Latest posts
-
పులిపాలు దెచ్చిఇచ్చిన
పులిపాలు దెచ్చిఇచ్చిన నలవడఁగ గుండెగోసి యరచే నిడినం దలపొడుగు ధనము బోసిన వెలయాలికి గూర్మిలేదు వినురా సుమతీ! తాత్పర్యము దుస్సాధ్యమైన పులిపాలు తెచ్చి ఇచ్చినా, హృదయాన్ని కోసి అరచేతిలో పెట్టినా, నిలువెత్తు ధనం పోసినా వేశ్యకు నిజమైన ప్రేమ ఉండదు.
-
పెట్టిన దినములలోపల
పెట్టిన దినములలోపల నట్టడవులకైనవచ్చు నానార్థములున్ బెట్టని దినములఁ గనకపు గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ! తాత్పర్యము అదృష్టం కలసివచ్చిన రోజుల్లో అడవి మధ్యలో ఉన్నా అన్ని సంపదలూ అక్కడికే వస్తాయి. దురదృష్టం వెన్నాడేటపుడు బంగారు పర్వతాన్ని ఎక్కినా ఏమీ లభించదు.
-
పొరుగున పగవాడుండిన
పొరుగున పగవాడుండిన నిర వొందగ వ్రాతగాఁడె ఏలికయైనన్ ధరఁగాఁపు కొండెమాడినఁ గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ! తాత్పర్యము ఇంటి పక్కనే శతృవు ఉన్నా, బాగా రాయగలవాడే ప్రభువు అయినా, గ్రామ పెత్తందారు కొండెములు చెప్పేవాడయినా లేఖరుకు జీవితం గడవదు.
-
బంగారు కుదువబెట్టకు
బంగారు కుదువబెట్టకు సంగరమునఁ బారిపోకు సరసుఁడవగుచో నంగడి వెచ్చములాడకు వెంగలితో జెలిమి వలదు వినురా సుమతీ! తాత్పర్యము బంగారు నగలను తాకట్టు పెట్టవద్దు. యుద్ధభూమి నుంచి వెన్నిచ్చి పారిపోవద్దు. దుకాణం నుంచి సరకులు అరువు తెచ్చుకోవద్దు. మూఢునితో స్నేహం చేయవద్దు.
-
బలవంతుడ నాకేమని
బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ! తాత్పర్యము నేను చాలా బలవంతుడ్ని. నాకేమీ భయం లేదని నిర్లక్ష్యం చేసి విర్రవీగి విరోధం తెచ్చుకోవడం మంచిది కాదు. అది ఎప్పుడూ హాని కలిగిస్తుంది. ఎంతో బలం కలిగిన సర్పం కూడా చలిచీమలకు లోబడి చావడం లేదా?
-
మండలపతి సముఖంబున
మండలపతి సముఖంబున మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్ గొండంత మదపుటేనుగు తొండము లేకుండినట్లు తోచుర సుమతీ! తాత్పర్యము కొండంత పెద్దదైన ఏనుగు అయినా తొండం లేకపోతే ఎలా శోభావిహీనంగా ఉంటుందో అలాగే, గొప్ప దేశాన్ని పరిపాలించే రాజు దగ్గర సమర్థుడైన మంత్రి లేకపోతే అతని పాలన అంతే శోభావిహీనమవుతుంది.
-
మంత్రిగలవాని రాజ్యము
మంత్రిగలవాని రాజ్యము తంత్రము సెడకుండ నిలచుఁ దరచుగ ధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రపుఁగీలూడినట్లు జరుగదు సుమతీ! తాత్పర్యము సమర్థుడైన మంత్రి ఉంటే సామ, దాన, భేద, దండ వంటి ఉపాయాలు పాడుకాకుండా సాగిపోతాయి. అలాంటి మంత్రి లేకపోతే కీలూడిపోయిన యంత్రంలా ముందుకు సాగవు.
-
మాటకు బ్రాణము సత్యము
మాటకు బ్రాణము సత్యము కోటకుఁ బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్ బోటికిఁ బ్రాణము మానము చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ! తాత్పర్యము నోటిమాటకు సత్యం, పెద్ద దుర్గానికి గొప్ప సైన్య సమూహం, స్త్రీకి అభిమానం, పత్రానికి చేవ్రాలు ముఖ్యమైన ఆధారాలు.
-
మానఘనుఁ డాత్మధృతిఁ జెడి
మానఘనుఁ డాత్మధృతిఁ జెడి హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్ మానెడు జలములలోపల నేనుఁగు మెయి దాఁచినట్టు లెరగుము సుమతీ! తాత్పర్యము అభిమాన శ్రేష్టుడు మనోధైర్యం చెడి అల్పుని ఆశ్రయించడం మానెడు నీళ్లలో ఏనుగు తన శరీరాన్ని మరుగుపరచినట్లుండును.
-
నాది నొకని వలచియుండగ
నాది నొకని వలచియుండగ మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్ బొది జిలుక పిల్లి పట్టిన జదువునె యా పంజరమున జగతిని సుమతీ! తాత్పర్యము పిల్లి పంజరాన్ని పట్టుకుంటే ఆ పంజరంలో ఉన్న చిలుక మాట్లాడుతుందా? అలాగే, మనసులో ఒకతన్ని ప్రేమించిన స్త్రీ విటుడు ఎంత బతిమాలినా ప్రేమించదు