కంది చేలో సూదిపోతే....

కందిచేలో సూది పోతే పప్పుచట్టిలో వెతికినట్టు అన్నది జాతీయం. సందర్భ శుద్ధిలేని పని, చెయ్యాల్సిన పనికాక వేరొక పని చేయటం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కంది చేనులో తిరుగుతున్నప్పుడు ఓ రైతు చేతిలోనుంచి జారి సూది కిందపడి పోయిందట. అలా పడిపోయిన సూదిని అక్కడే వెతకాలి కానీ అది కంది కాయల్లో చిక్కుకొని ఉంటుందని కందులు కొట్టి ఇంటికి తెచ్చి కందిపప్పుతో చట్టిలో పప్పును వండుతున్నాం కదా అనుకుని ఆ చట్టిలో సూది కోసం వెతకటం ఎంత తెలివితక్కువతనమో ఎవరైనా ఊహించవచ్చు. అలాగే చెయ్యాల్సిన పద్ధతిలో పనిచేయక వేరే విధంగా చేసి ఫలితం రావటం లేదని అనుకోవటం కూడా అంతే తెలివితక్కువతనమని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.