హాస్యనట చక్రవర్తి "రాజబాబు"

Rajababuతెలుగు సినీ వినీలాకాశంలో తనదైన హాస్యనటనతో అలరించి విభిన్నమైన శైలిలో ఓ ప్రత్యేకముద్రను వేసి మనందరి మదిలో చిరకాలం గుర్తిండిపోయే హాస్యనట చక్రవర్తి రాజబాబు. తన నటనా వైదుష్యంతో, సమాజంలో తోటి మనుషులకు సాయపడే ధర్మగుణంతో తనజీవితాన్ని సార్థకం చేసుకొన్న నవ్వులరేడు వరుసగా ఏడుసార్లు ఫిలింఫేర్‌ అవార్డులు తీసుకున్న మొదటి కమెడియన్‌ రాజబాబు.

మనిషి జీవితంలో వచ్చే పలు ఒత్తిడులు, అశాంతి నుండి బయటపడి మనశ్శాంతిగా, ఆనందంగా ఉంచగలిగే సున్నితమైన ఆయుధం హాస్యం అని చెప్పొచ్చు. ఈ హాస్యం ఏ మాత్రం పట్టుతప్పినా అపహాస్యం పాలవుతుంది. అటువంటి హాస్యాన్ని తమ నటన, వాచకంతో మెప్పించిన కస్తూరి శివరావు, చదల వాడ, నల్లరామ్మూర్తి, రమణారెడ్డి, రేలంగి, వంగర, శివరామ కృష్ణయ్య, తదితరులు ఒక ప్రత్యేకమైన నటనతో, హాస్యంతో ఆనాటి ప్రేక్షకులను నవ్వించగలిగారు. ఆయా సన్నివేశాలను చూసినప్పుడు నవ్వని నేటి ప్రేక్షకులు కూడా ఉండరు. వారితో పాటు నటించి నేటి తరం ప్రేక్షకులకు నవ్వుకు చిరునామాగా మారిన, హాస్యాన్నేకాదు, బాధను సైతం తన నటనలో పలికించిన 'హాస్యనటచక్రవర్తి', మంచి మనిషి రాజబాబు.

హాస్యనటులు తమలో ఎంత బాధ ఉన్నా తెరపై చూసేవారికి నవ్వులు పూయించాలి. ఈ అనుభవం ఒకప్పటి ఎందరో హాస్యనటులకు అనుభవమే. అందుకే అన్నారేమో ఆత్రేయ 'నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి' అని. అలా కొన్ని సినిమాల్లో నవ్వించినా, మరికొన్ని సినిమాల్లో ఏడిపించినా అది ఆ హాస్యనటచక్రవర్తికే చెల్లింది. అంతేకాదు డైలాగ్‌ డెలివరీలో వేగం, దానికి తగ్గట్టుగా అభినయం, నేటి ప్రేక్షకులు బ్రేక్‌, షేక్‌ అని చెప్పుకునే డ్యాన్స్‌లను ఆనాడే చేసి హాస్యనటుల్లో అద్భుతమైన డ్యాన్సర్‌గా చెప్పదగ్గ హాస్యనటుడు రాజబాబు.

రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. 1938 సంవత్సరం అక్టోబరులో ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురంలో పుణ్య మూర్తుల ఉమామహేశ్వరరావు, రవణమ్మ దంపతులకు జన్మించారు. ఈయనతోపాటు ఇప్పటి సినిమాల్లో నటిస్తున్న చిట్టిబాబు, అనంత్‌లు ఆయన తమ్ముళ్ళే. వీరు కూడా తెలుగులో మంచి హాస్యాన్ని అందించే హాస్యనటులుగా పేరుపొందారు.

ఇంటర్మీడియట్‌తో పాటు టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సును పూర్తిచేసిన రాజబాబు కొంతకాలం పాటు టీచర్‌గా కూడా పనిచేశారు. చిన్నప్పటి నుండి వున్న నటనాభిలాషతో రంగస్థలంపై 'కుక్కపిల్ల దొరికింది, నాలుగిళ్ళచావడి' వంటి నాటకాల్లో సైతం నటించి రంగస్థలంపై మంచి నటుడుగా పేరుతెచ్చుకున్నారు.  ఒకసారి ఈయన రంగస్థలంపై వేసిన నాటకం చూసిన అప్పటి ప్రముఖ దర్శకులు గరికపాటి రాజారావుగారు ప్రోత్సహించటంతో 1960వ సంవత్సరంలో మద్రాసు వెళ్ళారు.

ఆయన చెప్పిన ట్యూషన్లే ఆయనకు సినిమాల్లో అవకాశాలు కల్పించాయి. అప్పట్లో నటుడు, దర్శకుడు అయిన అడ్డాల నారాయణరావుగారి పిల్లలకు పాఠాలు చెప్పిన రాజబాబుకు ఆయన తాను తీసిన 'సమాజం' చిత్రంలో అవకాశం ఇచ్చారు. అదే రాజబాబు సినీప్రస్థానంలో తొలి అడుగు. రావికొండలరావు, డా. గరికపాటి రాజారావుగార్ల ప్రోత్సాహంతో రంగస్థలం మీద కూడా తనను తాను నిరూపించుకున్నాడు.  అంతేకాదు హాస్యనటుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే వారని, ప్రతి ప్రముఖహీరో చిత్రంలోనూ తప్పనిసరిగా ఈయనకు ఓ పాత్ర ఉండేలా దర్శకులు, నిర్మాతలు చూసేవారని అంతగా ఆయన జనాభిమానం పొందారని ఆనాటి సినీఅభిమానుల మాట. అలా 20యేళ్ళపైబడి ఈయన సినీజీవితంలో 590కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను, విమర్శకులను సైతం మెప్పించారు. ఒక్క రమాప్రభతోనే జంటగా 300 సినిమాలు నటించాడని చెప్పుకుంటారు. అలా వెలిగిపోతున్న కాలంలో హీరో కంటే ముందుగా రాజబాబునే  నిర్మాతలు బుక్ చేసుకునేవారు అనడంలో అతిశయోక్తి లేదు.

తండ్రులు-కొడుకులు, కులగోత్రాలు, మంచిమనిషి, అంతస్తులు, భీష్మ, పరువుప్రతిష్ట, నవరాత్రి, పరమానందయ్యశిష్యులకథ, ఉమ్మడికుటుంబం, విచిత్రకుటుంబం, గూఢచారి 116, సాక్షి, బంగారుపిచ్చిక, రణభేరి, కథానాయకుడు, కోడలు దిద్దినకాపురం, అందాలరాముడు, మహాకవి క్షేత్రయ్య, అల్లూరి సీతారామరాజు, బుజ్జిబాబు, గడసరి అత్త సొగసరి కోడలు ఇలా ఎన్నో చిత్రాల్లో తన నవ్వులను పూయించారు.

కేవలం హాస్యనటునిగానే కాకుండా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించి యస్వీరంగారావు, అంజలిదేవి వంటి మహా మహులు నటించిన 'తాతా మనవడు' చిత్రంలో హీరోగా నటించారు. ఆ చిత్రం ద్వారా ఆయన కేవలం హాస్యనటునిగానే కాకుండా సీరియస్‌, ఉదాత్తమైన పాత్రలు కూడా చేయగలరని నిరూపించింది ఆ చిత్ర ఘనవిజయం. పిచ్చోడిపెళ్ళి, తిరుపతి, ఎవరికివారే యమునాతీరే, మనిషిరోడ్డున పడ్డాడు వంటి చిత్రాల్లో కూడా హీరోగా నటించారు. ఈయనకు సినిమాల్లో జోడిగా లీలారాణి, మీనా కుమారి, ప్రసన్నరాణి, గీతాంజలి, రమా ప్రభ వంటి వారు నటించినా రాజబాబు- రమాప్రభల జంట హిట్‌ఫెయిర్‌గా ఎన్నో చిత్రాల విజయంలో తమ వంతు పాత్రను పోషించింది. నటనే కాకుండా గాయకు నిగా కూడా ఈయన అరుదుగా తన గళం వినిపించారు. ఈ పాట ప్రేక్షకులు అభిమానించే హాస్య పాటల్లో ప్రముఖమైన పాటగా నేటికీ ప్రేక్షకుల మన్ననలను అందుకుంటోంది అది ఇల్లు-ఇల్లాలు చిత్రంలో 'వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను, అసలు విషయము చెబుతాను' అంటూ సాగే పాటలో రాజబాబు గాత్రం వినిపించి ఆ పాటకు సరికొత్త అందాన్ని, ఆ చిత్ర విజయానికి దోహదం చేసిందంటే అతిశయోక్తికాదు.

అలాగే నటీనటుల  సరసనకు వస్తే ఎన్‌.టి.ఆర్‌.తో కథానాయకుడు, బడిపంతులు, అడవిరాముడు వంటి చిత్రాల్లో అద్భుతమైన హాస్యాన్ని పండించారు. అలాగే నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, తదితర నటులతో ఇద్దరు అమ్మాయిలు, ప్రేమనగర్‌, ఇల్లు-ఇల్లాలు,గూఢచారి 116, జీవనజ్యోతి, సొగ్గాడు వంటి చిత్రాలు ఉదాహరణలు మాత్రమే.
Rajababu
నటునిగానే కాకుండా నిర్మాతగా "బాబ్‌ అండ్‌ బాబ్‌ ప్రొడక్షన్" పై ఎవరికివారే యమునాతీరే, మనిషిరోడ్డునపడ్డాడు వంటి సందేశాత్మక చిత్రాలను నిర్మించి, నటించారు.

నటనలోనే కాదు వ్యక్తిత్వం లోను ఎంతో గొప్ప వాడని పించుకున్న  హాస్యరస చక్రవర్తి ఆయన. రాజబాబు కెరియర్ ని పరిశీలిస్తే, మంచితనానికీ ... మానవత్వానికి ఆయన ప్రతీకలా కనిపించే సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అలాంటి సంఘటనే ఒకసారి ఓ చిత్రం షూటింగ్ సమయంలో జరిగింది.

అవి 'భలేకాపురం' (1980) సినిమా షూటింగ్ జరుగుతోన్న రోజులు. ఆ సినిమాకి గోపాలకృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మొదటి చిత్రం 'లక్ష్మణరేఖ' కావడంతో అందరూ ఆయనని 'లక్ష్మణరేఖ గోపాలకృష్ణ' అని పిలిచేవారు. ఇక 'భలే కాపురం' చిత్రానికి సంబంధించిన షూటింగ్ ని చెన్నైలోని వాహినీ స్టూడియోలో ప్లాన్ చేశారు. ఆ రోజున రాజబాబు - రమాప్రభలపై కొన్ని హాస్య సన్నివేశాలను అక్కడ చిత్రీక రించవలసి ఉంది. అయితే, అప్పటికే అనారోగ్యం పాలైన రాజబాబు, ఆ స్టూడియో పక్కనే ఉన్న విజయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
       

  ఆ పరిస్థితుల్లో ఆయనని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక గోపాలకృష్ణ స్టూడియోలోనే పచార్లు చేస్తున్నారు. తన కారణంగా ఆయన ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకున్న రాజబాబు, ఆసుపత్రి సిబ్బంది కంటపడకుండా తప్పించుకుని స్టూడియోకి వచ్చేశాడు. చక చకా మేకప్ వేయించుకుని గోపాలకృష్ణ ముందు ప్రత్యక్షమైపోయాడు. తనలో ఆవహించిన నీరసాన్ని తనదైన శైలి హుషారుతో కప్పిపెడుతోన్న రాజబాబుని చూసి ఆయన షాక్ అయ్యారు. ''ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు వచ్చారు? మీరు కోలుకున్నాక ఈ సీన్లు చేసేవాడిని కదా'' అని గోపాలకృష్ణ కంగారుగా అన్నారు.
      

"నేను ఎంతో మందికి ఎన్నో చేశాను ... మీకు మాత్రం ఏమీ చేయలేకపోయాను. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇలా వచ్చేశాను'' అన్నారు రాజబాబు. ఆ మాటలకి కన్నీళ్లు పెట్టుకున్న ఆ దర్శకుడు, వెంటనే ఆయన సీన్స్ ని చక చకా తీసేసి పంపించారట. దాంతో రాజబాబు ఎలా వచ్చాడో అలాగే దొంగలా హాస్పిటల్ కి వెళ్లి ఏమీ ఎరుగనట్టు బెడ్ పై పడుకున్నాడట. అందుకే ఆయన అందరి హృదయాలలోనూ చిరంజీవిలా మిగిలిపోయారు.  

  
సినిమాల్లో ప్రేక్షకులను మనసారా నవ్వించే రాజబాబు నిజజీవితంలో వేదాంతి, తాత్విక స్వభావం కలవారు. గతాన్ని మరచిపోకూడదు. గతం నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాలే జీవితానికి దారిచూపిస్తాయని రాజబాబు అభిప్రాయం. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున పాతతరం నటీనటులను, ముఖ్యంగా హాస్యనటులను సన్మానించేవారు.

రాజబాబు ఎంత సంపాదించినా కూడా తన గతం ఎప్పుడూ మర్చిపోలేదు. ఎన్నో దానధర్మాలు చేసాడు.  తన కష్టకాలంలో ఒక పాక  హోటల్లోని స్త్రీ పెట్టిన  టిఫిన్స్ గుర్తుంచుకుని ఆమె కొడుకులతో మంచి హోటల్ పెట్టించాడు.   ఆయనకు తొలి ప్రేక్షకులు రాజమండ్రి రిక్షా కార్మికులు. ఆయన మిమిక్రీని చూసి ఆనందించి.. అభినందించిన వారిని ఆయన జీవితాంతం గుర్తు పెట్టుకున్నారు. తనను కష్టాల్లో ఆదుకున్న మిత్రులను, సినిమాల్లో వేషాల కోసం తన ఫొటోలు తీసి పెట్టిన బాబు ఫొటో స్టూడియో వారిని కూడా అనునిత్యం తలచుకునే సంస్కారవంతుడు రాజబాబు.  మద్రాసులో అడుగుపెట్టిన రాజబాబు మిమిక్రీ చేస్తూ, ట్యూషన్లు చెప్పుకుంటూ సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నాలు సాగించారు. ఈ ప్రయత్నంలో ఆయన కొన్నిరోజులు కటిక ఉపవాసాలు కూడా చేశారు. ఆ సమయంలో మంచినీళ్లు ఇచ్చి ఆదుకున్న ప్రముఖ నటి, నర్తకి రాజసులోచన ఇంటి వాచ్‌మాన్‌ను కూడా చివరిదాకా తల్చుకున్నారంటే.. వేషాలు దొరికాక కృతజ్ఞత చెప్పడానికి అతన్ని వెదుక్కుంటూ వెళ్లారంటే... ఆయన గొప్పతనమేమిటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఎన్నో సంస్థలకు విరాళాలిచ్చారు. కోరుకొండలో జూనియర్‌ కాలేజీని కట్టించారు., రాజమండ్రిలో పేదలకు ఇంటిస్థలం ఇచ్చారు. ఇలా ఎన్నో గుప్తదానాలు చేసిన దానశీలి. హాస్యం బ్రతికున్నం తకాలం ఆయన ప్రేక్షకుల మదిలో సదా చిరంజీవే.

అవార్డుల విషయానికొస్తే వరుసగా ఏడుసార్లు ఫిలింఫేర్‌ అవార్డును పొందిన మొదటి హాస్యనటుడు రాజబాబే. తన నట జీవితంలో 9 ఫిలింఫేర్‌ అవార్డులు, మూడు నంది అవార్డులు ఇలా ఇంకా ఎన్నో సేవా సంస్థలు, ఇతరసంస్థల నుండి అవార్డులను అందుకున్నారు. శతాబ్దపు హాస్యనటునిగా కీర్తించ బడ్డ ఈయన్ను 'హాస్యనట చక్రవర్తి'గా పిలుచుకునేవారు.

1965లో వివాహమైన రాజబాబుకు ఇద్దరు పిల్లలు. రాజబాబు భార్య లక్ష్మి అమ్ములు, మహాకవి శ్రీశ్రీ మరదలు. ఇద్దరు అబ్బాయిలు. ఇప్పుడు అమెరికాలో స్థిరపడ్డారు. తమ్ముళ్లు చిట్టిబాబు, అనంత్ హాస్యనటులుగా కొనసాగుతున్నారు.

అనుకరణకు అందని నటుడు రాజబాబు. వాచకంలోకాని, అభినయంలోకాని ఆయన శైలి ఎవరికి రాదు. అటువంటి గొప్ప హాస్యనటుడు, మంచి మనిషి 1983 సంవత్సరం ఫిబ్రవరి 14న  స్వర్గస్తులయ్యారు. ఆయన మరణంతో ఓ మంచి హాస్యం కనుమరుగైపోయింది.