తెలుగు బాష ప్రాముఖ్యత (ప్రథమ బహుమతి పొందిన వ్యాసం)

తెలుగుభాష యొక్క ప్రాముఖ్యత

ఉపోద్గాతము :  “చక్కని పలుకుబడులకు, నుడికారములకు తెలుగు బాషయే పుట్టినిల్లు ”. చక్కని కవితలల్లిక లో జిగిబిగిని ప్రదర్శించిన నేర్పు ఈ బాషలోనే వీలైనది. అంతేగాక, అనేక బాషలు ఈ బాషలో చోటు చేసుకున్నాయి. ఎప్పుడైనా ఒక బాష  గొప్పతనం అన్ని బాషలూ నేర్చినగానీ తెలియదు. సంస్కృతము, తమిళము, పారసి మున్నగు బాషలు తెలిసిన రాయలు దేశబాషలందు  తెలుగులెస్స అనుట ఆశ్చర్యం గాదు. బ్రౌనుదొర కూడాఈ బాషను గూర్చి వేనోళ్ల పొగుడుట మన తెలుగు వారి, తెలుగు బాష యెక్క గౌరవము.

దేశ బాషలందు తెలుగు లెస్స: మన తెలుగు బాష దేశ బాషలలో గొప్పది. దేశబాషలందు తెలుగులెస్స, అని శ్రీకృష్ణదేవరాయలు తన “ఆముక్తమాల్యద” లో ఆంధ్రమహావిష్ణువు చే చెప్పించాడు. ఈ మాట ప్రతి తెలుగు వారి గుండెలలో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రాయల పైమాట తెలుగు వారి యెక్క మాతృబాషాభిమానానికి మేలుకొలుపు పాట అయ్యింది. బహుబాషా కోవిదుడైన రాయలు, ఆ బాష లోతుపాతులనెరిగి, మధించి భువన విజయ వికమాదిత్య న్యాయాధిపతిగా చెప్పిన తీర్పు దేశబాషలందు  తెలుగులెస్స అన్న మాట.

తెలుగు  బాష మాధుర్యం:   తెలుగు బాష మాధుర్యానికి కారణాలను పరిశేలిద్దాం. తెలుగు ద్రావిడ బాషలలో నుండి పుట్టింది. సహజముగా ద్రావిడ లక్షణములను బట్టి సరళము, సుకుమారము అయిన తెలుగువాణి, సంస్కృత బాషా కైకర్యం, గాంభీర్య పటుత్వాలను అలవరుచుకొని, తల్లికి, అక్కా చెల్లెండ్రకూ లేని క్రొత్త అందాలను అలవరుచుకుంది.

తెలుగు బాష సస్యశ్యామలమైనది: తెలుగు గడ్డ కవితా సస్యశ్యామలమైనది. సహృదయ సామ్రాట్ అయిన శ్రీకృష్ణదేవరాయలు ఏ బాష వాడైనా, తెలుగు బాషకే కావితాకర్పూర నీరాజనం అందించాడు.

“తరిపి వెన్నెల! ఆణిముత్యాల జిలుగు
పునుగు జివ్వాజీ! ఆమని పూల వలపు
మురళి రవాళులు! కస్తూరి పరిమళములు
కలిసి ఏర్పడే సుమ్ము మా తెలుగు బాష” అని నండూరి వారు అన్నారు.

తెలుగు బాష  కోటి కిటికీల గాలి మేడ:  తెలుగు బాష   కొల్లలుగా క్రొత్త పదాలను తనలో కలుపుతుంది.తెలుగు బాష  కోటి కిటికీల గాలి మేడ. అన్నీ వైపుల నుండి వీచే గాలులను ఆహ్వానించి, ఆతిధ్యమిచ్చి గౌరవించింది. తెలుగుకి గల హృదయ వైశాల్యము అనన్యము. తెలుగు,సంస్కృత పదాలు క్షీరనీర న్యాయంలో కలిసిపోతాయి. అదే తెలుగు బాష విశిష్టత.

మన తెలుగు కవులు: నన్నయ, తిక్కన, ఎఱ్ఱన తెలుగు పాండిత్యము తో మెప్పించిన ఉద్ధండ కవులు. మన తెలుగు కవులు అపార ప్రజ్ఞాధురీణులు. సంస్కృతాంధ్ర పదములు ప్రయోగించటం లో నేర్పరులు. పోతన సంస్కృతాంధ్ర పధములు ఇష్టమైన ఇద్దరినీ మెప్పిస్తానన్నాడు. పెద్దన మనుచరిత్ర లో ఇంతలు కన్నులుండ అని వ్రాసిన పధ్యము లోని తేట తెనుగు నుడికారపు సొంపులు, వంపులు, తామర తంపరలు, అల్లసాని వారి ఆ అల్లికజిగిబిగి లో తెలుగు పదములు, సంస్కృత శబ్ధములు పడుగుపెకల వలె అల్లుకుంటాయి. మన తెలుగు కవులంతా ఈ విధ్యలో నేర్పరులే. తెలుగు కవులకు జరిగిన సత్కార గౌరవములు ప్రపంచములో ఏ దేశంలో ఏ కవులకూ జరగలేదు.

తెలుగువారి సహృదయత, సాహితీ రసికత, నిరుపమానములు. తెలుగు బాష వాజ్మయము లో ప్రాతఃస్మరణీయులు కవిత్రయము, నన్నయ్య ను రాజరాజు ఆదరించాడు. తిక్కన ను మనుసిద్ది, ఎఱ్ఱప్రెగడను వేమారెడ్డి గౌరవించారు. శ్రీనాథుడు రెడ్డి రాజుల కవిగా మహాభోగాలు అనుభవించాడు. ఆయనకు ప్రౌఢధేవరాయులు కనకాభిషేకం చేశాడు. పోతన మహాకవికి తమ హృదయంలోనే దేవాలయాలు కట్టి తెలుగువారు నేటికీ ఆరాదిస్తారు. సాహితీ బొజుడైన కృష్ణదేవరాయులు కవులను పూజించిన విషయము జగత్ ప్రసిద్దము. పెద్దన కవికి రాయులు గండపెండేరము తొడిగి గౌరవించాడు.

Telugu is the Italian of the East: తెలుగు బాష సంగీతానికి అనువైన అజంత బాష. తెలుగు ఆజన్మ సంగీత కవచకుండలాలతో భాసించింది. సంగీత కళారాధనలో మన తెలుగు వారికి కలసి వచ్చిన గొప్ప అదృష్టం మన మాతృ బాష తెలుగు. తెలుగు బాషలో వచనానికి కూడా సంగీత సాహచర్యం ఉంది. తెలుగు పాటలో, పధ్యములో సంగీత సాహిత్యాలు గంగాయమున వలే సంగమించి ఉంటాయని సహృధయులందరికీ విదితమే. పధ్య కవిత్వంతో పాటు తెలుగు బాషలో వెలసిన పాటలు, స్త్రీల పాటలు, గేయాలు, కీర్తనలు, మరి ఏ ఇతర బాషల్లోనూ లేవు. రామధాసు కీర్తనలు తెలుగు దేశమంతా వ్యాపించాయి. తాళ్ళపాక అన్నమాచార్యులు ముప్పై రెండు వేల కీర్తనలు రచించాడు. తెలుగు వారి కళాభినివేశమునకు, మూర్తీభవించిన పారాకాష్ట త్యాగరాజు.

మాతృబాషలో విధ్యాబోధన:  గాంధీజీ 1938 లో తన హరిజన పత్రికలో బాలబాలికలకు ఆంగ్లము ద్వారా విధ్యాబోధన చెయ్యడాన్ని తప్పు పట్టారు. నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి, మాతృబాష వల్లనే వస్తుందని, స్వబాషలో విధ్య ఉంటే, మనకు స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదని ‘గాంధీజీ’ వ్రాశారు. మాతృబాషలో విధ్యాబోధన వల్ల మనసులు చురుకుగా పనిచేస్తాయని, రవీంధ్రుడు అన్నాడు.

మాతృబాషలో  విధ్యాబోధన వల్ల గ్రహణ సామర్ధ్యం పెరుగుతుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. “మాతృబాషలో విధ్యాబోధన వల్ల విధార్ధులలో సృజనాత్మకత పెరుగుతుంది”.

మాతృబాష తల్లి పాల వంటిది. పరబాష పోతపాల వంటిది.అని కొమర్రాజు లక్ష్మణరావు గారు అన్న మాట సత్యము.

అధికార బాషగా తెలుగు: తెలుగును పరిపాలనా బాషగా చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. చివరకు 1966 లో తెలుగును అధికారాబాష గా ప్రవేశపెట్టిన బిల్లు చట్టం అయింది. ప్రబుత్వ శాఖలు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు నడపాలని 1966 డిసెంబర్ లో ఉత్తర్వులు వచ్చాయి. పరిపాలనా బాషగా తెలుగు స్వరూపం ఎలా ఉండాలో నిర్ణయించటానికి పింగళి లక్ష్మీకాంతం, జి.ఆర్.పి గ్విన్ ల అధ్యక్షతన సంఘాలు ఏర్పడ్డాయి. ప్రబుత్వంలో ఒక శాఖగా 1974 మార్చి 19 న “అధికార బాష సంఘం” ఏర్పడింది.

తెలుగు భోదనా భాషగా అమలుకు సూచనలు:  ప్రజాస్వామ్య యుగంలో ప్రజల బాషలో పరిపాలన సాగించాలి. పాలకుల బాష ఒకటి, పాలితుల బాష మరొకటి అయితే, పరిపాలన అడవిని కాచిన వెన్నెల అవుతుంది. ప్రజలకి తమ బాషలో సమస్యలని చెప్పుకొనే హక్కు ఉండాలి. అధికారులు తెలుగులో వివరించే బాధ్యతని కలిగి ఉండాలి. మాతృబాషలో విధ్యార్జన సులభం. ఇది గమన సామర్ధ్యాన్ని, జ్ఞానాన్ని వేగవంతం చేస్తుంది, సృజనాత్మకతకు తోడ్పడుతుంది. అయితే తెలుగు బాషను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ది చెయ్యాలి.

 • తెలుగులో పాఠ్యగ్రంథాలను ప్రచురిస్తూ, వాటిని మధ్యమధ్యన పరిష్కరిస్తూ ఉండాలి
 • సమగ్రమైన పారిభాషిక పద కోశాల్ని తయారుచేయించాలి.
 • వైజ్ఞానిక, సామాజిక విషయాలపై గ్రంథాలను విరివిరిగా అనువాదం చేయించాలి.
 • ప్రభుత్వము, తెలుగు అకాడమీ, విశ్వవిధ్యాలయాలు వంటి ద్వారా అన్ని స్థాయిలలో, తెలుగు బోధనా బాషగా అమలు చేసేంధుకు వీలుగా గ్రంథాలు రాయించాలి.
 • ప్రజల్లో చైతన్యం వచ్చి, ధీక్షతో, పట్టుదలతో తెలుగును బోధనా బాషగా అమలు చేయటంలో సహకరించాలి.
 • తెలుగును బోధనా బాషగా చదివిన వారికి సాధుపాయాలు కల్పించాలి.
 • తెలుగులో ఐ‌ఏ‌ఎస్, ఐ‌పి‌ఎస్ వంటి ఉన్నత పరీక్షలు వ్రాసే పద్దతిని అమలు చెయ్యాలి.
 • ప్రబుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులు పూర్తిగా తెలుగులోనే ఉండాలి.
 • టైప్ రైటింగ్, షార్ట్ హాండ్, కంప్యూటర్ లలో తెలుగుకి ప్రాధాన్యం కల్పించాలి.

 సమాప్తి:

 • తెలుగు బాష పట్ల మమకారం అంకిత భావం ఉండాలి.
 • ప్రజల వద్దకు పాలన అన్నది తెలుగు బాషను పరిపాలనా బాషగా పూర్తిగా అమలు పరిచినప్పుడే సాధ్యమవుతుంది.
 • అభిమానం మాటలకే పరిమితమైతే దేశ బాషలందు తెలుగు లెస్స్”  అనే పరిహాసానికి గురికాక తప్పదు. కాబట్టి ప్రభుత్వం తెలుగు పట్ల శ్రద్ద వహించాలి.
 • అధికారులు, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి. అప్పుడే తెలుగు వెలుగు నాలుదిక్కులా వ్యాపిస్తుంది.
 • ఈ విధంగా తెలుగును భోధనా బాషగా ప్రవేశపెట్టి, మన విధ్యార్థుల సర్వతోముఖ వికాసానికి ఫ్రబుత్వము, ప్రజలు కృషి చేయాలి.

 కూన రసజ్ఞ,
10వ తరగతి,
శ్రీ సరస్వతి జ్ఞాన మందిర్ ఉన్నత పాఠశాల,
బుధవార్ పేట్, నిర్మల్,
నిర్మల్ (మం), ఆధిలాబాద్ జిల్లా.