ఆదివారం అందలం ఎక్కనూ లేదు...

'ఆదివారం అందలం ఎక్కనూ లేదు, సోమవారం జోలె కట్టనూ లేదు' అన్నది జాతీయం. సంపదలున్నప్పుడు ముందూ వెనుకా చూడకుండా భోగాలను అనుభవిస్తుంటారు కొంతమంది. ఆ సంపదలు కరిగిపోయాక దుర్భరంగా అప్పుచేస్తూనో, యాచిస్తూనో తిరుగుతుంటారు. ముందుచూపులేనితనానికి ఈ ప్రవర్తన ఓ ఉదాహరణ. అలా కాకుండా జీవితంలో ఎప్పుడూ ఒకే స్థితిలో ఆనందంగా కాలం గడుపుతున్నామని చెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. 'ఆయన ముందు చూపున్న మనిషి. ఆదివారం అందలం ఎక్కనూ లేదు, సోమవారం జోలె కట్టనూ లేదు. ఎప్పుడూ ఒకేతీరులో జీవితాన్ని గడుపుతూ వచ్చాడు' అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.