సుమతీ శతకము

కూరిమిగల దినములలో
నేరము లెన్నఁడును గలుఁగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!

కొంచెపు నరుసంగతిచే
నంచితముగఁ గీడువచ్చు నదియెట్లన్నన్
గించిత్తు నల్లి కుట్టిన
మంచమునకుఁ జేటువచ్చు మహిలో సుమతీ!

కొరగాని కొడుకు పుట్టినఁ
కొరగామియె కాదు తండ్రి గుణముల జెరచుం
జెరకు తుద వెన్నుఁపుట్టిన
జెరకునఁ దీపెల్ల జెరచు సిద్ధము సుమతీ!

కోమలి విశ్వాసంబును
బాములతోఁ జెలిమి యన్యభామల వలపున్
వేముల తియ్యఁదనంబును
భూమీశుల నమ్మికలుసు బొంకుర సుమతీ!

గడనగల మననిఁజూచిన
నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో
గడ నుడుగు మగనిఁ జూచిన
నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్
హేమంబుఁ గూడఁబెట్టిన
భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ!

చుట్టములు గానివారలు
చుట్టములము నీకటంచు సొంపుదలర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగఁ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ!

చేతులకు దొడవు దానము
భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో
నీతియ తొడ వెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!

చేతులకు దొడవు దానము
భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో
నీతియ తొడ వెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!

తడ వోర్వక యొడలోర్వక
కడువేగం బడచిపడినఁ గార్యంబగునే
తడవోర్చిన నొడలోర్చినఁ
జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ!

Pages