ఉప్పు లేదు, కారం లేదు అమ్మతోడు....

'ఉప్పు లేదు, కారం లేదు అమ్మతోడు అయినా రుచిగానే ఉందన్నట్టు' అన్నది జాతీయం. కొంతమంది మొహమాటస్తులను గురించి వివరించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పదార్థానికి రుచి రావాలంటే ఉప్పు, కారం ఉండాలి. ఇది సర్వసాధారణమైన విషయం. కానీ ఉప్పు, కారం లేని కూరను వడ్డించినా ఓ వ్యక్తి చాలా మొగమాటంతో ఆ కూర ఎంతో బాగుందని మెచ్చుకున్నాడట. ఆ కూర చేసి వడ్డించిన వ్యక్తికి అది రుచిగా ఉండదని తెలుసు. కానీ తింటున్న వ్యక్తి మొగమాటంతో బాగుంది, బాగుంది అని అంటుంటే విచిత్రమని అనిపించిందట. ఇదే తీరులో కొన్ని విషయాలు తమకు నచ్చకపోయినా నచ్చాయంటుంటారు కొందరు. ఎదుటివారు బాధపడకూడదన్న మొహమాట మనస్తతత్త్వమే దీనికి కారణం. ఇలాంటి పరిస్థితులుగాని, ఇలాంటి వ్యక్తులు గాని ఎక్కడైనా ఎదురైనప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net