దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది. పారిశ్రామికాభివృద్దికి ప్రభుత్వంలో తెలుగు భాష వాడుక అధికం చేయడం, భూసంస్కరణల అమలు ఇలా ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలు ఆయన హయాంలో చేపట్టారు.
బాల్యము మరియు విద్యాభ్యాసము :
సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా, కల్లూరు మండలములో, కర్నూలు నుండి ఐదు కిలోమీటర్ల దూరములో ఉన్న పెద్దపాడు లో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించాడు. ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబములో చివరివాడు సంజీవయ్య. ఆయన కుటుంబానికి సొంత భూమి లేకపోవడము వలన నేత పనిచేసి, కూలి చేసి జీవనము సాగించేవారు. సంజీవయ్య పుట్టిన మూడు రోజులకు తండ్రి మునెయ్య చనిపోగా కుటుంబము మేనమామతో పాలకుర్తికి తరలివెళ్లినది. అక్కడ సంజీవయ్య పశువులను కాసేవాడు. మూడు సంవత్సరాల తరువాత తిరిగి పెద్దపాడు చేరుకున్నారు. సంజీవయ్య అన్న చిన్నయ్య కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించి సంజీవయ్యను బడికి పంపించాడు. పెద్దపాడులో 4వ తరగతి వరకు చదివి ఆ తరువాత కర్నూలులోని అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ పాఠశాలలో చేరాడు. 1935 లో కర్నూలు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో చేరి 1938 లో SSLC (ఎస్.ఎస్.ఎల్.సీ) జిల్లాలోనే ప్రధమునిగా ఉత్తీర్ణుడయ్యాడు.
ఉద్యోగాలు :
ఆ తరువాత చిన్నయ్య ఆర్ధిక సహాయముతో అనంతపురం ప్రభుత్వ సీడెడ్ జిల్లాల కళాశాల లో గణితము మరియు ఖగోళ శాస్త్రములు అధ్యయనము చేశాడు. 1942లో బీ.ఏ పూర్తి చేసిన తర్వాత జీవనోపాధి కొరకు అనేక చిన్నా చితక ఉద్యోగాలు చేశాడు. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధము వలన ఉద్యోగాలు దొరకడము చాలా కష్టముగా ఉన్నది. సంజీవయ్య కర్నూలు పట్టణ రేషనింగ్ ఆఫీసులో గుమస్తాగా 48.80 రూపాయల జీతముతో ఉద్యోగములో చేరాడు. 1944 లో కొంతకాలము మద్రాసు కేంద్ర ప్రజా పనుల శాఖ (CPWD) కార్యాలయములో సహాయకునిగా పనిచేశాడు. 1945 జనవరిలో కేంద్ర ప్రజాపనుల శాఖా తనిఖీ అధికారిగా బళ్లారిలో పనిచేశాడు. ఈ గజెటెడ్ హోదా కల ఉద్యోగము డిసెంబర్ 1945 లో రద్దయ్యేదాకా 11 నెలల పాటూ పనిచేశాడు. ఆ తరువాత కొంత సమయము మద్రాసులోని పచ్చయప్ప పాఠశాలలో అధ్యాపకునిగా పనిచేసాడు.
సంజీవయ్య 1946 లో అప్పటి బళ్లారి జిల్లా జడ్జి కే.ఆర్.కృష్ణయ్య చెట్టి ప్రోత్సాహముతో మద్రాసు లా కాలేజీలో 'ఎఫ్.ఎల్' (F.L) లో చేరాడు. అప్పట్లో కాలేజిలో స్కాలర్‌షిప్ప్లు ఇచ్చే పద్ధతి ఉండేది కాదు. అందువలన సంజీవయ్య మద్రాసు జార్జ్‌టౌన్ లోని ప్రోగ్రెస్సివ్ యూనియన్ హైస్కూల్ లో పార్ట్ టైం గణిత అధ్యాపకునిగా పనిచేశాడు. అక్కడ ఇచ్చే 90 రూపాయల జీతముతో హాస్టలు ఖర్చులు భరించేవాడు.
లా చదువుతున్నపుడు సంజీవయ్యకు రోమన్ న్యాయానికి సంభందించిన లాటిన్ పదాలు గుర్తుపెట్టుకోవడము కష్టమయ్యేది. లాలో ఆయనకు సహాధ్యాయి అయిన ప్రముఖ రచయిత రావిశాస్త్రి వాటిని తెలుగు పాటగా మలిచి పాడుకుంటే బాగా గుర్తుంటాయని సలహా ఇచ్చాడు. లా చదివే రోజుల్లో సంజీవయ్య చంద్రగుప్త అనే నాటకములో పాత్ర ధరించాడు. శివాజీ అనే ఇంకొక నాటకాన్ని తనే రచించి రంగస్థలము మీద ప్రదర్శించాడు. ఈయన గయోపాఖ్యానము గద్యముగా రచించాడు అయితే ఇందులో ఏ ఒక్కటి ప్రస్తుతము లభ్యము అవుటలేదు. లా పట్ట చేతపుచ్చుకొని సంజీవయ్య 1950 అక్టోబర్ లో మద్రాసు బార్ లో న్యాయవాదిగా నమోదు చేసుకొన్నాడు. ఈయన గణపతి వద్ద ఆ తరువాత జాస్తి సీతామహాలక్ష్మమ్మ వద్ద సహాయకునిగా పనిచేశాడు
రాజకీయ రంగప్రవేశము :
సంజీవయ్యకు విద్యార్ధిగా ఉన్న రోజుల్లో రాజకీయాలపై, స్వాతంత్ర్యోద్యమముపై ఏమాత్రము ఆసక్తి చూపలేదు. కానీ లా అప్రెంటిసు చేస్తున్న సమయములో వివిధ రాజకీయనాయకుల పరిచయము మరియు సాంగత్యము వలన రాజకీయాలలో ప్రవేశించాలనే ఆసక్తి కలిగినది.
1950 జనవరి 26న రాజ్యాంగము అమలులోకి రావడముతో అప్పటి దాకా రాజ్యాంగ రచన నిర్వహించిన భారత రాజ్యాంగ సభ ప్రొవిజనల్ పార్లమెంట్ గా అవతరించినది. అయితే ప్రొవిజనల్ పార్లమెంటులో, రాష్ట్రాల శాసనసభలలో రెండిట్లో సభ్యత్వము ఉన్న సభ్యులు ఏదొ ఒకే సభ్యత్వముని ఎన్నుకోవలసి వచ్చినది. షెడ్యూల్డ్ కులమునకు చెందిన ఎస్.నాగప్ప అలా తన శాసనసభ సభ్యత్వము అట్టిపెట్టుకొని ప్రొవిజనల్ పార్లమెంటుకు రాజీనామా చేయడముతో ఆ స్థానమును పూరించడానికి బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రేసు కమిటీ తరఫున సంజీవయ్యను ఎంపిక చేశాడు. ఎన్నికలు జరిగి తొలి విధానసభ ప్రమాణస్వీకారము చేయడముతో 1952 మే 13 న ప్రొవిజనల్ పార్లమెంటు రద్దయినది.
టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గములో ఆరోగ్యశాఖా మంత్రిగా ఉండగానే సికింద్రాబాదులో పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కృష్ణవేణి ని సంజీవయ్య 1954, మే 7 న పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంతానము లేదు. సుజాత అను ఒక బాలికను దత్తత తీసుకున్నారు.
1967లో ఎన్నికల ప్రచార సమయములో విజయవాడ నుండి హైదరాబాదుకు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా ఎన్నటికి కోలుకోలేకపోయాడు. 1972 మే 7 వ తేదీ రాత్రి 10:30 గంటల ప్రాంతములో ఢిల్లీలో గుండెపోటుతో మరణించాడు. ఆయన అంత్యక్రియలు మే 9వ తేదీన సికింద్రాబాదులోని పాటిగడ్డలో అధికార లాంఛనాలతో జరిగినవి. ఆయన స్మారకార్ధం పాటిగడ్డ సమీపమున ఒక ఉద్యానవనమును పెంచి ఆయన పేరుమీదుగా సంజీవయ్య పార్కు అని పేరు పెట్టారు.
నిర్వహించిన పదవులు :