శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు

అన్నమాచార్యశ్రీ తాళ్ళపాక అన్నమాచార్య, కడప జిల్లాలోని  తాళ్ల్లఫాక గ్రామంలో మే 9, 1408 లో జన్మించాడు. పుట్టినప్పటినుండి, "తిరుమలప్పప్రసాదం" అని చెప్పందే ఉగ్గుకూడా త్రాగేవాడు కాదని ప్రతీతి. జోలపాటలలో వెంకటేశ్వరస్వామిపై పాడుతుంతేనే నిదురించెవాడట. చిన్ననాటినుండి ఆడిన మాటలెల్ల అమృత కావ్యంగా , పాడినపాటలెల్ల పరమగానాం "అన్నమయ్య కవితలు అల్లేవాడు. అన్నమయ్యకు 16వ ఏటనే  తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్లు చెప్తారు. స్వామి ఆదేశంతో ఏన్నోకీర్తనలు రచించాడు. అన్నమయ్య సనాతన వేదాలలోని జ్ఞానాన్ని సంకీర్తనల రూపంలో గానం చెసిన పద కవితా పితామహుడు. సుమారు 32 వేలకు పైగా సంకీర్తనలు తెలుగులో స్వయంగా రాసి గానం చెసిన ప్రప్రథమ సంకీర్తనాచార్యుదు అన్నమయ్య.   

సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు.

అన్నమయ్య కీర్తనలు, రచనలు

అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్నియెడల తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకొన్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష. మార్గ, దేశి సంగీత విధానాలు రెండూ అతని రచనలలో ఉన్నాయి. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాలవంటివి ఉన్నా గాని అవి "అంగాంగి విభాగం లేక, అఖండ గద్య ధారగా, గేయగంధులుగా" ఉన్నాయి. శివకవుల పదాలగురించి ప్రస్తావన ఉన్నాగాని అవి లభించడంలేదు. మనకు లభించేవాటిలో అన్నమయ్యవే తొలిసంకీర్తనలు గనుక అతను "సంకీర్తనాచార్యుడు", 'పదకవితా పితామహుడు" అయ్యాడు.

అన్నమయ్య "యోగ వైరాగ్య శృంగార సరణి" మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు.

సంకీర్తనా లక్షణమనే సంస్కృత గ్రంధం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో "శృంగార మంజరి" అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో "వేంకటేశ్వర శతకము" ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంధాలు లభించలేదు.

భగవంతుడ్ని ద్యానించే విషయంలో, మానవాళిని ప్రేమించడం గురించి తెలియజేస్తూ మానవతా విలువలతో జీవితాన్ని ఎలా సంతోషంగా ఉంచుకొవచ్చో అన్నమయ్య తన కీర్తనల ద్వారా తెలియబరిచాడు. పండితుడికి,పామరుడికి సమంగా అర్దమయ్యె రీతిలో సంస్కృతం, తెలుగు, జానపదాలలో ఆద్యాత్మిక, శృంగార  సంకీర్తనలు రాశారు.

మానవులందరూ ఒక్కటే అని చాటి చెప్పుతూ "బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే" అనిగానం చేశాడాయన.

"చక్రవర్తి అయినా - నిరుపేదైనా, నిద్రలో పొందే సుఖం ఒక్కటే అని, బ్రహ్మణుడైనా, దళితుడైనా మట్టిలో కలిసేది ఒక్కచొటేనని - అన్నమయ్య అంటాడు.  అలాంటప్పుడు ఏందుకీ వివక్షత? ఏందుకీ తారతమ్యాలు? అని ఆయన ప్రశ్నిస్తాడు. నైతిక విలువలు పాటిస్తే, ఎటువంటి కష్టాలు రావని అన్నమయ్య సుమారు ఐదు శతబ్దాల క్రితమే తెలియజేసాడు.

 "ఏమికలదిందు ఎంతకాలంబైన" అంటూ,

ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏదీలేదని, ఈ నిజాన్నీ తెలుసుకుంటే నీకు సంతోషం కల్గిస్తుందన్న ప్రతి విషయం ఎంత భయంకరమైందో గుర్తించగల్గుతారని ఆయన అంటాడు. జీవితం క్షణికమైందని, ఒక ఆకులాగా, పండి రాలిపోతుందని అన్నమయ్య ప్రభోదిస్తాడు. ఇంతటి దానికి ఈ స్వార్దపూరిత చింతన ఎందుకని ప్రశ్నిస్తూ, దైవచింతనలో కాలంగడపమని సందేశమిస్తాడాయన. భగవంతుడు ఒక్కడే శాశ్వత నిజం అని ఆయన అంటాడు. అలాగే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వాలని ఒంటరిగా పనిలేనివాడు సాదించేది ఏమి ఉండదని సంభొదిస్తాడాయన. ప్రస్తుత పరిస్తితిలో అన్నమయ్య పదవికవితలు ఎంతో అవసరం. తన రచనలు, సంకీర్తనలను ఆనాటి రాజుల కోరిక మేరకు, వారిపై సంకీర్తనలు రాయడానికి అంగీకరించలేదు. తన సంకీర్తనలను తిరుమల ఏడుకొండల వెంకటేశ్వరస్వామికే అన్నమయ్య అంకితమిఛ్చాడు. నారసింహుడి మీద,రాముడి మీద కూడా కొన్ని కీర్తనలు రాశాడు.                                                 

అన్నమయ్య కీర్తనలలో తాత్విక సత్యాలు, సాంఘీక విమర్శలు, నీతి నియమాలు, లాలిపాటలు, బలక్రుశ్నలీలలు ఉన్నాయి. ఇలా అనేక గీతాలను ఆయన రచించాడు. ప్రముక కవి పండితులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో అన్నమయ్య రచనలు "ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిధ్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన ద్విపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే" అన్నారు.

అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.

ఉదాహరణలు

అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగల మయము॥

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥

చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మ మయము॥

కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకల సంపద రూప మదివో
పావనముల కెల్ల పావన మయము॥
 

అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల |
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల |
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ||

పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల |
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ||

మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల |
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ||

పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల |
వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ||

కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల |
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల ||

కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల |
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ||
 

కులుకక నడవరో కొమ్మలాలా (రాగం - దేసాళం)

కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు

ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మీద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు

చల్లెడి గందవొడి మై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణతులాల
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు

జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతు లెత్తరో
అమరించి కౌగిట నలమేలు మంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం

చరణ కిసలయములకు సకియ రంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం

పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం
 

జోఅచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామ గోవింద

నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ

పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు

అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే

గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి
చెల్లునా మగనాండ్ర జెలిగి యీ శాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి

రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను
మాపుగానే వచ్చి మా మానములను
నీపాపడే చెఱిచె నేమందుమమ్మ

ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి

అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార

గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి

అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి

హంగుగా తాళ్ళపా కన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల
 

చెల్లఁబో తియ్యనినోరఁ జేఁ దేఁటికి యీ-
పల్లదపుఁగోరికలపాలు సేయవలెనా

ఆసలకు నాదేహ మమ్ముకొంటి వింటింట
దాసునిఁగా నపలిదైవమా నీవు
పోసరించి భూమిలోనఁ బుట్టించి రక్షించి
యీసులేక భంగేట్టు టిది గొంత వలెనా

పామరపుటింద్రియాలబారిఁ దోసితివి నన్ను
దామెనకట్టుగాఁ గట్టి తత్వమా నీవు
దోమటి నామతిలోనఁ దోడునీడవై యుండి
పామేటిసుఖములనే భ్రమయించవలెనా

గక్కన నింతట నన్నుఁ గరుణించితివి నేఁడు
మొక్కితి శ్రీవేంకటాద్రిమూలమా నీకు
దిక్కుదెసవై నాకు దేవుండవై యేలికవు
చొక్కి నామన సింత సోదించవలెనా

 కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. "మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే" అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు "సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే" అన్నాడట.

అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది. అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం.  అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట. 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి. 15వ శతాబ్ది ప్రజాజీవితం, తెలుగు భాషా విశేషాలకు అన్నమయ్య సాహిత్యం ప్రతిబింభంగా నిలిచింది.                     

అన్నమయ్య సంకీర్తనలు పాడి, ప్రచారం చేయడానికి కర్ణాటక, తమిళ సంగీత విద్వాంసులు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానము  ఆద్వర్యంలో 'అన్నమాచార్య ప్రాజెక్టు' అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికి ఎంతో కృషి చెస్తొంది. ప్రత్యేక కార్యక్రమాలు ప్రతీ ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమయ్య వర్దంతిని ఘనంగా జరుపుతున్నారు. విశ్వవిద్యాలయ స్థాయిలో ఎం.ఎ విద్యార్థులకు అన్నమయ్య సంకీర్తనలను ప్రత్యేక పాఠ్యాంశాలుగా, అలాగే పరిశోదన (రీసేర్చి) కోసం కూడా అవకాశం కల్పించారు. అన్నమయ్య సంకీర్తనల్లోని మంచి భావాలను - ఆలొచనలను ప్రజలందరికీ పంచిపెట్టాల్సిన భాద్యత పండితుల-గాయకుల భుజస్కందాలపై ఉంది.

మూలం / సేకరణ: 
వికీపీడియా,"తెలుగు పెద్దలు" పుస్తకం