సుమతీ శతకము

ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవుకడ నున్న వృషభము
జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ!

ఉపకారికి నుపకారము
విపరీతముగాదు సేయ వివరింపంగా
నుపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!

ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్పవసించిన విధంబు గదరా సుమతీ!

ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ జెరువునిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!

ఏరకుమీ కసుగాయలు
దోరకుమీ బంధుజనుల దోషముసుమ్మీ
పారకుమీ రణమందున
మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!

ఒకయూరికి నొక కరణము
నొక తీర్పరియైనఁ గాక వొగిఁదరుచైనం
గకవికలు గాక యుండునె
సకలంబును గొట్టువడక సహజము సుమతీ!

ఒల్లనిసతి నొల్లనిపతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
గొల్లండు గాక ధరలో
గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ!

ఓడల బండ్లును వచ్చును
ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చును
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ!

కడు బలవంతుడైనను
బుడమిని బ్రాయంపుటాలి బుట్టినయింటం
దడవుండనిచ్చె నేనియు
బడుపుగ నంగడికి దానె పంపుట సుమతీ!

  •  

కనకపు సింహాసనము
శునకముఁ గూర్చుండబెట్టి శుభలగ్నమునఁ
దొనరఁగ బట్టముగట్టిన
వెనకటి గుణమేల మాను వినరా సుమతీ!

Pages