Latest posts
-
కూరిమిగల దినములలో
కూరిమిగల దినములలో నేరము లెన్నఁడును గలుఁగ నేరవు మఱి యా కూరిమి విరసంబైనను నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ! తాత్పర్యము రస్పరం స్నేహం ఉన్న రోజుల్లో నేరాలు ఎప్పుడూ కనిపించవు. ఆ స్నేహం చెడగానే అన్ని తప్పులుగానే కనిపిస్తాయి. ఇది నిజం.
-
కులకాంత తోడ నెప్పుడుఁ
కులకాంత తోడ నెప్పుడుఁ గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ కలకంఠి కంట కన్నీ రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ! తాత్పర్యము భార్యతో ఎప్పుడూ తగాదా పడవద్దు. ఆమెపై లేనిపోని నేరాలను ఆరోపించవద్దు. ఉత్తమ ఇల్లాలు కంట నీరు కింద పడిన ఇంటిలో లక్ష్మిదేవి ఉండదు.
-
చీమలు పెట్టిన పుట్టలు
చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్ హేమంబుఁ గూడఁబెట్టిన భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ! తాత్పర్యము చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైనట్లు అజ్ఞాని కూడబెట్టిన బంగారమంతా రాజుల వశమై పోతుంది.
-
గడనగల మననిఁజూచిన
గడనగల మననిఁజూచిన నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో గడ నుడుగు మగనిఁ జూచిన నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ! తాత్పర్యము స్త్రీలు సంపాదన ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు, పూజిస్తారు. సంపాదన లేని మగడిని చూస్తే నడిచే శవం వచ్చిందని హీనంగా మాట్లాడతారు.
-
కోమలి విశ్వాసంబును
కోమలి విశ్వాసంబును బాములతోఁ జెలిమి యన్యభామల వలపున్ వేముల తియ్యఁదనంబును భూమీశుల నమ్మికలుసు బొంకుర సుమతీ! తాత్పర్యము : స్త్రీల పట్ల విశ్వాసం, పాములతో స్నేహం, పరస్త్రీల ప్రేమ, వేప చెట్లలో తీయదనం, రాజుల పట్ల నమ్మకం అన్నీ అసత్యాలు.
-
కొరగాని కొడుకు పుట్టినఁ
కొరగాని కొడుకు పుట్టినఁ కొరగామియె కాదు తండ్రి గుణముల జెరచుం జెరకు తుద వెన్నుఁపుట్టిన జెరకునఁ దీపెల్ల జెరచు సిద్ధము సుమతీ! తాత్పర్యము చెరకుగెడ చివర వెన్ను పుడితే అది చెరకులోని తీయదనాన్ని ఏ విధంగా పాడు చేస్తుందో అలాగే అప్రయోజకుడైన కుమారుడు పుట్టడం వల్ల ఆ కుటుంబానికి ఉపయోగ పడకపోగా తండ్రికి ఉన్న మంచి పేరును కూడా చెడగొడతాడు.
-
చుట్టములు గానివారలు
చుట్టములు గానివారలు చుట్టములము నీకటంచు సొంపుదలర్పన్ నెట్టుకొని యాశ్రయింతురు గట్టిగఁ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ! తాత్పర్యము ధనం ఎక్కువగా ఉన్నట్లయితే బంధువులు కాని వారు కూడా మేము మీకు బంధువులమే అంటూ పట్టుదలతో గట్టిగా మనల్ని ఆశ్రయించడానికి వస్తారు.
-
చేతులకు దొడవు దానము
చేతులకు దొడవు దానము భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో నీతియ తొడ వెవ్వారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ! తాత్పర్యము చేతులకు దానం, పాలకులకు అసత్యం పలకకుండడం, అందరికీ న్యాయం, స్త్రీకి అభిమానం అలంకారాలు.
-
తడ వోర్వక యొడలోర్వక
తడ వోర్వక యొడలోర్వక కడువేగం బడచిపడినఁ గార్యంబగునే తడవోర్చిన నొడలోర్చినఁ జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ! తాత్పర్యము ఆలస్యాన్ని, శరీర శ్రమను సహించకుండా తొందరపడినా కార్యం కాదు. ఆలస్యాన్ని, శరీర శ్రమను ఓర్చుకొన్నప్పుడే చెడిపోయిన కార్యం కూడా నెరువేరుతుండును.
-
తన కోపమె తన శతృవు
తన కోపమె తన శతృవు తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ తన సంతోషమె స్వర్గము తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ! తాత్పర్యము తన కోపమే తనకు శతృవువలే బాధించును. తన శాంతమే తనను రక్షించును. దయయే చుట్టాలవలే సాయపడును. ఆనందమే ఇంద్రలోక సౌఖ్యము. దుఃఖమే నరకం అగును. ఇది నిజం.