Latest posts
-
మాటకు బ్రాణము సత్యము
మాటకు బ్రాణము సత్యము కోటకుఁ బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్ బోటికిఁ బ్రాణము మానము చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ! తాత్పర్యము నోటిమాటకు సత్యం, పెద్ద దుర్గానికి గొప్ప సైన్య సమూహం, స్త్రీకి అభిమానం, పత్రానికి చేవ్రాలు ముఖ్యమైన ఆధారాలు.
-
మానఘనుఁ డాత్మధృతిఁ జెడి
మానఘనుఁ డాత్మధృతిఁ జెడి హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్ మానెడు జలములలోపల నేనుఁగు మెయి దాఁచినట్టు లెరగుము సుమతీ! తాత్పర్యము అభిమాన శ్రేష్టుడు మనోధైర్యం చెడి అల్పుని ఆశ్రయించడం మానెడు నీళ్లలో ఏనుగు తన శరీరాన్ని మరుగుపరచినట్లుండును.
-
నాది నొకని వలచియుండగ
నాది నొకని వలచియుండగ మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్ బొది జిలుక పిల్లి పట్టిన జదువునె యా పంజరమున జగతిని సుమతీ! తాత్పర్యము పిల్లి పంజరాన్ని పట్టుకుంటే ఆ పంజరంలో ఉన్న చిలుక మాట్లాడుతుందా? అలాగే, మనసులో ఒకతన్ని ప్రేమించిన స్త్రీ విటుడు ఎంత బతిమాలినా ప్రేమించదు
-
రా పొమ్మని పిలువని యా
రా పొమ్మని పిలువని యా భూపాలునిఁ గొల్వ ముక్తి ముక్తులు గలవే దీపంబు లేని ఇంటను చెవుణికీళ్లాడినట్లు సిద్ధము సుమతీ! తాత్పర్యము దీపంలేని ఇంట్లో చేవుణికీళ్లాట ఆడితే ఏవిధంగా ఆనందం కలగదో ఆ విధంగానే రమ్మని కానీ పొమ్మని కానీ చెప్పని రాజును సేవించడం వల్ల జీవమూ లేదు. మోక్షమూ లేదు. వట్టి నిష్ప్రయోజనం.
-
రూపించి పలికి బొంకకు
రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ గోపించురాజుఁ గొల్వకు పాపుదేశంబు సొరకు పదిలము సుమతీ! తాత్పర్యము సాక్షులతో నిర్ధారణ చేసి అబద్ధాన్ని నిజమని స్థిరపరచడం, ఆప్తబంధువులను నిందించడం, కోపిని సేవించడం, పాపభూమికి వెళ్లడం తగని పనులు. కావున ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
-
లావుగలవానికంటెను
లావుగలవానికంటెను భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ గ్రావంబంత గజంబును మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ! తాత్పర్యము పెద్ద పర్వతమంటి ఏనుగుకంటే చిన్నవాడైన మావటి లోబరుచుకుని ఎక్కుచున్నాడు కనక మావటి గొప్పవాడు. అలాగే శరీరబలం కలవాని కంటే బుద్ధిబలం కలవాడే నిజమైన బలవంతుడు.
-
వరదైన చేను దున్నకు
వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనుల కడకేగకుమీ పరులకు మర్మము సెప్పకు పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ! తాత్పర్యము వరద ముంచిన చేనును దున్నవద్దు. కూడు కరవైనను బంధువుల ఇంటికి పోవద్దు. ఇతరులకు రహస్యాల్ని చెప్పవద్దు. పిరికివాడికి సేనానాయక పదవిని ఇయ్యవద్దు.
-
వరి పంటలేని యూరును
వరి పంటలేని యూరును దొరయుండని యారు తోడు దొరకని తెరువున్ ధరను బతిలేని గృహమును అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ! తాత్పర్యము న్యం పంటలేని గ్రామం, రాజు నివశింపని నగరం, సహాయం దొరకని మార్గం, భర్త (రాజు)లేని గృహం ఆలోచించగా స్మశానంతో సమానమని చెప్పవచ్చు.
-
వినదగు నెవ్వరుచెప్పిన
వినదగు నెవ్వరుచెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము దెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ! తాత్పర్యము ఎవరు ఏం చెప్పినా వినవచ్చు. విన్నా వెంటనే తొందరపడకుండా బాగా పరిశీలన చేయాలి. అలా పరిశీలించి అది నిజమో అబద్దమో తెలుసుకొన్న మనిషే ధర్మాత్ముడు.
-
వీడెము సేయని నోరును
వీడెము సేయని నోరును జేడెల యధరామృతంబుఁ జేయని నోరును బాడంగరాని నోరును బూడిద కిరవైన పాడు బొందర సుమతీ! తాత్పర్యము తాంబూలం వేసుకోని, స్త్రీల అధరామృత పానం చేయని, గానం చేయని నోరు పెంట బూడిద పోసుకొనే గోయితో సమానం సుమా!