీ హాస్య రసాస్వాదకులు, కళాభిమానులు ఆయనకు మన:పూర్వక నివాళులర్పించారు.