“షహెన్షా” సి.కె.నాయుడు

సి కె నాయుడుబౌలర్ గా తన ఫస్ట్ క్లాసు కెరీర్ ని మొదలు పెట్టి, బారీ సిక్సర్లతో, సి.కె.నాయుడు అంటే సిక్సర్ల నాయుడు అనిపించుకున్న స్పోర్ట్స్ హీరో ఆయన.

భారతదేశ టెస్ట్ క్రికెట్ మొట్టమొదటి కెప్టెన్ సి.కె.నాయుడు, (ఇంగ్లాండ్ తో 1932లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన బారతీయ జట్టుకి కెప్టెన్)
కొట్టారి కనకయ్య నాయుడు, 1895, అక్టోబర్ 31న నాగపూర్లో ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. నాగపూర్లో పెరిగిన ఈయన పాఠశాల రోజులనుండే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ కనపరిచాడు.

హిందువులు – తెల్ల దొరలు (ఎం సి సి) క్రికెట్ జట్టు మధ్య పోటిలో అత్యద్భుత బ్యాటింగ్ నైపుణ్యం ప్రదర్శిస్తూ, 153 పరుగులు 116 నిమిషాలో (అంటే రెండు గంటలలోపే) కొట్టేశాడు. ముంబాయి జింఖాన మైదనాన్ని హోరెత్తించాడు. మొత్తం జట్టు పరుగులు (స్కోరు) 187 ఐతే, సి కె వంతు 153 పరుగులు.

1946లో నాయుడు  భారత జట్టుకు ప్రధాన సెలెక్టర్ గా ఉన్నరోజుల్లో, రంజీ ఫైనల్లో హోల్కర్ జట్టుకు ఆడుతూ రెండొందల పరుగులు చేసారు. ఈ ఇన్నింగ్స్ లో ఇరవై రెండు ఫోర్లు – ఆరున్నర గంటలు సాగింది. ఏముందీ? అంటారా? అప్పుడాయన వయసు అక్షరాలా యాభై ఒకటి!

1956-57 రంజీ ట్రోఫీలో తన 62 వ యేట అతను చివరిసారి ఆడాడు. అప్పటి రాజస్థాన్ జట్టులో ముగ్గురు టెస్ట్ జట్టు బౌలర్లు కూడా ఉండగా – నాయుడు గారు 52 పరుగులు చేసి, రనౌటయ్యాడు. అందులో – వినూ మన్కడ్ వేసిన ఒక ఓవర్ లో వరుసగా కొట్టిన రెండు సిక్సర్లు కూడా ఉన్నాయి

ఇంకా…

 • కొట్టారి కనకయ్య నాయుడు 1923లో సైన్యంలో పనిచేసారు.
 • బ్రిటీష్ జట్టుతో ఆడేప్పుడు స్కోరును పరుగులెత్తించడం ఈయనకు చాలా ఇష్టం.
 • క్రికెటర్లు ప్రకటనలలో కనపడటం కూడా, ఆ రోజుల్లో సి.కే, ఒక టీ వ్యాపార ప్రకటనలో కనిపించటంతో మొదలు అయ్యింది.
 • తొలి రాష్టప్రతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా “పద్మబూషణ్” బిరుదు అందుకున్నారు. పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు మరియు 1933లో విస్‌డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు.
 • ఆరు దశాబ్దాలపాటు “ఫస్ట్ క్లాస్ క్రికెట్” ఆడిన కొద్దిమంది క్రీడాకారులలో సి.కె.నాయుడు ఒకరు.
 • జట్టును ముందుంచి నడిపించడంలో దిట్ట.
 • ప్రముఖ క్రికెట్ ఆటగాడు ముష్తాక్ అలి సి కె ని “షహెన్షా” (రాజాధి-రాజు) గా వర్ణించాడు. సి జి మెకార్ట్ని, సి కె ఓ అద్బుత, పరాక్రమ, అగ్రగామి బ్యాట్స్‌మన్ అని పేర్కొన్నాడు. జే బి హోబ్స్ సి కె పుట్టుకతోనే గొప్ప ఆటగాడు అని పేర్కొన్నారు.
 • ఈ మేటి క్రికెటర్ పేరున సి కె నాయుడు క్రికెట్ టోర్నమెంట్ యేటా నిర్వహిస్తున్నారు.
 • ప్రతిష్టాత్మక సి కె నాయుడు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు నెలకొల్పి, ఐదు లక్షల రూపాయల నగదుతో సత్కరిస్తున్నారు. ఈ అవార్డులు అందుకున్న వారిలో మన్సూర్ అలి ఖాన్ పటౌడి, నింబాల్కర్, చందూ బొర్డే, భగవత్ చంద్రశేఖర్, వెంకటరాఘవన్, బిషన్ సింగ్ బేడి, ఎరపల్లి ప్రసన్న వంటి మేటి ఆటగాళ్ళు ఉన్నారు.
 • క్రికెట్ చరిత్రలో మొదటి మహిళా కామెంటేటర్ చంద్ర సి.కె.నాయుడు, కెప్టెన్ సి.కె.నాయుడు పుత్రిక కావటం భారతదేశం గర్వించదగ్గ అంశం.
   

సీకే గారి స్టామినా గురించి రెండు కథలు:
 

 1. ఆయన ఆడిన చివరి టెస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కెప్టెన్ గబ్బీ అలెన్ వేసిన బౌన్సర్ ఆయన గుండెల వద్ద బలంగా తాకితే, ఆయన అరిచిన అరుపు గ్రౌండంతా వినబడ్డదట. అప్పుడు కూడా, సాయానికని వస్తున్న వారిని వారించి, వెంటనే లేచి నిలబడి, తదుపరి బంతిని బౌండరీకి తరలించడమే కాకుండా – ఆ మ్యాచ్ లో ఎనభై ఒక్క పరుగులు కూడా చేశారు.

 2. ఆయనకి యాభై ఏడేళ్ళప్పుడు – హోల్కర్ జట్టు సీకే సారథ్యంలో బాంబేతో రంజీ ఫైనల్ కి సిద్ధమైంది. ఇన్నింగ్స్ మొదట్లోనే దత్తూ ఫాడ్కర్ వేసిన బంతి ఒకటి ఆయన నోటిని గట్టిగా తాకింది. ఊడిపోయిన మూడు ముందు పళ్ళ సంగతి పక్కకి నెట్టి, ఆట కొనసాగించారు సీకే. ఆయనపై గౌరవంతో వేగం తగ్గించిన ఫాడ్కర్ ను మందలించి… చివరికి ఆ ఇన్నింగ్స్ లో అరవై పరుగులు చేశారు.

“సి కె” క్రికెట్ జీవిత విషయ సారంశం:

ఆడిన మ్యాచ్ లు  – 207
చేసిన పరుగులు – 11,825
అత్యుత్తమ పరుగులు (స్కోరు) – 200
సెంచరీలు – 26
యాబైలు – 28
తీసిన వికెట్లు – 411
పట్టిన క్యాచ్ లు – 170