రుద్రదేవ మహారాజు కాకతీయ సామ్రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా నెలకొల్పి ఈ ఏటికి 850 సంవత్సరాలు, కాకతీయ మహా సామ్రాజ్ఞి రుద్రమదేవి పట్టాభిషేకం జరిగి ఈ ఏటికి 750 సంవత్సరాలు, హనుమకొండలో వేయి స్థంబాల గుడి నిర్మించి ఈ ఏటికి 850 సంవత్సరాలు, అంతే కాదు పాలం పేటలోని ప్రసిద్ద రామప్ప దేవాలయం నిర్మించి కూడా ఈ ఏటికి 800 సంవత్సరాలు..
అలనాటి స్వర్ణయుగ వైభవానికి ప్రతీక.. శిల్పకళా సౌందర్యానికి నిలయం.. సాహితీ వేత్తల సౌరభాలు గుబాళించిన నేల.. వెలకట్టలేని 'కోహినూర్' పుట్టినిల్లు.. కాకతీయ సామ్రాజ్యం. శాతవాహనుల తర్వాత తెలుగు దేశాన్నంతా ఒక రాజకీయ ఛత్రం క్రిందకు తెచ్చి దేశ సమగ్రత, సమైక్యతను చేకూర్చిన తెలుగుపాలకులు కాకతీయులు. ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయులకు ఒక ప్రత్యేక, విశిష్టమైన స్థానం ఉంది. వీరు విశాల సామ్రాజ్యాన్ని పాలించడమే కాక పటిష్ట పరిపాలనావ్యవస్థను ప్రవేశపెట్టి వ్యవసాయానికి నీటి వనరులు కల్పించి,గ్రామీణ జనజీవితాలలో కళా సాహిత్యాలను సజీవపరిచి, విశిష్టమైన దేవాలయ నిర్మాణాలను కావించి, తెలుగువారి రాజకీయ, సాంస్కృతిక వారసత్వ జీవనానికి తోడ్పడినారు.కాకతీయుల కాలంలోనే ఆంధ్ర, త్రిలింగ పదాలు సమానార్థకాలై, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందాయి. వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదు ధరించారు.