సామాన్య కుటుంబ జనజీవనంలో అత్తకోడళ్ల నడుమ తగాదాలు చెలరేగే పరిస్థితులను చూసిన కొందరు చెప్పిన జాతీయం ఇది. అత్తలు కోడళ్లను నెగ్గుకురానివ్వరని కఠినంగా ప్రవర్తిస్తూ వారని హింసిస్తుంటారన్న భావనతో అవతరించిన జాతీయమిది. అయితే దీన్ని సమాజంలో ఉన్నతాధికారులకు, వారికింద పనిచేసే ఉద్యోగులకు సమన్వయిస్తూ కూడా చెపుతుంటారు. ఉన్నతాధికారులను అత్తలతో, కిందిస్థాయి ఉద్యోగులను కోడళ్లతోను పోల్చి చెప్పటమే దీనికి ఆధారం. జాతీయంలో చెప్పినట్టు వేపచెట్టుకు సంబంధించిన కాయలు తియ్యగా ఉండవు. అవి చేదుగానే ఉంటాయి. అలాగే అత్తకూడా కఠినంగా ఉంటుందేతప్ప సున్నితంగా మాట్లడే తీరు ఆమె దగ్గర ఉండదు. ఈ తీరులో నిరసించటమే ఈ జాతీయంలోని అంతరార్థం. 'అత్త మెత్తన వేము తీయన ఉండవన్నట్టు మాపై అధికారి ఎప్పుడూ మాతో అలా కటువుగానే ప్రవర్తిస్తుంటాడు' అనే లాంటి ప్రయోగాలున్నాయి.