సుమతీ శతకము

నడువకుమీ తెరువొక్కటఁ
గుడువకుమీ శతృనింటఁ గూరిమితోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యెరులమనసు నొవ్వగ సుమతీ!

నమ్మకు సుంకరి జూదరి
నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్
నమ్మకు మంగలివానిని
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ!

నవమున బాలుంద్రావరు
భయమునను విషమ్మునైన భక్షింతురుగా
నయమెంత దోసకారియె
భయమే చూపంగవలయు బాగుగ సుమతీ!

నవరస భావాలంకృత
కవితాగోష్ఠియును మధుర గానంబును
నవివేకి కెంతఁజెప్పినఁ
జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ!

నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!

నాది నొకని వలచియుండగ
మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్
బొది జిలుక పిల్లి పట్టిన
జదువునె యా పంజరమున జగతిని సుమతీ!

పగవల దెవ్వరితోడను
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్
దెగనాడవలదు సభలను
మగువకు మనసీయవలదు మహిలో సుమతీ!

పతికడకుఁ దన్నుగూర్చిన
సతికడకును వేల్పుకడకు సద్గురు కడకున్
సుతుకడకు రిత్తచేతుల
మతిమంతులు చనరు నీతిమార్గము సుమతీ!

పనిచేయునెడల దాసియు
ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్
దనభుక్తి యెడలఁ దల్లియు
ననఁ దన కులకాంత యుండనగురా సుమతీ!

పరనారీ సోదరుఁడై
పరధనముల కాసపడక పరులకు హితుడైఁ
పరుల దనుఁబొగడ నెగడక
పరుఁలలిగిన నలుగనతఁడు పరముడు సుమతీ!

Pages