జాషువా

గుఱ్ఱం జాషువాఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు.అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.

ఈనాడు సంఘసంస్కర్తలకు జాషువా ఆదర్శ పురుషుడు. తెలుగు ప్రజల కవి. భాషా చంధస్సులో భావ కవి. వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అని ఆయన చెప్పారు. నిత్య జీవితంలో కాని సాహితీ జీవితంలో గాని ఎన్ని కష్టాలు ఎదురైన ధీరత్వంలో నిబ్బరంగా ఎదుర్కోవడం ఆయన విజయ సంకేతం.

జాషువా 1895 సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ లో జన్మించాడు.యాదవ తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.

వర్తమాన సమాజంలో సంప్రదాయ సాహిత్యం రాజ్యమేలుతున్న రోజుల్లో అనేక ప్రతికూలతలనెదుర్కొంటూ సామజిక దృక్పథంతో రచనలు చేసి నిలదొక్కుకోవడం సామాన్య విషయం ఏమీకాదు. అందులోనూ సాంఘికంగా అణిచివేతకు లోనైన దళిత వర్గానికి చెందిన వారు ఆ రోజుల్లో సాహిత్య రంగంలోకి ప్రవేశించడానికే అవకాశం లేని పరిస్థితి ఉండేది.

 • తనకు జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది అంటూ నాకు ఇద్దరు గురువులు ఉన్నారని అన్నారు. ఒకరు పేదరికం, మరొకరు కులమతభేధం. నవ్వుతూ చలోక్తులు విసురుతూ తన మీద ఎవరైనా చలోక్తులు విసిరినా ఆయన ఎంతో ఆనందించేవారు.
 • మహాకవి విశ్వనాధ సత్యనారాయణ జాషువాను మధుర కవిగా పిలిచేవారు.
 • ఒకానొక మాధుర్యం ఆయన కవిత్వంలో సరస్వతీ దేవి అనుగ్రం వల్ల లభించిదని శ్రీ విశ్వనాధ పేర్కొన్నారు.
 • జాషువా కవితా కంఠము విలక్షణమైంది. యావన్మంది ప్రజల సుఖ సంతోషాలకోసం, ఎవరు అవమానం కాకూడదన్న లక్ష్యం కోసం జాషువా కవిత ఆక్రోశించేది.
 • జాషువా గారు అభ్యుదయవాది. వర్గ సంఘర్షణ, ఆర్ధిక వ్యత్యాసాల నిర్మూలన దోపిడి వర్గాల పై తిరుగుబాటు జాషువా గారి కావ్యాలలో నిండుగా ఉన్నాయి.
 • దీనుల పట్ల సంఘం అణిచివేసిన వారి పట్ల సానుభూతిలో కలం కదిలించిన కవి జాషువా.
 • సంఘసంస్కరణ ఆయన కావ్యలక్ష్యం.
 • ఆకలిని, శోకాన్ని నిర్మూలించాలన్నదే ఆయన ధ్యేయం.
 • అంధ విశ్వాసాలను, మత విద్వేషాలను తీవ్రంగా నిరశించారు. చిత్త శుద్ది లేని పెత్తం దార్లను, గుత్త స్వాములను నిలదీసి ప్రశ్నించేవారు.
 • ఆస్తి అందరిది కావాలని, కొందరికే పరిమితం కారాదని ఆయన ఆభిమతం. ఆయన కవితకు వస్తువులు మానవత్వం, హేతువాద, కరుణా రసం.

ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో ఆయన పద్యాలు చదివాడు. తక్కువ కులం వాడిని సభ లోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయనను అవమానించారు. ఆయనకు జరిగిన అవమానాలకు ఇది ఒక మచ్చు మాత్రమే.అంటరాని వాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండీ, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారు.ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారు. క్రమంగా ఆయన నాస్తికత్వం వైపు జరిగాడు.

 • గుంటూరులోని లూథరన్‌ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పని చేసాడు.
 • 1928 నుండి 1942 వరకు గుంటూరు లోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేసాడు.
 • రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేసాడు.
 • 1957-59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసాడు.

 జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాసాడు. వాటిలో ప్రముఖమైనవి:

 • గబ్బిలం
 • బాపూజీ
 • క్రొత్తలోకము
 • ముంతాజు మహలు
 • ఫిరదౌసి
 • నా కథ
 • కాందిశీకుడు
 • ఆంధ్ర మాత
 • నేతాజీ

గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశం లేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.

1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన. పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించాడు.

1948 లో రాసిన బాపూజీ – మహాత్మా గాంధీ మరణ వార్త విని ఆవేదనతో జాషువా సృష్టించిన స్మృత్యంజలి.

జాషువా ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నారు.

 • కవితా విశారద
 • కవికోకిల
 • కవి దిగ్గజ – నవయుగ కవిచక్రవర్తి
 • మధుర శ్రీనాథ
 • విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధుడయ్యాడు.

పురస్కారాలు

 • పద్మభూషణ
 • ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు
 • కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
 • కళాప్రపూర్ణ

సమకాలీన సరస్వతీ జగత్తులో సహన శీలిగా, శాంత మూర్తిగా ప్రఖ్యాతిగాంచిన జాషువా 1971 జులై 24 వ తేదీ పరమపదించారు.

మూలం / సేకరణ: 
వికీపీడియా