అందని పూలు దేవుడికి అర్పణం అన్నట్టు

కొంతమంది స్వార్థపరులు, అవకాశవాదుల మనస్తత్వాన్ని వివరించే జాతీయం ఇది. అందని ద్రాక్షపండ్లు పుల్లన అనే లాంటిదే ఇది. తనకు దక్కనిది మంచిది కాదన్నది అందని ద్రాక్షపండ్లు పుల్లన అనే జాతీయంలో కనిపించే భావం. అయితే ఈ జాతీయంలో తనకు దక్కనివాటిని తనవిగానే భావించుకుంటూ వాటిని ఏదో ఒక మంచి పనికి ఉపయోగించామని గొప్పలు చెప్పుకొనే వారి మనస్తత్వం తీరు కనిపిస్తుంది. చెట్టుపైన చిటారుకొమ్మన చక్కగా పువ్వులు పూసి ఉన్నాయట. వాటిని కొయ్యటానికి ఓ వ్యక్తికి వీలు కుదరలేదు. ఎలాగో ఒకలాగా కష్టపడి పూలు కోసినా దేవుడికే కదా పెట్టేది. ఆ చిటారుకొమ్మన ఉన్న పూలను దేవుడికి సమర్పిస్తున్నట్టు అనుకొంటే సరిపోతుంది కదాని అతడు భావించాడట. వాస్తవానికి నిజంగా భక్తి ఉంటే ఎలాగో ఒకలాగా పువ్వులు కోసి తెచ్చి దేవుడికి సమర్పించాలి. కానీ ఆ వ్యక్తిలో అవకాశవాదం, స్వార్థం, పలాయనవాదం లాంటివి ఉన్నట్టు అతడి ప్రవర్తన తెలియచెబుతుంది. ఇలాంటివారు ఎదురైనప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ''అందని పూలు దేవుడికే అర్పణం అన్నట్టు దేనికీ పనికిరాని ఆ కొండకింది భూమిని పేదలకిస్తానని ఆయన అనడం విచిత్రంగా ఉంది'' అనేలాంటి ప్రయోగాలున్నాయి.