‘కన్యాశుల్కం’ నాటకం ఇవాల్టికీ గురజాడ కళా సృష్టికి దర్పణంగా నిలుస్తోంది. ‘ముత్యాల సరాలు’ ఛందస్సులో ఆయన తెచ్చిన గొప్ప మార్పుకి ప్రతీకగా నిలుస్తోంది. ‘తెలుగు కవిత్వంలో నేను కొత్త, ఎక్స్పెరిమెంట్ ఆరంభించాను. నా ముత్యాల సరాల రీతిని మీరు గమనించినట్లయితే మీకే ఈ విషయం ధృవపడుతుంది... నా మొదటి గేయంలో సాధ్యమైనన్ని వాడుక మాటలను, గ్రాంధిక వ్యాకరణ సూత్రాలకు, లేదా ప్రాచీన కవుల పద్ధతులకు ఒదగని శబ్దాలను ప్రయోగించాను’ అని ఆయన ఒక లేఖలో రాశారు. నాటక ప్రక్రియలో, కవితా వ్యాసంగంలో, వ్యవహారిక భాషకు పునాది వేసిన గురజాడ విమర్శన మార్గాన్ని కూడా అనుసరించాడు. ప్రత్యేకించి విమర్శనాత్మక రచనలు చేయలేదు. కాని లేఖల్లో, ‘అసమ్మతి పత్రం’లో ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఆయన హేతువాద విమర్శనా దృష్టికి ఉదాహరణగా నిలుస్తాయి. నాటకంలో, కవిత్వంలో ఆయన కళాత్మక నైపుణ్యం కనిపించినట్టే, విమర్శకి సంబంధించిన ఆయన శాస్ర్తీయ ఆధునిక దృష్టిని ఆ అభిప్రాయాలు తెలియచేస్తాయి.
ఆయన సమర్పించిన ‘అసమ్మతిపత్రం’లో, లేఖల్లో కనిపించే ఆయన దృక్పథాన్ని బట్టి చూస్తే ఆయన విమర్శ రంగంలో కూడా ఎంత విశిష్టత సంపాదించగలరో అర్ధమవుతుంది. అయితే ఆయన తలపెట్టి, నిర్వహించలేకపోయిన పనుల్లో ఇదొకటి. దాని వల్ల తెలుగు సాహిత్యం ఆ మేరకు నష్టపోయింది. తాను సంకల్పించి చేయలేని పను గురించి ఆయన ఉత్తరాల్లో తెలుస్తూ ఉంటాయి. ‘తెలుగు వ్యాకరణం’ వ్రాతామనుకున్నానా ఆరంభించిన పని అలాగునే నిద్ర పోతూ ఉంది (ఒంగోలు ముని సుబ్రహ్మణ్యానికి, 1909 మే 17). మరొక నాటకం వ్రాతామని కథా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను (ఆయనకే 1909 మే 24).
ఆంధ్రకవుల, వారి పోషకుల కాల నిర్ణయం కోసం కావ్యాల ప్రథమాశ్వాసాలని పరిశీలించే పనీ ఒంగోలు మునిసుబ్రహ్మణ్యం మీద పడింది. అప్పారావుగారికి ‘ఆంధ్ర కవుల చరిత్రను వ్రాసి ప్రచురించవలెనని ఆశయమై ఉండె’నని ఆయన రాశారు. అయితే ఆ పనులు సాగలేదు.‘ఒక కావ్యాన్ని చదివి దాన్ని సునిశితంగా పరిశీలించి తూచినట్టు విలువ కట్టే విమర్శకులు మనలో బహు అరుదు’ (లేఖలు) అని ఆయన అభిప్రాయపడ్డారు. కావ్యాల విషయంలోనే కాదు, భాషాపరంగా కూడా సరైన విమర్శ లేదని ఆయన అభిప్రాయం. ఇవాళ తెలుగు కవితా పద ప్రయోగాల వ్యాకరణం పదకొండవ శతాబ్దినాటి ఆది కావ్యం నాటి వ్యాకరణం గానే ఉంది.
ఇవాళ ఆ పాతగిల్లిన పదజాలాన్నే వాడుతూ ఉన్నారు. ఆ వ్యాకరణం పడికట్టునే పట్టుకు వేళాడుతున్నారు. భాషకు సంబంధించిన శాస్త్రీయ అధ్యయనమే జరగడం లేదు. ఒక్క గిడుగు రామమూర్తి పంతులు తప్ప యెవళ్ళూ ఈ కృషి చెయ్యడం లేదు’ అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు. ఆయన అభిప్రాయంలో సాంఘిక, రాజకీయ, సాహిత్య లక్ష్యాలు మారేయి. సాహిత్యం ఏ కొద్దిమందికో మాత్రమే గిరి గీసుకు పోయి కూర్చోలేదు. బ్రిటిష్ విద్యావిధానం వల్ల జీవితం పట్ల, భాష పట్లా, సాహిత్యం పట్లా ప్రజల దృక్పథం మారింది. ఒప్పుడు విద్యా, సాహిత్యాలు సమాజంలో ఒక శ్రేణికి మాత్రమే గుత్త హక్కుగా ఉండేవి. వారికి సంస్కృత మర్యాదలే అనుల్లంఘనీయంగా కనిపించేవి. పరిస్థితి మారింది.
ప్రజాస్వామిక విధానం వల్ల జన సామాన్యానికి విద్య అందుబాటులోకి వచ్చింది. ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన భాషా సాహిత్యాలు జనసామాన్యానికీ అందుబాటులోకి రావాలి. అంచేత పాతపడిన పదసంచయం, కాలం చెల్లిన కావ్యమర్యాదలూ పోవాలి. పాత పద్ధతిలో ఎంత పాండిత్య ప్రకర్షతో, పద గుంభనతో ఓ కావ్యం ఉంటే అంత గొప్ప. అందుకు గాను కావ్య భాషలో ఒక పదానికి అనేక పర్యాయ పదాలు ఉండేవి. దాంతో భాష గుది బండలా తయారైంది. అలాంటి ఇబ్బందులకు సెలవు చెప్పి ఆధునిక వ్యవహారిక తెలుగు వాడుకలోకి వస్తే తెలుగు గ్రంథాల రాశి, వాసి కూడా పెరుగుతాయి. కావ్యభాషలోనే రాయాలన్న నిబంధన వల్ల చదువుకున్నవాళ్ళు కూడా యెక్కడ వ్యాకరణ నియమాలకి భంగం కలుగుతుందో, ఎక్కడ శబ్దాలని అపసవ్యంగా ప్రయోగించడం జరుగుతుందో నని బెదిరిపోతున్నారు.
మామూలుగా అయితే వాళ్ళు హాయిగా తమ భావాల్ని వెల్లడించగలరు. కాని రాతలో భాష ఆ పాత నియమాలకు కట్టుబడి ఉండాలన్న నియమం వల్ల జంకుతున్నారు. వాడుక భాష వస్తే ప్రజలకి స్వేచ్ఛ వస్తుంది. వికాసం వస్తుంది. భావవిప్లవం వస్తుంది. ఇలాంటి అభిప్రాయాలకి భిన్నంగా వ్యవహారిక భాషను వ్యతిరేకిస్తూ గ్రాంథిక భాషా వాదులు అనేక వాదనలు లేవదీశారు. వాటన్నిటికీ అప్పారావు సమాధానం చెప్పేరు. ఒక ప్రామాణిక భాష అన్ని మాండలికాల్నీ ఇముడ్చుకుంటూ పరిపుష్టం చేసుకుంటూ వెల్లివిరుస్తుందని చెప్పేరు.
ఇంగ్లీషు, ఫ్రెంచి సాహిత్య భాషలు లండన్, పారిస్ పలుకుబళ్ళనుంచి రూపు తీసుకున్నాయని చెప్పేరు. అలాగే ఇటాలియన్ డక్కనీ నుడికారం నుంచి ప్రామాణికత సంపాదించుకుందని చూపించేరు (ఇవాళ ప్రాంతీయ నుడికారాల గురించి చర్చ జరుగు తూఉంది. కారణాలు ఏమిటైందీ వివరించడం అనవసరం. కాని అన్ని ప్రాంతాల వాళ్ళూ కొన్ని మినహాయింపులున్నా, అందరికీ బోధపడే భాషనే రాస్తున్నారు, మాట్లాడుతున్నారు).
భాషా పరంగా ఇంత విమర్శనాత్మకంగా శాస్ర్తీయ దృక్పథాన్ని వివరించి గురజాడ సాహిత్యం గురించీ తన విమర్శను అసమ్మతి పత్రంలో ప్రకటించేరు. ఉత్తరాలలో వెల్లడించిన అభిప్రాయాలకి, అసమస్మతి పత్రంలో వెల్లడించిన అభిప్రాయాలకీ పునాది ఒక్కటే. శాస్త్రీయ పద్ధతిలో గ్రంథాల్ని విమర్శించడం. విజ్ఞాన చంద్రికా గ్రంథమాల ప్రచురించిన నవల ‘విజయనగర సామ్రాజ్యం’ గురించి సుదీర్ఘ విమర్శ చేశారు. దానికి బహుమతి కూడా వచ్చింది. ఆ నవలని ప్రధాన సంపాదకుడు, మేనేజర్ ఆమోదించి ప్రచురించినట్టు రచయిత ముందు మాటలో చెప్పుకున్నారు. సంపాదకులు ‘విజయ నగర సామ్రాజ్యం’ యెంత గొప్ప నవలో ప్రశంసించినట్టూ రచయిత చెప్పుకున్నారు. అంచేత సంపాదకులతో సహా అందరూ దాని బాగోగులకి బాధ్యత వహించాలని గురజాడ ముందే ప్రస్తావించేరు.
రచయితకి చరిత్ర గురించిన పరిజ్ఞానమూ లేదు. విషయానికి సంబంధించి వాస్తవాలు ఏమిటైందీ జాగ్రత్తగా చూసుకునే మెలుకువా లేదు. రెండ్రోజులు మాత్రమే చరిత్ర చదివి, రచనకి శ్రీకారం చుట్టి, నెల లోపు పూర్తి చేసినట్టు జంకూ గొంకూ లేకుండా చెప్పుకోవడం యెంత ఆక్షేపణీయమో గురజాడ విశదీకరించేరు. అసలు చారిత్రక నవలల ఇతి వృత్తం విషయంలో ప్రామాణిక రచనలు చదవలేదు. సీవెల్ రాసిన ‘విస్మృత సామ్రాజ్యం’ గురించి తెలియదు. దాంతో చరిత్రలో యథార్థంగా జరిగిన విషయాన్నీ వక్రీకరించేడని గురజాడ తప్పు పట్టేరు.
ఆయన ఉత్తమ సాహిత్య లక్షణాల గురించి మెరుపు మెరిసినట్టు సూచనలు చేశారు. తనే శాస్ర్తీయ పద్ధతిలో ఆంధ్ర కవుల చరిత్ర రాద్దామని సంకల్పించారు.కందుకూరి వీరేశలింగం రాసిన ‘కవుల చరిత్ర’ వచ్చింది. దాన్ని ఆయన పరిశీలించిన తీరు ఆయన దృక్పథానికి అద్దం పడుతుంది. ఈ పుస్తకం అటు పక్షుల్లోకీ రాదు, ఇటు జంతువల కిందకీ చేరదు. ఎలా వర్గీకరించాలి? అసలిది కవుల జీవితమే కాదు చెప్పాలంటే. కవుల జీవిత చిత్రణకి ప్రయత్నమే లేదు. ఇక కవుల క్రమం సంగతి సరే సరి అని చెబుతూ జాన్సన్ కృతిని యెత్తి చూపిస్తారు. గురజాడ లేఖల్లో, రచనల్లో వెల్లడించిన అభిప్రాయాల బట్టి ఆయన ఎంతటి విమర్శకుడు అయి ఉండేవాడో తెలుస్తుంది.