పంజరంలో పెట్టినా కాకి చిలుక పలుకులు పలకదన్నట్టు..

చిలుకలను పంజరంలో పెట్టి పెంచుకొనే అలవాటు కొందరికి ఉంటుంది. చిలుకలాగే కాకికూడా పక్షే కదా దాన్ని కూడా తెచ్చి పంజరంలో పెడితే చిలుకలాగే చక్కగా పలుకుతుందేమోనని ఓ వ్యక్తి అనుకున్నాడట. చిలుక పలకటానికి పంజరమే కారణమన్నది అతని భావన. అలాగే ఓ కాకిని తెచ్చి పంజరంలో పెట్టి కొన్నాళ్లు చూశాడట. ఎంత కాలానికీ ఆ కాకి చిలుకలాగా పలకలేకపోయిందట. ఈ జాతీయంలో చిలుకను మంచివారికి, కాకిని దుర్మార్గులకు ఉదాహరణగాను, పంజరాన్ని మంచి శిక్షణ ఇచ్చే కేంద్రంగానూ పోల్చి చెప్పటం కనిపిస్తుంది. ఈ జాతీయం అంతరార్థాన్ని పరిశీలిస్తే దుర్మార్గులకు ఎంతగా మంచిని బోధించినా వారి పద్ధతి మారదు అనేది స్ఫురిస్తుంది. ఈ అర్థంలోనే ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net