ఘంటసాల

Ghantasalaఘంటసాల వెంకటేశ్వరరావు గారు (1922, డిసెంబర్ 4 - 1974) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు.  ఘంటసాల ఒక తెలుగు సినీ నేపధ్యగాయకుడిగా మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయన గాన గాంధర్వం ఒక్క తెలుగు భాషకే పరిమితం కాలేదు. తమిళం, కన్నడం, మళయాళం, సింహళం, చివరకు హిందీలో కూడా పాడారు.
 

 ఘంటసాల వెంకటేశ్వరరావు తండ్రి సూరయ్య గారికి మృదంగం లోనూ, తరంగాలు పాడడం లోనూ ప్రవేశం ఉండేది. కాని పదకొండేళ్ళకే తండ్రిని కోల్పోయిన వెంకటేశ్వరరావుకు పేదరికపు కష్టాలు చిన్న వయసులోనే ఎదురయాయి. చదువు సరిగ్గా సాగకపోయినా తన తండ్రి కోరినట్టుగా సంగీతం అభ్యసించాలనే పట్టుదలతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అతను విజయనగరం వెళ్ళి సంగీత కళాశాలలో చేరాడు. ఆరేళ్ళపాటు గురువు పట్రాయని సీతారామశాస్త్రిగారి వద్ద సంగీత శిక్షణ సాగింది.  ఘంటసాల వెంకటేశ్వరరావు మొదట్లో జోలె భుజాన వేసుకుని మధూకరం ద్వారా పొట్ట పోషించుకోవలసి కూడా వచ్చింది. ఏలాగైతేనేం సంగీతంలో పట్టభద్రుడయ్యాడు. శాస్త్రిగారి నుంచి ఘంటసాలకు శ్రుతిశుద్ధి, నాదశుద్ధి, గమకశుద్ధి, తాళగత, స్వరగత లయశుద్ధి అలవడ్డాయి. పాటల్లో సాహిత్యం ముఖ్యమనే అవగాహన కలిగింది.

ఆ తరవాత కొన్నాళ్ళు కచేరీలూ, హరికథలూ, రేడియో కార్యక్రమాలతో గడిచాయి. స్టేజినాటకాల్లో నటించే అవకాశాలు కూడా కలిగాయి. పెద్దలంతా మెచ్చుకున్నారు కాని ఆదాయం మాత్రం పెరగలేదు. ఇంతలో 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంవల్ల ప్రభావితుడైన ఘంటసాల దేశభక్తి గేయాలను గానం చేస్తూ కొన్నాళ్ళు జెయిలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ పాటల రికార్డులు విశేష జనాదరణ పొందాయి. ఆ రోజుల్లోనే ఆయనకు వివాహం జరగడం, అత్తవారి ఊరిలో సినీ రచయిత సముద్రాల సీనియర్‌తో పరిచయం కలిగాయి. సముద్రాల ద్వారా 1944లో ఘంటసాల సినీ రంగంలో ప్రవేశించాడు. మొదట్లో అక్కినేని నాగేశ్వరరావు పాటలతోనూ, ఘంటసాల నటనతోనూ ఒకేసారి కుస్తీ పడుతూండేవారు. ప్లేబాక్‌ పద్ధతి రావడం తో ఎవరి పాత్ర వారికి లభించినట్టయింది. సినీ నేపథ్య గాయకుడిగా త్వరలోనే ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది.

పాటలో నటించడం ఆయనకు సహజంగా అబ్బిన విద్య. ఆయన గాత్రంలో ఉన్న లాలిత్యం, దానితో బాటు గాంభీర్యం; మూడు స్థాయిలలోనూ అవలీలగా పలికే రాగ భావం, శబ్దోచ్చారణలోని స్పష్టత, రాగాల గురించిన నిర్దుష్టమైన అవగాహన ఇలా ఎన్నో ఉత్తమ లక్షణలు ఆయన పాటలను తీర్చి దిద్దాయి. వివిధ సన్నివేశాలలో పాడిన విషాద గీతాలు, ప్రేమ గీతాలు, యుగళ గీతాలే కాక హరి కథలు, బుర్ర కథలు, జానపద గీతాలు, హాస్యగీతాలు, శాస్త్రీయ గీతాలు ఆయన గానంలోని విస్తృత పరిధికి అద్దం పడతాయి. పాటలే కాదు, పద్యాలను కూడా అతిగా రాగం తియ్యకుండా అర్థం, రాగభావం సమపాళ్ళలో మేళవించి పాడే పద్ధతి ఆయనకే చెల్లింది.

Ghantasalaఆయన పాడిన శకంలో ఉద్దండులైన సంగీత దర్శకులుండేవారు. రాజేశ్వరరావు, సి.ఆర్‌.సుబ్బరామన్‌, పెండ్యాల, ఆదినారాయణరావు, సుసర్ల దక్షిణామూర్తి వంటివారి గొప్పదనం ఘంటసాల పాటలకు ఎక్కువ దోహదం చేసిందో, ఆయన వల్ల వారంతా రాణించారో చెప్పడం కష్టం. స్వరకర్తలూ గాయకులే కాక పాటల రచయితలూ, బి.ఎన్‌.రెడ్డి వంటి సినీ దర్శకులూ పాటల పట్ల ఎంతో శ్రద్ధ చూపేవారు కనుకనే అటువంటి సంగీతం తయారయింది. ఈ నాటి సంగీతంలో లోపాలున్నాయంటే అందుకు కారణం “రాగాల్లోనూ, బాణీల్లోనూ వెయ్యవలసినవీ, వెయ్యకూడనివీ గమకాలూ, సున్నితమైన అనుస్వరాలూ ఉంటాయి” అనేది పాడేవారికీ పాటలు కట్టేవారికీ కూడా తెలియకపోవడం అనుకుంటాను.

ఘంటసాల పాడడం మొదలెట్టిన రోజుల్లో అప్పటికే పేరు పొందిన ఎం.ఎస్‌. రామారావు, ఎస్‌.రాజేశ్వర రావు వంటి గాయకులలో వినిపించని నిండుదనం, తెలుగుదనం (నేటివిటీ) మొదటిసారిగా ఘంటసాల పాటలలో వినిపించి శ్రోతలను ఆకట్టుకున్నాయి. లైలా మజ్నూలో సుసర్ల దక్షిణామూర్తి, మాధవపెద్ది సత్యం, ఘంటసాల కలిసి పాడిన “మనుచుగా తా ఖుదా తోడై” అనే పాటలో హీరో ఎవరో గుర్తు పట్టడం చాలా తేలిక. అది 1949నాటి సినిమా. అప్పటికి స్టార్‌ సిస్టం అమలులోకి రాలేదు. బాగా పాడేవారినే హీరోకు ఎన్నుకునేవారు. ఘంటసాల తరవాత సినిమాల్లో పాడడానికి వచ్చిన మాధవపెద్ది సత్యం, ఏ.ఎం.రాజా, పి.బి.శ్రీనివాస్‌ తదితరులు ఈనాటి గాయకుల కన్న ఎంతో ప్రతిభావంతులే. అయినప్పటికీ వారు ఘంటసాలకు సమకాలికులు కావడంతో ఆయనకు సరితూగలేక పోయారు. అంతేకాదు. ఎన్నో దశాబ్దాలపాటు సినీ హీరోలుగా అగ్రస్థానంలో ఉన్న, రామారావు, నాగేశ్వరరావులు ఘంటసాల పాడందే నటించేవారు కాదు.

ఒకప్పుడు విజయావారు తమ నిర్మాణ సంస్థలో ఇతర కళాకారులతోబాటు ఘంటసాలను నెల జీతం మీద నియమించారు. అందులో ఇతర సంస్థలకు పని చెయ్యరాదనే నిబంధన ఉండడం వల్ల ఘంటసాల వంటి ఉత్తమ కళాకారులకు అది కుదరని పరిస్థితి అయింది. మిస్సమ్మ సినిమాకు సంగీత దర్శకుడుగా కాని, గాయకుడుగా కాని ఆయన పని చెయ్యక పోవడానికి కారణం ఇదేనంటారు. కారణాలు ఏవైనా ఘంటసాల పాడినంత కాలమూ ఆయనకు పోటీ లేకుండా పోయింది. ఏపాటకు ఎంత మోతాదులో భావం పలికించాలో ఆయనకు ఎవరూ వివరించనవసరం లేదని అనిపిస్తూండేది. తరవాతి తరం గాయకులలాగా కృత్రిమంగా, కష్టపడి భావం కోసం ఆయన ఎన్నడూ ప్రయత్నించలేదు.

ఘంటసాల సంగీత దర్శకుడుగా కనబరిచిన ప్రతిభ ఆయన గాయకుడుగా సాధించిన విజయం వల్ల కొంత మరుగున పడింది. 1950 ప్రాంతాల తీసిన పెళ్ళిచేసిచూడు లోనే ఆయన చక్రవాకం (ఏడుకొండలవాడ), చారుకేశి (ఎవరో ఎవరో) వంటి కర్ణాటక రాగాలను అతి సమర్థవంతంగా సినీగీతాలకు వాడుకున్నాడు. హిందోళం ఎప్పుడు ఉపయోగించినా అందులో పంచమం పలికించడం ఆయనకు సరదా అనిపిస్తుంది. రాగేశ్రీ వంటి హిందూస్తానీ రాగాలను కూడా ఆయన “ఇది నాచెలి” (చంద్రహారం), “అన్నానా భామిని” (సారంగధర) వగైరా పాటల్లో ఉపయోగించాడు. కుంతీకుమారి పద్యాల్లో కర్ణాటక రాగాలైన హేమావతి, బిలహరి, మాయామాళవగౌళ, అమృతవర్షిణి, హిందూస్తానీ రాగాలైన లలిత్‌ వంటివి అనేకం వినిపిస్తాయి. లలితసంగీతానికి పనికిరావనిపించే రంజని, భైరవి వంటి కర్ణాటక రాగాలను ఆయన తన కరుణశ్రీ పద్యాల్లో అద్భుతంగా ఉపయోగించాడు. ఇది విద్వాంసులు సైతం గుర్తించవలసిన విషయం. ఏ రాగం ఎక్కడ వాడినా రాగభావాన్ని చెడనివ్వలేదు. మాటల్లోని అర్థమూ కనుమరుగవలేదు. రహస్యం సినిమాలో సందర్భాన్ని బట్టి సరస్వతి, లలిత వంటి దేవతల పేర్లున్న రాగాలలో ఆయన స్వరరచన చేశాడు. రాజేశ్వర రావు, పెండ్యాల వంటి సంగీత దర్శకులు అతి ప్రతిభావంతులే అయినా రాగాల మీద ఘంటసాలకు ఉండిన అధికారం వారికన్నా ఎక్కువేమో.

ఘంటసాల స్వయంగా తాను సంగీతదర్శకుడు అయినప్పటికీ ఆర్కెస్ట్రాలో దిట్ట అయిన సి.ఆర్‌.సుబ్బరామన్‌ వద్ద అసిస్టెంటుగా పనిచేసి ఎంతో అనుభవం గడించాడు.

మాయాబజార్‌లోని నాలుగు యుగళగీతాలూ మొదట రాజేశ్వరరావు స్వరపరచారట. తక్కినవన్నీ నిస్సందేహంగా ఘంటసాలవే. చారుకేశిలో సత్యంచేత “భళిభళిదేవా” పాడించి ఘటోత్కచుడికి “వివాహ భోజనంబు” కూడా పాడించిన ఘనత ఆయనదే. ఇది Laughing policeman అనే పాత ఇంగ్లీషు పాటకు అనుకరణ. ఒరిజినల్‌ పాట చతురశ్రంలో సాగితే తెలుగు పాట స్వింగ్‌ రిధంలో వినబడుతుంది. పోలీసువాడి నవ్వుని రాక్షసుడి వికటాట్టహాసంగా మార్చిన ఘనత ఘంటసాలదీ, పింగళిదీ, కె.వి.రెడ్డిిదీ కావచ్చు.

మొదట్లో ప్రతి సినిమాలోనూ అందరు గాయకులకూ తలో పాటా పాడే అవకాశం వచ్చేది. రాను రాను అన్ని పాటలనూ ఘంటసాల చేతనే పాడించే ధోరణి బలపడింది. (అందుకు నిర్మాతలు కూడా బాధ్యులేమో!) కొందరు కొత్త హీరోలకు మాత్రం కె.వి.మహాదేవన్‌, కోదండపాణి వంటివారు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం చేత పాడించసాగారు.

వ్యక్తిగతంగా ఘంటసాల ఎంతో మంచివాడనీ వినయసంపన్నుడనీ ఆయన సమకాలికులకు తెలిసినదే.  మద్రాసుకు ఉస్తాద్‌ బడే గులాం అలీఖాన్‌గారు వచ్చినప్పుడు ఆయనను ఘంటసాల కోరి తమ ఇంటో అతిథిగా ఉంచుకున్నాడు. ఉస్తాద్‌గారంటే ఆయనకు అంత అభిమానం.

మద్రాసులోని ఒక తెలుగు సభలో ఆయన ఉండగానే ఆయనకు పద్మశ్రీ వచ్చిన వార్త విన్న ముదిగొండ లింగమూర్తిగారు, చాలా ఆర్భాటంగా ఆ సంగతి ప్రేక్షకులకు ప్రకటించారు. ఘంటసాలగారు లేచి అతివినయంగా అందరికీ నమస్కరించారు.  అక్కడి సభలో ఆయన “నీ కొండకు నీవే రప్పించుకో” అని ఎంతో భావోద్వేగంతో పాడాడు.
 

చివరిదశ:
1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవాడు. .1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసాడు.1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరాడు. అప్పటికే చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యాడు.

అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరికకలిగింది. భగవద్గీత పూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నాడు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడాడు. 1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో కన్నుమూసాడు. యావదాంధ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

ఘంటసాల వెంకటేశ్వరరావు మనని వదలి వెళ్ళి దాదాపు మూడు దశాబ్దాలు కావస్తున్నా ఈనాటికీ ఆయన పాటలను ఎవరూ మరిచిపోలేదు. ఆయనకు సాటి రాగల గాయకుడూ రాలేదు. తెలుగు సినీ సంగీతపు స్వర్ణయుగానికి ప్రతీకగా ఆయన అమరుడే.