ఉన్నమ్మ గాదె తీసేసరికి లేనమ్మ ప్రాణం పోయిందనట్టు

కొంతమంది దాతలు ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకుండా అర్థులను తమ చుట్టూ విపరీతంగా తిప్పుకొంటుంటారు. అలా తిరగలేక కొంతమంది విసిగి వేసారిన సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. పూర్వం వడ్లను గాదెల్లో భద్రపరిచేవారు. ఎవరైనా వెళ్లి అడిగినప్పుడు ఆ గాదెల్లోని ధాన్యాన్ని తీసి ఇస్తుండేవారు. దాని ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. దాంతోపాటుగా చేసి పెడతానన్న పని చెప్పిన సమయానికి చేయక ఇంకొంత మంది తిప్పుకొంటుంటారు. అలాంటివారు ఎదురైనప్పుడు కూడా ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. 'సంవత్సరం నుంచి ఈ పని చేసిపెట్టమని అడుగుతున్నా కానీ ఆయన వ్యవహారం ఎలాగుందంటే, 'ఉన్నమ్మ గాదె తీసేసరికి లేనమ్మ ప్రాణం లేచి పోయినట్టుగా ఉంది.' అనే తరహా ప్రయోగాలున్నాయి.