రాణీ రుద్రమదేవి

రాణీ రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు. నిరవద్యపుర(నిడదవొలు)పాలకుడు వీరభద్ర ఛాళుక్యుడు ఈమె భర్త. రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ. ఈమె మహాదేవుని భార్య. వీరి పుత్రుడే ప్రతాప రుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. ప్రతాపరుద్రునకు అన్నమదేవుడు అనే తమ్ముడు ఉండేవాడని స్థానిక గాథ. బస్తర్ రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశకర్తగా చెప్పుకున్నారు. రుద్రమదేవి రెండవ కుమార్తె రుయ్యమ్మను ఇందులూరి అన్నలదేవునికిచ్చి వివాహం చేసింది. అన్నలదేవుడు సేనాపతి మరియు మహా ప్రధాని.

అ తెలుగువారి ప్రాంతంలోకి అడుగుపెట్టకుండా ముస్లింలతో పోరాడిన ధీరవనిత రాణి రుద్రమ దేవి. కాకతీయ వంశంలో పేర్గాంచిన రాజు గణపతి దేవుడు కుమార్తె రాణి రుద్రమ దేవి. రుద్రమ దేవి కాలంలో కాకతీయ రాజుల పాలన ప్రజల మన్ననలను పొందింది. రాజు గణపతి దేవుడు ఏకైక కుమార్తె రుద్రమాంబ. గణపతిదేవుడికి కుమారులు లేకపోవడంతో రుద్రమాంబను రుద్రదేవగా ముద్దుగా పిలుచుకునేవాడు. 14ఏళ్ల లేత ప్రాయంలేనే అధికారాన్ని చేపట్టింది రాణి రుద్రమ.

కాకతీయ వంశం కింద పనిచేసే సామంతులు రుద్రమదేవిని రాజ్యానికి రాణిగా పట్టాభిషేకం చేయటాన్ని వ్యతిరేకించారు. పరిపాలనా దక్షతలో నేర్పరి అయిన రాణి రుద్రమ వారి అసూయను అణచివేసింది. దక్షిణాదిని పాలించే చోళులు, మరాఠా ప్రాంత యాదవులను సమర్ధవంతంగా ఎదుర్కొని రాజ్యాన్ని కాపాడిన యోధురాలు రాణి రుద్రమ.

రాణి రుద్రమ 1261 సంవత్సరం నుంచి 1296 వరకూ దాదాపు 35 ఏళ్లపాటు కాకతీయ రాజ్యాన్ని పాలించింది. పొరుగు ప్రాంత రాజ్యాలు కాకతీయ రాజ్యంపై కన్నెత్తి చూడకుండా కంటికి రెప్పలా కాపాడిన ధీరవనిత రాణి రుద్రమ.

తండ్రి గణపతి దేవుడికి లాగానే రాణి రుద్రమ దేవికి కళలు, సాహిత్యం అంటే ఎనలేని ఆసక్తి. ఏకాశిలా నగరంగా పిలిచే ప్రస్తుత వరంగల్ కోటను శత్రు దుర్భేద్యంగా నిర్మించింది. ఒంటిరాతి కొండపై కోట నిర్మాణాన్ని తండ్రి గణపతి దేవుడు ప్రారంభిస్తే దానిని పూర్తిచేసిన ఘతన రుద్రమ దేవిది.

కాకతీయ కాలంలో శిల్పకళకు ప్రత్యేక అందాలను అద్దేలా చర్యలు చేపట్టింది రుద్రమ. వరంగల్ కోట 7 బురుజులు, లోతైన కందకాలతో నిర్మించారు. వరంగల్ కోట విస్తీర్ణం 32 చదరపు మైళ్లు. వరంగల్ కోట పూర్తి సమాచారం ఇప్పటివరకూ భారత పురావస్తు శాఖ పరిశోధనలలో సైతం వెలుగులోకి రాలేదు. వాస్తు పరంగా వరంగల్ కోటను మించినది లేదని విదేశీ యాత్రీకులు తమ గ్రంధాలలో వివరించారు.

రాణి రుద్రమ పరిపాలనా కాలంలో మచిలీపట్నం (కృష్ణా జిల్లా), మోటుపల్లి (ప్రకాశం జిల్లా) లు ప్రధాన నౌకాశ్రయాలుగా రూపుదిద్దుకున్నాయి. అలాగే ప్రజలు అవసరాలతో పాటుగా, పంటల కోసం అనేక చెరువులు. కాల్వలు తవ్వించి కాకతీయ రాజ్యాన్ని సుభిక్షం చేసింది రాణి రుద్రమ.

ప్రఖ్యాత పథికుడు మార్కో పోలో ఛైనా దేశమునుండి తిరిగివెళ్ళుతూ దక్షిణభారత దేశము సందర్శించి రుద్రమదేవి గురించి, ఆమె పాలన గురించి బహువిధముల పొగిడాడు. మోటుపల్లి రేవునుండి కాకతీయుల సముద్ర వ్యాపారము గురించి కూడ వివరముగా వ్రాశాడు.

మూలం / సేకరణ: 
Wikipedia