భిన్నపార్శ్వాల గురుజాడ

నేడు గురజాడ అప్పారావు గారి 150వ జయంతి

  జాతీయతాస్ఫూర్తి భారత దేశమంతటా వెల్లివిరుస్తున్న రోజుల్లో కలం పట్టిన యోధుడు గురజాడ. పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి భారత యువత కొట్టుమిట్టాడుతున్న సమయంలో వారికి భారతీయ సంస్కృతి, చరిత్ర, సాహిత్య వైభవాలను గుర్తుచేయడంతోపాటు పాశ్చాత్య లోకానికి భారతీయ ఔన్నత్యాన్ని తెలియజేయాల్సిన చారిత్రక అవసరాన్ని గుర్తించిన దీర్ఘదర్శి- గురజాడ.

రెండు పరస్పర విరుద్ధ సంస్కృతుల మధ్య సంఘర్షణ జరుగుతున్న రోజులవి. దాని దుష్ఫలితాలను గుర్తించని కారణంగా సనాతనవాదులైన దేశీయ పండితులు దేశభాషల్లో తమలో తమకే అర్థంకానంత అయోమయ మార్గంలో ప్రయోజనరహితమైన సాహిత్యసృష్టిచేస్తూ యువతకు దూరమైన పరిస్థితిని గురజాడ గుర్తించాడు. ఇటు యువతకు, అటు పాశ్చాత్యులకు మన వైభవాన్ని గుర్తుచేయడానికి ఆంగ్లంలో రచనలు చేయాల్సిన అవసరాన్ని గ్రహించాడు. కక్కు, సారంగధర వంటి కవితలను, 'స్టూపింగ్‌ టు రైజ్‌' వంటి కథలను, హరిశ్చంద్ర-శ్రీరామ విజయ వ్యాయోగము వంటి నాటకాలకు పీఠికలను ఇందుకే ఆంగ్లంలో రాశాడు. ఆయనకు బృహత్తర బాధ్యతలతోపాటు, విస్తృత సాహిత్య ప్రణాళిక కూడా ఉంది. కాని, ఎడతెగని రాచకార్యాలు, రావణ కాష్ఠంలా, కొనసాగిన వ్యావహారిక భాషోద్యమం, నిరంతర అనారోగ్యం వల్ల ఆయన తన సాహిత్య ప్రణాళికను పూర్తిచేయలేకపోయాడు. అనిశ్చితమైన ఆరోగ్యస్థితిలో అనివార్యంగా తెలుగులో రచనలు చేయాల్సిన అత్యవసర స్థితిని ఆయన గుర్తించాడు. ప్రజల భాషకు సాహిత్య గౌరవాన్ని కలిగించడం, స్త్రీలకు కట్టుబానిసతనం నుంచి విముక్తి కలిగించి, స్వేచ్ఛాస్వాతంత్య్రాలను పొందాలనే స్ఫూర్తిని రగుల్కొల్పజేయడం అనే రెండు పరమ లక్ష్యాలతో ఆయన సాహిత్యరచనకు పూనుకొన్నాడు. ఇది సరికొత్త మార్గం. 'మనసు ఫౌండేషన్‌' పుణ్యమా అని ఇప్పుడందరికీ అందుబాటులోకి వచ్చిన గురజాడ మౌలిక రచనలన్నింటినీ సదవగాహనతో అధ్యయనం చేసినవారికి ఈ విషయాలన్నీ తెలుస్తాయి.
 

మహిళాభ్యుదయానికి దిక్సూచి

గురజాడ అవతరణతో ఆంధ్రసాహిత్యంలో అసలైన స్త్రీపర్వం మొదలైంది. అది మహాభారతంలోని స్త్రీపర్వంకాదు. ఆధునిక భారతంలోని స్త్రీపర్వం. మహాభారతంలో స్త్రీలు అక్షౌహిణుల సంఖ్యలో తమ స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని, హక్కుని, శక్తిని వినియోగించుకోలేక పురుషాహంకారం కారణంగా అనివార్యమైన రణబీభత్సంలో తమ జీవిత సర్వస్వాన్నీ కోల్పోయి ఏడేడులోకాలు ఎగసిపడేలా, గుండెలవిసిపోయేలా ఏడ్చారు. ఆ రోదన ధ్వనులు యుగయుగాలుగా ఈ దేశంలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. గురజాడ కలం పట్టేదాకా ఆ ఆడవాళ్ల కన్నీళ్లు తుడిచే అమృతహస్తమేదీ లేకపోయింది. వాళ్ల స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని, హక్కునీ, శక్తినీ వాళ్లు గుర్తించేలా చేయగల నూతన సృజనమార్గం ఆవిర్భవించలేకపోయింది. 'ఇతిహాసానృత కోష్ఠము'ల అజమాయిషీ నుంచి స్త్రీజాతికి విముక్తి కల్పించడానికి కన్యాశుల్కమనే నూతన ఇతిహాస సృష్టితో స్త్రీలకు ప్రశ్నించడంలోని తొలి తెలుగు పాఠాలను నేర్పించినవాడు గురజాడ. పరాధీనతను వదిలించి ప్రగతిమార్గంలోకి మళ్లించినవాడు గురజాడ.

'నా పుట్టింటి వాళ్లిచ్చిన పొలం అమ్ముకుని నా కొడుకును చదివించుకుంటాను. అందుకోసం ముక్కుపచ్చలారని నా పిల్లగొంతు కోయనివ్వను'- అంటూ అగ్నిహోత్రావధానులకు ఎదురుతిరిగి ప్రశ్నించింది వెంకమ్మ. 'అప్పనట్రా నీకు! వెధవా!' అంటూ స్త్రీ సహజమైన తన కోరికను బహిరంగంగా వెల్లడించడానికి ఇటు గిరీశాన్ని, అటు సంఘాన్ని ప్రశ్నించింది పూటకూళ్ళమ్మ. 'నీతో ఎందుకు లేచిరావాలి?' అంటూ ఒక వివేకవంతమైన ప్రశ్నను గిరీశం మీద సంధించింది బుచ్చమ్మ. 'దీపమార్పి ప్రమాణం చేశావు కదా! పెళ్ళాడకుండా ఎక్కడికి పోతావు?' అని రామప్పంతుల్ని చొక్కాపట్టుకొని నిలదీసింది మీనాక్షి. 'అటువంటి మంచివేశ్య దొరికితే మీ వంటి సత్పురుషులు వారిని పెళ్లాడడానికి అంగీకరిస్తారా?' అంటూ సౌజన్యారావు ధర్మ కంచుకాన్ని తునాతునకలు చేసే అస్త్రాన్ని ప్రయోగించింది మధురవాణి. ఈ ప్రశ్నించే తత్వం కన్యాశుల్కంతో ఆగిపోలేదు. సహపంక్తి భోజనాలతో సాధించిందేముంది? మీలో ఎవరైనా మాల, మాదిగ పిల్లలను పెళ్ళాడేవారున్నారా? అని కుహనా సంస్కర్తల కూకటివేళ్లు కదిలిపోయే ప్రశ్న వేసింది ఇంకొక మహిళ'. 'పట్టమేలే రాజువైతే రాజునేలే దైవముండ డొ?' అంటూ ఆటవిక అధికార దర్పాన్ని అదరగొట్టే ప్రశ్నవేసింది కన్యక. 'నలుగురు కూర్చుని నవ్వే వేళల నా పేరొక పరి తలవండి'అంటూ సమాజ గర్భంలోకి తాను విసిరిన ప్రచ్ఛన్నభల్లం అనుక్షణం కలుక్కుమనేలా ప్రశ్నకాని ప్రశ్నను గుచ్చిపోయింది పూర్ణమ్మ. గురజాడ సృష్టించిన స్త్రీలు ప్రశ్నించడంతో ఆగిపోలేదు. వివేకంతో, వినూత్న చైతన్యంతో తమ సమస్యలకు తామే పరిష్కారాలను కనుక్కునే ప్రయత్నం చేశారు. మూర్ఖులు, నీచులు, అవివేకులు, మోసకారులు, దయారహితులు అయిన పురుషులు తమ పరాజయాన్ని తామే కళ్లజూసే పరిస్థితులు కల్పించారు. తమ పరాభవాలకు తామే తలలు దించుకునేలా ప్రతీకారం చేశారు. నాటకంలోను, కవిత్వంలోను కనిపించే గురజాడ సృష్టించిన స్త్రీ పాత్రలు చైతన్య ప్రతీకలు.

నాటకం, కవిత్వం, కథలు అనే వేర్వేరు ప్రక్రియలు ఎంచుకున్నా గురజాడ వస్తువు ఒకటే. (1) పాశ్చాత్య నాగరకతా వ్యామోహం (2) బాల్య వివాహాలు (3) విధవా వివాహ సమస్య (4) వేశ్యా వ్యవస్థ నిర్మూలన (5) కులమత సంప్రదాయాలు (6) విద్యావ్యవస్థ (7) మూఢాచారాలు (8) అవినీతి- అనే అంశాలు కన్యాశుల్కంలోను, అసంపూర్ణ నాటకాలైన కొండ భొట్టీయం, బిల్హణీయాల్లో; కవిత్వంలో, కథల్లో ఒక్కలాగే కనిపిస్తాయి. ఇందులో ప్రధానమైనవి స్త్రీల సమస్యలు. ఆదర్శ దాంపత్యం గురజాడ స్వాప్నిక సత్యం. అదే కవితలో ప్రతిధ్వనించింది, అదే కథలుగా రూపుదాల్చింది. స్త్రీలకు సమానత్వం కావాలి, స్వేచ్ఛ కావాలి, గౌరవం కావాలి. అంతమాత్రమే కాదు. ఇవన్నీ పురుషుడితో స్నేహపూర్వకంగా సాధించాలి. 'దిద్దుబాటు' కథలో గోపాలరావుకి హృదయం ఉంది, మెదడు లేదు. 'మెటివ్డా' భర్తకి మెదడు ఉంది, హృదయం లేదు. 'సంస్కర్త హృదయం' కథలో రంగనాథయ్యరుకు రెండూ ఉన్నాయి, కానీ ధైర్యం లేదు. 'హృదయం, మెదడు ఉన్న భర్త దృష్టిలో మాత్రం భార్య సౌందర్యం ఎన్నటికీ తరుగదు'- అన్నాడు గురజాడ. పిరికివాళ్లు ఈ రెండు ఉండి కూడా కళ్ల ఎదుట సౌందర్యానికి అంధులవుతారు. అది కుహనా సంస్కారం. నాంచారమ్మకు ఇవన్నీ ఉన్న సంసారం దొరికింది. ఆమె జీవితం సమగ్రమైంది. అందుకే ఆమె జయపతాక ఎగురవేసింది. ఇది గురజాడ కథాసూత్రం. ఈ నాలుగు కథల్లోనూ పరిష్కారాలు చూపినవారు మహిళలే. అంతేకాదు, కవిత్వ రూపంలో ఉన్న లవణరాజు కల, డామను పిథియస్‌ కథల్లోనూ పరిష్కారాలు చూపినవారూ మహిళలే.
 

పాత కొత్తల మేలు కలయిక

మహిళా చైతన్యానికి ఎలా మార్గదర్శి అయ్యాడో ఆధునిక తెలుగు కవిత్వంలో అనేక నూతన ప్రక్రియలకు బీజావాపం చేయడంలో కూడా అదే విధంగా గురజాడ మార్గదర్శి అయ్యాడు. 'ముత్యాల సరాలు' చిన్న కవితా సంపుటి. ఇందులో ఏ ఇతర కవితా సంపుటిలోనూ లేనన్ని ప్రక్రియా భేదాలున్నాయి. అందులో 'కొత్త పాతల మేలు కలయిక క్రొమ్మెఱుంగులు' చిమ్మింది. గురజాడ రచనల్లో పూర్ణమ్మ కథ, కన్యక, డామను పిథియస్‌, లవణరాజు కల కథనాత్మకమైనవి. పూర్ణమ్మ కథను 'లిటరరీ బాలెడ్‌' అనవచ్చు. లవణరాజు కలను 'గాథ' అనవచ్చు. 'కన్యక' కథనరీతికి చెందిన రచన. ఇది జానపద సంప్రదాయానికి చెందింది. పూర్ణమ్మ కథ సమకాలీనమైంది. 'లవణరాజు కల' పౌరాణికం, 'కన్యక' జానపదరీతికి చెందింది. 'డామను పిథియస్‌' విదేశీయమెంది, గ్రీకు కథ. అందులో ప్రాంతీయత అనే గుణం లేదు. ఇది లోకరీతికి చెందింది. కాని, గురజాడ ఈ అన్నింటిని మానవతాసూత్రంతో ముడివేసి చూపించదలచాడు. అందుకే ఈ కథన రీతిలో వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ముత్యాల సరాలు, కాసులు అనే రచనలు రెండూ నాటకీయ ప్రక్రియకు చెందినవి. ముత్యాల సరాలు 'సోలిలకీహే' అయిత,ే కాసులు 'డ్రమటిక్‌ మోనోలాగ్‌' అవుతుంది. దేశభక్తి, మనిషి, దించు లంగరు, లంగరెత్తుము అనే రచనలు భాగగీత ప్రక్రియకు చెందినవి. దేశభక్తిని 'సాంగ్‌' అనే ప్రక్రియగా గుర్తించాలి. 'మనిషి' అనే కవితలో సానెట్‌ ప్రభావం ఉంది. దించు లంగరు, లంగరెత్తుము అనే రచనలు 'ఓడ్‌' అనే ప్రక్రియకు సంబంధించినవి. ఇవన్నీ కొత్త ప్రక్రియలు. 'మిణుగురులు' జానపద గేయ లక్షణం గల రచన. నీలగిరి పాటలు దేశి సంప్రదాయాన్ని అనుసరించిన కృతులు. 'మాటల మబ్బులు' అనే రచన ముక్తక ప్రక్రియకు సంబంధించింది. 'మెరుపులు' ముక్తకాలే కానీ అనువాదాలు, 'పుష్పవావికలు' అనే రచన ఖండకావ్య ప్రక్రియకు చెందినది. 'సుభద్ర' అనే రచన కావ్యప్రక్రియను అనుసరించింది. 'ఋతుశతకము' అనే రచన శతక సంప్రదాయానికి చెందింది. ఇవన్నీ పాత ప్రక్రియలు. ఈ 'కొత్త పాతల మేలుకలయిక' గురజాడ కవిత్వంలో క్రొమ్మెరుగులను చిమ్మింది.

సంస్థానం దావాను తమకు అనుకూలంగా మార్చడానికి ప్రతికక్షులు ఆ రోజుల్లో నలభైవేల రూపాయలు లంచం ఇవ్వజూపినప్పుడు పిడికెడు అన్నం తిని అరిగించుకోలేనివాడికి పుట్టెడు డబ్బుతో పని ఏముందని ప్రశ్నించి గురజాడ ఆ లంచాన్ని మృదువుగా తిరస్కరించాడు. వ్యక్తిని ఉన్నతుడిగా తీర్చిదిద్దడానికి ఇంతకన్నా ఆచరణ పూర్వక ప్రయత్నం ఏముంటుంది? 1912నాటి ఈ మార్గదర్శక సూత్రాలను మనం పాటించి ఉంటే- 2012లో మన సమాజం ఇంతటి దుస్థితిలో ఉండేదా?ఇది గురజాడ గొప్పతనం. ఆధునిక భారతీయ సాహిత్య శిఖరారోహకుల్లో టెన్సింగ్‌ నార్కే- గురజాడే. మిగిలినవారందరూ ఆ బృందంలోని సభ్యులు. జెండా పాతినవాడు గురజాడ. ఆ జెండా పేరు దేశభక్తి. మానవతా సంకేతమైన ఆ గీతం అంతర్జాతీయ శాంతి పాఠం!
 

గురజాడ సూత్రాలు

  • వ్యక్తి స్వేచ్ఛను సాధించండి. అందువల్ల దేశం స్వతంత్ర దేశమవుతుంది. జాతి మత కుల భేదాలు మరచి ప్రేమను పంచండి. ప్రేమనిస్తే ప్రేమ వస్తుంది. కామించవద్దు, ప్రేమించండి.
  • మనిషిని దేవుడిగా కొలుచుకో... స్వర్గాన్ని నేలకు దింపుకో.
  • పరిశ్రమల కంటే పాడిపంటలకు పెద్దపీట వెయ్యండి, దేశం సుభిక్షమవుతుంది. చేతివృత్తులను పోషించండి. దిగుమతులు వద్దు, అన్ని దేశాలలోను దేశిసరుకులను అమ్మండి- ఇది గురజాడ ఆర్థిక సూత్రం.
  • విద్యను ప్రభుత్వమే నిర్వహించాలి. వ్యక్తుల చేతిలో ఉంచకూడదు. అబద్ధాలు చెప్పే చదువులు ఆపండి. అసలు నిజాలు చెప్పే చదువులు మొదలు పెట్టండి. అర్థం కాని, ఉపయోగపడని చదువులు మనకొద్దు.
  • చదువు కొందరి కోసం కాదు, అందరికీ. మాతృభాషలోనే చదువు చెప్పాలి. ఇతర భాషలో విద్యాబోధన చేయవద్దు.
  • ఆరోగ్యంతో కూడిన జాతి అభ్యుదయాన్ని సాధిస్తుంది. జాతి బలపడితే దేశం బలపడుతుంది. దేశాభిమానాన్ని మొలకెత్తించే సాహిత్యాన్ని, కళలను సృష్టించండి. ఇది అందరినీ ఏకం చేసే దారి.
  • మనసు నిర్మలంగా ఉంటే మేధ మెరుగుపడుతుంది. అది దేశానికి తరుణోపాయాన్ని చూపిస్తుంది.
  • కత్తులు దూయడం మానుకో... కత్తు కలపడం నేర్చుకో. ఎదుటివాడికంటే ఎక్కువ నేర్చుకో... ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపో.
  • ఇతరుల సంపద కోసం ఆశపడకు, కలిగినంతలో లేనివారికి సహాయం చెయ్యి. ఇది జాతిని శీలవంతం చేయడానికి ఉపదేశించిన మహాసూక్తం.
  • కబుర్లుచెప్పే కాలం గడిచిపోయింది, కార్యక్షేత్రంలో దూకాల్సిన సమయం ఆసన్నమైంది. ఆశయం కాదు, ఆచరణ ప్రధానం.
మూలం / సేకరణ: 
ఈనాడు.నెట్