గిడుగు రామమూర్తి పంతులు గారు

గిడుగు రామమూర్తి పంతులు గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినమైన ఆగస్టు 29 ను  తెలుగు భాషా దినోత్సవము’గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తున్నది. గిడుగు గారు తెలుగు వ్యావహారిక బాషకు పితామహుడిగా పరిగణించబడతారు. గిడుగు రామమూర్తి గారికి అభినవ వాగమశాసనుడు అని బిరుదు.

గిడుగు వెంకట రామమూర్తి (1863-1940):

తెలుగు ప్రజలు స్మరించదగ్గ ప్రథమ స్మరణీయుడు గిడుగు రామమూర్తి. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి, వచనరచనకు కావ్యభాష పనికిరాదనీ, సామాన్యజనానికి అర్థమయ్యే సమకాలీన “శిష్టవ్యావహారికం”లో ఉండాలనీ ఆనాటి సాంప్రదాయికపండితులతో హోరాహోరీగా యుద్ధంచేసి ఆధునికప్రమాణభాషను ప్రతిష్టించటానికి మార్గదర్శకుడైనవాడు గిడుగు రామమూర్తి.

గిడుగువారి వ్యవహారిక భాషోద్యమం వల్ల ఆధునిక సాహిత్యం కొత్త సొగసులు సంతరించుకుంది. రచనావైవిధ్యం, వైశిష్ట్యంతో పుష్టిచేకూరింది. విశ్వవిద్యాలయాలలో వాడుకభాష రాజ్యమేలుతోంది. పత్రికలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. అక్షరాస్యత పెరిగింది. తెలుగు అధికారభాషగా, పరిపాలనా భాషగా కీర్తికెక్కింది. దీనికంతటికీ గిడుగు పిడుగే మూలకారకుడు.

గిడుగు రామమూర్తి గారి గురించి ఇంకా చెప్పాలంటే

  • గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు.
  • ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.
  • బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది.
  • శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు.
  • గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.
  • తెలుగు భాష గురించి ఆధునిక పద్ధతిలో ఆలోచించిన తొలి భాషా విజ్ఞాని గిడుగు రామమూర్తి గారు.

ఈ వాడుకభాషా వాదాన్ని చేపట్టినందుకు గిడుగువారు పండితులతో యుద్ధం చేయవలసివచ్చింది. దీన్ని గ్రామ్యవాదమనీ, గిడుగువారు గ్రామాచార్యులనీ గ్రాంధికవాదులు హేళన చేస్తూ పద్యాలూ, వ్యాసాలు రాశారు. జయంతి రామయ్యపంతులు, కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, వేదం వెంకటరామశాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి మొదలైన వాళ్ళతో ఢీకొనవలసి వచ్చింది. ఆంధ్రసాహిత్య పరిషత్తు గ్రాంధిక భాషావాదానికి అండగ నిలిచింది. గిడుగువారు ‘తెలుగు’ పత్రిక ద్వారా గ్రాంధిక వాదాన్ని ఖండిస్తూ వ్యావహారిక వాదాన్ని బలపరిచారు. పండితులే తప్పులు లేకుండా రాయలేని గ్రాంధికం బలవంతాన రుద్దడం ఎందుకంటూ “ఆంధ్రపండిత బిషక్కుల భాషాభేషజం” అనే పుస్తకం ప్రచురించారు.

ఆయన సాధించిన మహత్కార్యం ఏమిటి?

  • తెలుగు సాహిత్యంపై పండితుల గుత్త్ధాకారాన్ని పోగొట్టాడు.
  •  ప్రజలలో ఒక్కరు కూడా నిరక్షరాస్యులు కాకూడదని, అందుకు వాడుక భాష సాధనం కాని గ్రాంధికమని తమకే రాని, తమకే తెలియని, భాషను పిల్లలు ఉపయోగించాలనీ అందులోనే పుస్తకాలు రాయాలనీ, దానిలోనే పాఠ్యపుస్తకాలుండాలని శాసించడం అవివేకమని ఉద్యమించారు.
  • చెళ్లపిళ్ల వెంకటశాస్ర్తీ, తాతా సుబ్బరాయుడు శాస్ర్తీ వంటి ఉద్దండ పండితులే ఆయన వాదంలోని సబబు గుర్తించారు. బలపరచారు.
  • కుండలాల, శాలువాల పండితుల సాహిత్యాధికారం, అదన్నీ అసంబద్ధమైన వ్యాకరణ, ఛందశ్శాస్త్ర దండనాధికారం చెల్లదన్నాడు.
  • సాహిత్య ప్యూడల్ సంప్రదాయాన్ని ధిక్కరించి, నిరాకరించి నిర్మూలించి ప్రజాస్వామ్య పద్ధతిని తెలుగు సాహిత్యంలో ప్రతిష్ఠించాడు.
  • రచయిత ఏదైనా రాసినప్పుడు, లోకాన్ని ఉద్దేశించినప్పుడు అది అంటే ఆ పదం ఇదివరలోనే వినిమయంలో ఉన్నప్పుడుదా? తప్పు ఒప్పులు నిర్ణయించే అధికారం ఎవరికీ లేదన్నాడాయన.
  • భాషకైనా, మనిషికైనా మార్పు కూర్పు చేర్పు సహజమని బోధించాడు, నచ్చచెప్పాడు.

వ్యావహారిక భాషోద్యమం

తెలుగు భాషలో వచ్చిన చారిత్రాత్మకమైన మార్పుకు ప్రధాన కారణం గిడుగు రామమూర్తి గారి సారధ్యంలో నడిచిన వ్యావహారిక భాష ఉద్యమం లేదా వ్యావహారిక భాషోద్యమం. ఇది 20వ శతాబ్దపు పూర్వార్ధంలో ప్రాచీనమైన గ్రాంథిక భాషకు మరియు వ్యావహారిక లేదా వాడుక భాషకు మధ్య జరిగిన భాషా ఉద్యమం.

పూర్వం తెలుగులో పాఠ్యాంశాలు అన్నీ గ్రాంధిక బాషలోనే ఉండేవి. 1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు పాఠశాలాల ఇన్స్పెక్టర్‌గా  వచ్చిన జె.ఎ.యేట్స్ (J. A. Yates) అనే  బ్రిటీష్ అదికారి ప్రజలు వ్యవహరించే భాష, పుస్తకాల భాష మధ్య ఉన్న  తేడాలు చూసి ఆవేధన చెందారు. ఆయన అదే విషయాన్ని గిడుగు వారితో చర్చించారు. ఆ విధంగా గిడుగు జీవిత ఉత్తరార్థంలో ఈ విషయాన్ని గురించి గాఢంగా ఆలోచించి తెలుగు విద్యావిధానంలో అన్యాయం జరుగుతున్నదని గుర్తించాడు. గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సు — ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది.

1919-20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు ‘తెలుగు’ అనే మాసపత్రిక నడిపాడు. వ్యవహారిక భాషను ప్రతిఘటించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో (1925, తణుకులో) నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేసాడు “గిడుగు”. సాహితీ సమితి, నవ్యసాహిత్య పరిషత్తు మొదలైన సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి.

స్కూలు కాలేజీ పుస్తకాల్లో గ్రాంథికభాషే పాతుకుపోయింది; కొన్నిటిలో వీరేశలింగంగారు ప్రతిపాదించిన సరళ గ్రాంథికం కూడా వచ్చింది. గిడుగు రామమూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించాడు.

1919లో గిడుగు “తెలుగు” అనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు. కాని ఆ పత్రిక ఒక ఏడాది మాత్రమే నడిచింది. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి, కందుకూరి వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైన కవులు, పండితులు వ్యావహారిక భాషావాదం వైపు మొగ్గు చూపారు. 1919 ఫిబ్రవరి 28న రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షులుగా, గిడుగు కార్యదర్శిగా “వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం” స్థాపించారు.

1924లో కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఆధికారికంగా వ్యావహారిక భాషా నిషేధాన్ని ఎత్తివేసింది.

1933లో గిడుగు రామమూర్తి సప్తతి మహోత్సవం ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేంద్రవరంలో బ్రహ్మాండంగా జరిపారు. తెలికచెర్ల వెంకటరత్నం సంపాదకుడుగా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 46 పరిశోధక వ్యాసాలతో “Miscellany of Essays” (వ్యాస సంగ్రహం) అనే ఉద్గ్రంథాన్ని ఆయనకు సమర్పించారు.

1936లో నవ్యసాహిత్య పరిషత్తు అనే సంస్థను ఆధునికులు స్థాపించి సృజనాత్మక రచనల్లో శిష్టవ్యావహారికాన్ని ప్రోత్సహించే “ప్రతిభ” అనే సాహిత్యపత్రికను ప్రచురించారు.

1937లో తాపీ ధర్మారావు సంపాదకులుగా “జనవాణి” అనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణ భాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలుపెట్టింది.

గ్రాంథిక భాషావాదుల అభిప్రాయాలు

  • అనాగరిక భాష వంటి వాడుక భాష ఉత్తమమైన సాహిత్య రచనకి పనికిరాదు.
  • వాడుక భాష మాట్లాడడం వరకే పరిమితం అది గ్రామ్యభాష.
  • వాడుక భాష ఒక లక్షణం గానీ, వ్యవస్థ గానీ లేనిది.
  • వ్యావహారిక భాషావ్యాప్తి వలన ప్రాచీనమైన కావ్యాలకు, వ్యాకరణాలకు నష్టం కలుగుతుంది. మన సాహిత్య సంపద అనాథ అవుతుంది.
  • వాడుక భాషలో అనేక భేదాలున్నాయి. మాండలికాలు ఉన్నాయి. ఒక మాండలిక భాష వేరొక ప్రాంతం వారికి అర్థం కాదు. పాఠ్యగ్రంథాలు, సాహిత్యం ఏ మాండలికంలో రాయాలి ? ఇవరికి ఇష్టమైన భాషలో వారు రాసుకుంటే తెలుగు భాషా సమైక్యతకి ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి తెలుగు భాషను పరిరక్షించడానికి గ్రాంథిక భాషే మంచిది.
  • నన్నయ నుండి నేటి వరకు గ్రాంథిక భాష మారలేదు. దానికి ఏకరూపత, ప్రామాణికత ఉన్నాయి.
  • వ్యాకరణ బద్ధం కాని ప్రామాణికత లేని వాడుక భాషలో సార్వకాలిక సాహిత్యరచన వీలుకాదు.
  • శాస్త్ర గ్రంథాలను అవసరమైతే సరళ గ్రాంథికంలో రచించవచ్చును.

వ్యావహారిక భాషావాదుల అభిప్రాయాలు

  • వాడుక భాష గ్రామ్యభాష కాదు. సజీవ భాష.
  • వ్యావహారిక భాషకు లక్షణాలు, వ్యాకరణం లేవన్నారు. గ్రాంథిక భాషకి కూడా పూర్తిగా వ్యాకరణాలు లేదు.
  • తెలుగు భాష మారుతోంది. కాబట్టి కొత వ్యాకరణాలు, సవరణలు వెలువడ్డాయి. నన్నయ భాషకి, తిక్కన భాషకి, ప్రబంధ బాషకి, దక్షిణాంధ్ర యుగం నాటి భాషకి చాలా భేదాలున్నాయి.
  • వ్యావహారిక భాషావాదం ప్రాచీన సాహిత్యానికి వ్యతిరేకంగా ఏర్పడలేదు. ప్రాచీన కావ్యాలను, వ్యాకరణాలను గౌరవిస్తూనే వాడుక భాషకి ప్రాచుర్యం కల్పించాలి.
  • వాడుక భాషలో కూడా ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించవచ్చును. ఉదాహరణ: గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం.
  • గ్రాంథికభాష పండితులకే అర్థం కాదు. గొప్ప పండితులు కూడా తప్పులు లేకుండా రాయలేరు. మరి ఇతరులు ఎలా రాయగలరు.
  • వాడుక భాషలో భేదాలున్నాయి. అయితే అందరూ కలిసి కోస్తా మాండాలికాన్నే వాడుతున్నారు. కాబట్టి కోస్తా మాండలిక ఆంధ్రమే అనుసంధాన భాషగా ఉంటుంది.
  • మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో విజ్ఞానం పెంపొందించుకోవాలంటే పాఠ్యగ్రంథాలు వాడుక భాషలోనే ఉండాలి.
  • వాడుక భాష ప్రజల భాష. గ్రాంథిక భాష పండితుల భాష.

సవర భాష పాండిత్యం

నాగరికతకు దూరంగా కొండల్లో జీవిస్తున్న ఆదిమ ప్రవర్తులైన సవరుల కోసం జీవితాన్ని త్యాగం చేశారు. తమ కాలాన్ని, ధనాన్ని వినియోగించారు.

ఆరోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు. ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవరభాషలో పుస్తకాలు రాసి సొంతడబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913లో “రావ్‌ బహదూర్‌” బిరుదు ఇచ్చారు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకొన్నారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించారు.

మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవరభాషా వ్యాకరణాన్ని 1931లోను, సవర-ఇంగ్లీషు కోశాన్ని 1938లోను అచ్చువేశారు. 1934లో ప్రభుత్వం అతనికి ‘కైజర్-ఇ-హింద్ ‘ అనే స్వర్ణ పతకాన్నిచ్చి గౌరవించింది.

“సవర” దక్షిణ ముండా భాష. మనదేశంలో మొట్టమొదట ముండా ఉపకుటుంబ భాషను శాస్త్రీయంగా పరిశీలించినవాడు గిడుగు రామమూర్తి. ఆస్ట్రో-ఏషియాటిక్‌ భాషా కుటుంబంలో ఒక శాఖ ముండాభాషలు. ఆర్యభాషా వ్యవహర్తలు మన దేశానికి రాకముందు (క్రీ.పూ. 15వ శతాబ్ది) నుంచి వీళ్ళు మనదేశంలో స్థిరపడ్డారు. వీరిని “శబరు”లనే ఆదిమజాతిగా ఐతరేయ బ్రాహ్మణం (క్రీ.పూ. 7వ శతాబ్ది) లో పేర్కొన్నారు.

శాసనాల అధ్యయనం

హైస్కూల్లో చరిత్రపాఠం చెప్పేరోజుల్లోనే దగ్గరలో ఉన్న ముఖలింగ దేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని చదివాడు. విషయపరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో చారిత్రకాంశాలు, ముఖ్యంగా గాంగవంశీయులను గురించి రామమూర్తి ఇంగ్లీషులో ప్రామాణికవ్యాసాలు రాసి Indian Antiquary లోనూ Madras Literature and Science Society Journal లోనూ ప్రచురించాడు. 1911లో గిడుగు 30 ఏళ్ళ సర్వీసు పూర్తికాగానే అధ్యాపకపదవి నుంచి స్వచ్ఛందంగా రిటైరయ్యాడు. అంతకుముందు కొద్ది సంవత్సరాల ముందే ఆధునికాంధ్రభాషాసంస్కరణ వైపు అతని దృష్టి మళ్ళింది.

తుదివిన్నపం

గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికాసంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుదివిన్నపంలో వ్యావహారిక భాషా వ్యాప్తికి చాలా సంతృప్తి పొందాడు. కాని, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటానికి బాధపడ్డాడు. ఆ విన్నపంలోని చివరిమాటలు -

“దేశభాష ద్వారా విద్య బోధిస్తే కాని ప్రయోజనం లేదు. శిష్టజనవ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రాంథికభాష గ్రంథాలలో కనబడేదే కాని వినబడేది కాదు. ప్రతిమ వంటిది. ప్రసంగాలలో గ్రాంథికభాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి. గ్రాంథికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరున్ను వ్రాయలేరు. వ్రాసినా వ్రాసేవారికి కష్టమే వినేవారికి కష్టమే. వ్రాసేవాండ్లేమి చేస్తున్నారు? భావం తమ సొంత (వాడుక) భాషలో రచించుకొని గ్రాంథికీకరణం చేస్తున్నారు. అది చదివేవాండ్లు వినేవాండ్లు తమ సొంత వాడుకమాటలలోకి మార్చుకొని అర్థం చేసుకొంటున్నారు.

ఎందుకీ వృథాప్రయాస? స్వరాజ్యం కావలెనంటున్నాము. ప్రత్యేకాంధ్రరాష్ట్రము కోసం చిక్కుపడుతున్నాము. ప్రజాస్వామిక పరిపాలనం కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో మన ప్రజలకు, సామాన్య జనులకు ఏభాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి. మీచేతులలో పత్రికలున్నవి. పత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరు”.

 

గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినమైన ఆగస్టు 29 ను  ‘తెలుగు భాషా దినోత్సవము’గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తున్నది. గిడుగు గారు తెలుగు వ్యావహారిక బాషకు పితామహుడిగా పరిగణించబడతారు. గిడుగు రామమూర్తి గారికి అభినవ వాగమశాసనుడు అని బిరుదు. తెలుగుబాషకు  ఎనలేని సేవ చేసిన గిడుగు గారు 1940, జనవరి 22న  కన్ను మూశారు