మనిషిలోని బలహీనతలను, మోసగుణాలను వెక్కిరించే జాతీయాలు కూడా కొన్ని ఉన్నాయి. వ్యంగ్యంమాటున చురుకు పుట్టించే అలాంటి జాతీయాలలో ఇదొకటి. కొంతమంది ఎదుటివారికి విపరీతంగా నీతులు చెబుతుంటారు. తత్వోపదేశం చేస్తుంటారు. వారు మాత్రం అందుకు భిన్నంగా స్వార్థంతో ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారిని గురించి తెలియ చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంటుంది. ఈ శరీరాలు అనిత్యాలు. కనుక బతికిఉన్నకాలంలోనే అంతా మంచిగా ప్రవర్తిస్తూ నిస్వార్థంగా ఉండాలి అని ఒకాయన ఉపదేశం చేస్తూ ఆ ఉపదేశంమాటున స్వార్థంతో ధనార్జన కూడా చేస్తున్నాడట. అలా ఎవరైనా తాము చెప్పేదానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నప్పుడు 'అనిత్యాని శరీరాణి అందరి సొమ్మూ మనకేరాని అన్నట్టుంది ఆయన పద్ధతి' అని అనటం కనిపిస్తుంది.