ఎలుగు సలుగెరిగిన పని

బాగా నైపుణ్యం ఉన్న పనివాళ్లు చేసే పని అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఇది వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వారి మధ్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.పొలం దున్నటానికి నాగలిని ఉపయోగిస్తుంటారు. ఆ నాగలికి దుంపను అమర్చటంలోనే అసలైన పనితనమంతా ఇమిడిఉంది. సరిగా అమర్చకపోతే నేలను దున్నటం వీలుకాదు. దుంప వదులుగా ఉన్నా బాగా ముందుకు బిగిసి ఉన్నా రెండూ ఇబ్బందికరంగానే ఉంటాయి. ఎలుగు ఎక్కువైతే నాగలి కర్ర నేల మీద ఆనదు. కనుక ఎలుగు సలుగు ఎంత వరకు ఉండాలో అంతవరకు సరిచూసుకొని నాగలిని దున్నేందుకు సిద్ధం చేసుకోవాలి. అప్పుడే పొలం దున్నటం సులభమవుతుంది. అలా నాగలిని సిద్ధం చేసుకోవటంలో నైపుణ్యాన్ని ప్రదర్శించినట్టుగానే చేసే ప్రతి పనిలోనూ జాగరూకతతో వ్యవహరించటం మేలని తెలిపే జాతీయమిది. ఎలుగు సలుగెరిగి పని చేస్తేనే సులువుగా ముందుకు పోవటం కుదురుతుంది అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.