అన్నీ తెలిసినమ్మ అమావాస్యనాడు...

అన్నీ తెలిసినమ్మ అమావాస్యనాడు చస్తే ఏమీ తెలియనమ్మ ఏకాదశినాడు చచ్చిందన్నట్టు అన్నది జాతీయం. ఈ జాతీయం తెలుగువారి ఆచార వ్యవహారాలు, నమ్మకాల ఆధారంగా అవతరించింది. చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు అమావాస్య మంచిదికాదని భావిస్తారు. అది వారి నమ్మకం. కనుక ఆ రోజున మరణించటం మంచిది కాదన్నది భావన. ఏకాదశి మాత్రం ఉత్తమమైన తిథిగా, శుభకరమైనదిగా అనుకొంటుంటారు. ఆ రోజున మరణిస్తే వైకుంఠం ప్రాప్తిస్తుందంటారు. ఈ విషయాలన్నీ పూర్వం ఓ పెద్దావిడకు తెలుసట. ఇన్నీ తెలిసినామె అమావాస్యనాడే పోయిందట. ఆమెతోపాటుగానే ఉన్న ఇంకొక ఆమెకు ఈ విషయాలేవీ తెలియవు. కానీ ఆమె మాత్రం ఏకాదశినాడే ప్రాణం విడిచిందట. ఈ స్త్రీల విషయాన్ని జాతీయంగా రూపొందించటం వెనుక వ్యంగ్యభావన ధ్వనిస్తుంది. అన్నీ తెలిసినవారు చేయకూడని తప్పు చేస్తారని, ఏమీ తెలియని వారు మాత్రం మంచే చేస్తుంటారన్నది దీనిలో ధ్వనించే విషయం. ఎప్పుడైనా, ఎక్కడైనా బాగా చదువుకున్న వాళ్లు లేదా అన్ని విషయాలు బాగా తెలుసనుకున్నవారు తప్పు చేసినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్