ఛాందస భావాలకు బావాలకు తొలి అడ్డుకట్ట “వేమన”

వేమన“విశ్వదాభిరామ వినురవేమ” అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి.  పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన .

కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించాడని అంటున్నారు. ఆయన నందన నామ సంవత్సరము, ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు. ఇతను యవ్వనంలో వేశ్యాలోలుడిగా జీవించాడు. కొంతకాలానికి విరక్తిచెంది, తపస్సు చేసి యోగిగా మారాడు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పాడు.
 

  • కేంద్ర సాహిత్య అకాడమీ వారు వేమన జీవిత చరిత్రను వ్రాయించి 14 భాషల్లోకి అనువదింపజేశారు.
  • ఆంగ్ల, యూరపు భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషలలోకి వేమన పద్యాలు అనువదింపబడ్డాయి. వేమనకు లభించిన ఈ గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు.
  • ఐక్య రాజ్య సమితి – యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని ఆ రచనలను పలు భాషలలోకి అనువదింపజేశారు.
  • ఆటవెలది తో అద్భుతమైన కవిత్వము, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు, యోగి వేమన.
  • ‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే.
  • కులాన్నీ, అధికారాన్నీ, అహంకారాన్నీ, సంపన్నుల దౌష్ట్యాన్నీ నిరసిస్తూ ఊరూరా తిరిగి తత్వాలు చెప్పాడు.
  • కొందరు వెర్రివాడని తరిమికొట్టారు. తనను తానే “వెర్రి వేమన్న” అని అభివర్ణించుకొన్నాడు. వేదాంత సారాన్ని తన చిన్న పద్యాలలో పొందుపరచి ఊరూరా ప్రభోధించాడు.
  • ఆత్మ సంస్కారాన్ని, కుల సంస్కారాన్ని, ఆర్ధిక సంస్కారాన్ని ప్రబోధించాడు.
  • గురువుల కపటత్వాన్ని నిరసించాడు. జీవితంలో, తత్వంలో, దాని ఆచరణలో అంతగా సాధన చేసి బోధించినవారు అరుదు.
  • వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. వేమన సృశించని అంశం లేదు.
  • సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు.
  • కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద వేమన కలం ఝళిపించాడు.

వేమన పద్యాలు:

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పద్యాలన్నీ ఆటవెలది ఛందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు వేమన. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోను నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు.
 

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.

కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తరువాత నీతిని చెబుతాడు. ఉదా:

అనగననగరాగ మతిశయించునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ.

 

వేమన కడప దగ్గరి పామూరుకొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామ నవమి నాడు సమాధి చెందాడు..