తెలుగు బాష ప్రాముఖ్యత (తృతీయ బహుమతి పొందిన వ్యాసం)

తెలుగు బాష ప్రాముఖ్యత 

 “దేశ  భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు వారు అన్న మాటకు అర్థం మన దేశంలో ఎన్నిభాషలున్నా సరే ఏ భాష కూడా తెలుగుతో పోటీ పడలేదు అని. తెలుగు భాషలోని మాధుర్యం అంతా ఇంతా కాదు. ఉగ్గు పాల నుండి ఒక బిడ్డకి తల్లి పాట పాడేందుకు వీలైన భాష.తెలుగు భాషలోని స్పష్టత, నేర్పు, భావం, కూర్పు చాలా అందంగా ఉంటాయి. ఎందరో మహనీయులు, కవులు, కవయిత్రులు మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గురించి చాటిచెప్పారు.

 

అందులో ప్రప్రధమంగా  నన్నయ, తిక్కన, యెఱ్ఱాప్రగడలు మహాభారతం వంటి గొప్పకావ్యాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి, సామాన్య మనవుడికి అర్థమయ్యే విధంగా, చక్కగా అనువదించారు.ఆ కవిత్రయానికి జోహార్లు. వీరేకాక, గురజాడ అప్పారావు, వీరేశలింగం పంతులు, శ్రీశ్రీ, సి.నా.రె మొదలైన కవుల వరకు అందరూ ఎన్నో గొప్ప తెలుగు కావ్యాలు, కథలు రచించారు.

తెలుగులో కవిత్వం మన ఆది కవి “నన్నయ” గారి మహాభారతం నుండి అంటే 11వ శతాబ్దం నుండి మొదలైంది  అనుకోవడంలో ఎటువంటి  సందేహమూ లేదు. తెలుగు భాష తేనె వలె మధురంగా ఉంటుంది. “సంస్కృతంలోని చక్కెర పాకం, అరవభాష లోని అమృతరాశి, కన్నడ భాష లోని తేట,ఇవన్నీ తెలుగు నందు కలవు” అని శ్రీకృష్ణదేవరాయల వారు తెలిపారు. తెలుగు భాష ద్రావిడ భాష నుండి వచ్చింది. ద్రావిడ భాషలు మొత్తం 21 అని ఒకానొక సందర్భంలో తెలిసింది. అందులో మన తెలుగు కూడా ఒకటి. తెలుగు లిపి కన్నడ లిపితో పోలియుండును. మనదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష మాట్లాడతారు.

500-600 సంవత్సరాల క్రితం శాతహవాహనుల పరిపాలన కాలంలో “ప్రకృత్” అనే భాష మన ఆంధ్రప్రదేశ్ లో వాడటం జరిగింది. కానీ ఆ ప్రకృత్ భాషలోని తద్బావాలను కలిపి తెలుగుగా మార్చడం జరిగింది. ప్రకృత్  భాష కనుమరుగైంది,కానీ మన తెలుగు మాత్రం తేనెలా ఊరిస్తూనే ఉంది. మన తెలుగు భాషకి “తెనుగు భాష”, ఆంధ్రభాష  అను పర్యాయ పదాలు కలవు. తెలుగు భాషలోని అక్షరాలు 56 ఉండేవి. 18 అచ్చులు మరియు 38 హల్లులు ఉండేవి. కానీ, ఇప్పటి పాఠ్యప్రణాళిక ప్రకారం 16 అచ్చులు,36 హల్లులు గా మారిపోయినవి.

తెలుగు భాష సంస్కృతం నుండి తీసుకొన బడింది. కానీ, లిపి వరకు వస్తే సంస్కృత భాష “దేవనాగిరి”లిపి లో ఉండును. తెలుగు బ్రహ్మ లిపిలో ఉండును. విజయనగర సామ్రాజ్య పరిపాలన నుండి తెలుగు యొక్క ప్రాదాన్యతపెరిగెను. రాయలవారి పాలనలో అష్టదిగ్గజాలు ఉండేవారు. వారందరూ తెలుగు భాషలో పండితోత్తములు.

తెలుగు వ్యాకరణ  దిశగా చూసినా, పలికే విధానం దిశగా చూసిన ,ఎటు చూసిన తెలుగు భాష కి తెలుగే సాటి,వేరేదిలేదు దీనికి పోటీ. ఒక్క తెలుగు  భాషలో మాత్రమే “అష్టావదానం”, “శతావదనం”  “సహస్రావదనం” “సమస్యాపూర్ణం” అనే అంశాలు ఉండును. వేరే ఏ  భాషకు కూడా ఈ విధమైనా సౌకర్యం వీలుపడదు.తెలుగు భాష  గురించి ఎంత చెప్పినా, వ్రాసినా, చదివినా, విన్నా తనవి తీరదు. అంతటి మధురమైనది మన తెలుగు భాష. దక్షిణ భారతదేశం మరియూ ఇతర (తెలుగువారు) ప్రదేశాల్లోతెలుగు వారు, తెలుగుమాట్లాడేవారి సంఖ్య 66 మిలియన్లు అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. ఇంకా ఎంత చెప్పినా తెలుగు భాషయొక్క ప్రాముఖ్యత ముందు దిగదుడుపే.

ఇలాంటి  తెలుగు భాషని మనలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు.కొందరు తెలుగు మాట్లాడడానికే అసహ్యించుకుంటున్నారు. మరికొందరు తెలుగు మాట్లాడేవారిని దగ్గరకు కూడా రానివ్వరు. ప్రాశ్చ్యత్య దేశ భాషల, ఇతర భాషల యొక్క ప్రాముఖ్యతను పెంచుతున్నారే తప్ప తెలగుభాష కనీస గౌరవం కూడా ఇవ్వరు. తెలుగు వారమంతా ఎంతో వీలుగా, సౌకర్యంగా  ఉండే తెలుగుని మాట్లాడటమే మానేసారు.

ఇకపోతే ఇప్పటి కాలం పిల్లలు, వారి సంగతి అసలు చెప్పనే వద్దు, తెలుగు పదాలే మర్చిపోతున్నారు. తెలుగు భాష యొక్క గొప్పతనం, తెలుగు జాతి తీయదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అని ఒక కవి చాలా గొప్పగా చెప్పారు. పిల్లలు తెలుగులో మాట్లాడకుండా ఉండటానికి చాలా కారణాలు ఉండవచ్చు, వారు పెరుగుతున్న వాతావరణం, తల్లిదండ్రులు, పాఠశాలలు, స్నేహితులు మొదలైనవి. మొదటి పదమైన “అమ్మ” అనే పదానికి బదులు మమ్మీ, మామ్ అని అక్కడ నుంచి ప్రతి పదం, ప్రతీ సందర్బం,ప్రతీచోట కూడా పిల్లలు తెలుగుకి బదులుగా ఇతర భాషలపై మోజూ చూపుతారు. పిల్లలే కాదు, పెద్దవారు కూడా తెలుగులో మాట్లాడితే అదేదో తప్పని లేదా చుట్టు ప్రక్కలవాళ్లు మనకు నాగరికత అనేది తెలీయదని అనుకుంటారని వారు కూడా ఇతర భాషలలొ మాటాడటం మొదలు పెడతారు. ఇది చూసిన పిల్లలు ఇదే పద్దతిని పాటిస్తారు, కానీ అది తప్పు.ఎవరి మాతృభాష లో వారు మాట్లాడటం వారి హక్కు.అలా అని అభివృద్ది చెందకూడదని కాదు.(నాగరికత విషయంలో).పరభాషా జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో తప్పు లేదు.కానీ సంబోధనా సమయంలోనైనా మన భాషని మనం మరచిపోరాదు.

ప్రాశ్చ్యత్య దేశాలు సైతం మన  భాషను, మన భాషలోని కమ్మదనాన్ని మెచ్చుకొని ఆదరిస్తున్నపుడు మనం మన తెలుగు భాషని అగౌర్వించడం బావ్యం కాదు. దయచేసి తెలుగువారందరము తెలుగులోనే మాట్లాడుదాము. పాఠశాలలో కూడా తెలుగు భాషను /తెలుగు భాషలోని గొప్పదనాన్ని పాఠ్యాంశాల రూపంలో ప్రచురించినచో విద్యార్ధిని, విద్యార్థులకు బాల్యములోనే తెలుగు భాషయొక్క ప్రాముఖ్యతను గురించి అవగాహన ఏర్పడును.

కె. ఐశ్వర్య,
6వ తరగతి, సాధు వశ్వని ఇంటర్నేషనల్ స్కూల్,
కొంపల్లి, జయభేరి పార్క్, హైదరాబాద్