ఏనుగుల పోట్లాటకు ఎర్ర చీమ రాయబారమన్నట్టు

సమఉజ్జీగా లేని వ్యవహారం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. స్థాయిని మించి చేసే వ్యర్థ ప్రయత్నాలను విమర్శించే విషయంలో దీన్ని వాడుతుంటారు. ఏనుగుతో పోలిస్తే ఎర్రచీమ చాలా చిన్నదే. విడిగా అయితే ఆ ఎర్రచీమ ఎవరినైనా కుడితే కాస్తంత నొప్పి ఉంటే ఉండవచ్చేమో. అదే తన గొప్పబలమని భావించి ఆ ఎర్రచీమ రెండు ఏనుగుల నడుమ రాయబారం చేయాలని చూస్తే అది కుదరకపోగా ఏనుగుల పాదాల కిందపడి అసలుకే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉండవచ్చు. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. 'వాళ్లిద్దరి విషయం నీకనవసరం. నువ్వు తల దూరిస్తే ఏనుగుల పోట్లాటకు ఎర్రచీమ రాయబారమన్నట్టు ఉంటుంది జాగ్రత్త' అనేలాంటి ప్రయోగాలున్నాయి.