భారత కోకిల శ్రీమతి సరోజినీ నాయుడు

Sarojini Naiduస్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహిళల కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేసిన వారిలో సరోజినీనాయుడు ప్రముఖు రాలు. కవిత్వంతో మాధుర్యన్ని కురిపించి ' నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా' గా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు. భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా, స్వతంత్ర భారతదేశపు మొదటి మహిళా గవర్నరుగా పనిచేసిన ఆమె రాజకీయాల్లో మహిళలకు అత్యున్నతస్థానం సాధ్యమే అని నిరూపించారు.

మహిళల సమస్యలపై, అంటరానితనంపై పోరాటం చేసిన సరోజినీనాయుడు హిందూముస్లీం భాయిభాయి అంటూ సఖ్యతను చాటారు. ఫిబ్రవరి 13, 1897న హైదరాబాద్‌ లోని బెంగాలీ బ్రాహ్మణ కుంటుంబంలో ఆమె జన్మించారు. తల్లిదండ్రులు అఘోరనాథ చటోపాధ్యాయ, వరద సుందరీ దేవి. శాస్త్రవేత్త,తత్వవేత్త అయిన అఘోరనాథ చటోపాధ్యాయ హైదరాబాద్‌లో నిజాం కాలేజీ ని స్థాపించి, ప్రిన్స్‌పాల్‌గా చాలా కాలం పనిచేశారు. తల్లి వరద సుందరీ దేవి కవియిత్రి. అమ్మనాన్నల అక్షరజ్ఞానాన్ని, సాహిత్యా భిరుచిని పుణికిపుచ్చుకున్న సరోజిని నాయుడు చిన్నతనం లోనే ఉర్దూ, తెలుగు, ఆంగ్లం, పర్షియన్‌, బెంగాలీ భాషలు అనర్గళంగా మాట్లాడేది. పిబిషెల్లీ కవిత్వాన్ని ఆమె చాలా ఇష్టపడేవారు.

మహిళల విద్యపై అనేక ఆంక్షలు ఉన్న ఆ రోజుల్లోనే తల్లిదండ్రుల ప్రోత్సహంతో సరోజిని ఉన్నతవిద్యను అభ్యసించింది. 1891లో జరిగిన మెట్రిక పరీక్షలో రాష్ట్రం లోనే ప్రథమస్థానం లో ఉత్తీర్ణత పొందిన ఆమె అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆమె తెలివితేటలకు ఆశ్చర్య పడిన నిజాం నవాబు ఆమెను విదేశాలకు పంపించాడు. 1898 వరకు ఇటలీ,స్విట్జర్లాండ్‌ లో ఉండి అపారమైన విజ్ఞానాన్ని సంపాదించిన ఆమె ఎందరో ప్రపంచప్రఖ్యాతి గాంచిన రచయితల కవిత్వాలు, గ్రంధాలు చదివారు. ఎన్నో కవితలను రాసి విదేశీయుల ప్రసంశలను అందుకున్నారు. స్వదేశానికి తిరిగివచ్చిన తరువాత డిసెంబర్‌ 2, 1898లో డాక్టర్‌ గోవిందరాజులు నాయుడును ప్రేమవివాహము చేసుకున్నారు. వారి విహహాన్ని సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జరిపించాడు. సమాజంలో కులాంతర వివాహలను వ్యతిరేకిస్తున్నరోజుల్లో ఆమె తీసుకున్న సాహసోపేత చర్య ఎందరో ఆగ్రహానికి గురి చేసినా సరోజిని వాటిని లెక్కచేయకుండా ధైర్యంగా నిలిచారు.

మహిళల విద్యకోసం, అంటరానితనం నిర్మూలన కోసం సరోజినీ రాజీలేని పోరాటం చేసిన ఆమె సాహిత్యంలోనూ విశేషకృషి చేశారు. 1905 గోల్డెన్‌ థ్రెషోల్డ్‌, 1912లో దబర్డ్‌ ఆఫ్‌ టైమ్‌, 1917లో ది బ్రోకెన్‌ వింగ్‌, ద పోయెమ్స్‌ ఆఫ్‌ లైఫ్‌ అండ్‌ డెత్‌ తదితర కవితాసంపుటాలు ప్రచురించ బడ్డాయి.

ప్రముఖపోరాటయోధుడు గోపాలకృష్ణాగోఖలేతో 1912 సంవత్సరంలో జరిగిన పరిచయం ఆమెలో నూతనఉత్తేజాన్ని తీసుకువచ్చింది. హిందూ ముస్లింల సఖ్యత గురించి ప్రజలకు వివరించాలని ఆమె నిర్ణయించుకున్నారు. మార్చి 22, 1912 లో లక్నో నగరంలో జరిగిన ముస్లింలీగ్‌ మహాసభలో హిందూ ముస్లీం భాయిభాయి అంటూ అనర్గళంగా ఆమె చేసిన ప్రసంగం ఎందరినో ప్రభావితం చేసింది. ఆమె వాగ్ధాటికి మంత్రముగ్ధులైన ప్రేక్షకులు చేసిన నినాదాలు మిన్నంటాయి. హిందూ ముస్లీంలు ఐక్యపోరాటం ద్వారా ఆంగ్లేయులను తరిమికొట్టాలన్న ఆమె సందేశం ఎందరిలోనూ మార్పు తీసుకువచ్చింది. జాతిపిత మహ్మాతగాంధీని 1914 లో కలిసిన సరోజిని ఆయనకు ముఖ్యఅనుచరురాలిగా మారారు. 1916లో లక్నోలో జరిగిన ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో పాల్గొ నడంతో ఆమె రాజకీయ జీవితం ప్రారంభం అయ్యింది. 1930లో దండయాత్ర, ఉపðసత్యాగ్రహాలలో పాల్గొనందుకు గాను ఆమె కారాగార శిక్షను అనుభవించారు. 1931లో లండన్‌లో జరిగిన రౌండ్‌టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో గాంధీజితో పాటుగా పాల్గొన్నారు. రాయల్‌ సొసైటీకి సభ్యురాలిగా ఎన్నికైయ్యారు. ఆమె కవితకు కెయిజర ఇ హింద్‌ స్వర్ణ పతకం లభించింది. భారతజాతీయ కాంగ్రెస్‌కు మొదటి మహిళా అధ్యక్షురాలు గా ఆమె పేరు చిరస్మరణీయం. స్వతంత్య్రభారతంలో ఆమె 1949 వరకు యునైటెడ్‌ ప్రావిన్సెస్‌కు గవర్నర్‌గా పనిచేసి మహిళలు రాజకీయ రంగంలోనూ రాణించగలరని నిరూపించారు. కవికోకిలగా ప్రసిద్ది పొందిన ఆమె మార్చి 2, 1949 న లక్నోలో మరణించారు.

సరోజినీ నాయుడు నివసించిన ఇంటికి ఆమె రాసిన మొదటి కవితాసంపుటి గోల్డెన్‌ థ్రెషోల్డ్‌ గా పేరు పెట్టి, హైదరాబాద్‌ యూనివర్సిటీ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడ హైదరాబాద్‌ పర్యటనకు గుర్తుగా నాడు గాంధీజీ నాటిన చెట్టు ఉంటుంది. మహిళా విద్యకోసం, హిందూ ముస్లీంల మధ్య సోరదభావం కోసం పనిచేసిన సరోజినీనాయుడు స్పూర్తితో నేటి మహిళలు ముందుకు సాగాలని, రాజకీయరంగంలో తమ ప్రతిభను చాటుకోవాలని ఆశిద్దాం.

మూలం / సేకరణ: 
Andhraprabha