ఆ మొద్దులోదే ఈ పేడు కూడా

ఒకేలాంటి లక్షణాలు కలిగి ఉన్నవారు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ఒకే తానులో ముక్కలు అనేలాంటిదే ఇది. అయినా దీని ప్రయోగం మాత్రం విమర్శనాత్మక పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులలో ఉండే సమాన దుర్మార్గ లక్షణాలను చెప్పాల్సి వచ్చినప్పుడు దీన్ని వాడుతుంటాయి. మొద్దు, పేడు అనేవి కఠిన హృదయానికి ప్రతీకలుగా వాడటం అలవాటుగా ఉంది. మొద్దుబుర్ర, మొద్దుబారిన గుండె లాంటి ప్రయోగాలున్నాయి. ఆ క్రమంలో వీడు కూడా అలాంటి దుర్మార్గుడే అని ఎవరి గురించైనా చెప్పేటప్పుడు దీన్ని వాడుతుంటారు. ''ఆ మొద్దులోదే ఈ పేడు కూడా. మంచితనం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి'' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్