ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

AndraPradeshనవంబర్ 1 వ తేదీ అంటే ఇవాళ ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినం. 1953 వ సంవత్సరం ఇదే రోజు పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. అంతకు ముందు ఇవి మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేసారు. అనంతరం 1956 నవంబర్ ఇదే రోజున నిజాం పాలనలో ఉన్న తెలంగాణా ప్రాంతాన్ని ఆంద్ర ప్రదేశ్ లో విలీనం చేసారు.
 

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం: మద్రాసు ప్రెసిడెన్సీ

మద్రాసు ప్రెసిడెన్సీలో 40 శాతం జనసంఖ్య, 58 శాతం రాష్ట్ర విస్తీర్ణం తెలుగు వారిదే. రాష్ట్ర రాజకీయాలలో తమకు పలుకుబడి లేదని, తమిళులచేత అవహేళనకు గురౌతున్నామన్న భావన తెలుగువారిలో మెదలైంది. 1911 ఏప్రిల్ నెలలో "హిందూ" పత్రికలో ఒక రచయిత "తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితి " అన్న విషయంపై వ్యాసాలు రాశారు. ఉద్యోగాలలో మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారికి జరుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో వివరించారు. తెలుగువారి వెనుకుబాటు తనాన్ని కూడా చర్చించారు. అప్పుడే "దేశాభిమాని" అనే పత్రిక (తెలుగు/ఇంగ్లీషు) తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి, సమైక్యతకు ఒక రాజకీయ సమ్మేళనం ఏర్పాటు కావాలని తన సంపాదకీయంలో పేర్కొంది. ఈ విధంగా ఆనాటి వార్తా పత్రికల వ్యాసాల ద్వారా, సంపాదకీయం ద్వారా తెలుగు ప్రజలలో ప్రత్యేక రాష్ట్ర వాంఛ మొదలైంది.

1911 చివరినాటికి ప్రత్యేక రాష్ట్ర చర్చ ఊపందుకుంది. ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రిక, ప్రత్యేక ఆంధ్ర స్టేట్ కోరికను బలపరిచాయి. తమిళులలో మాత్రం ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత వ్యక్తమైయ్యింది. "హిందూ" వార్తాపత్రిక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని వ్యతిరేకించింది. పట్టాభి సీతారామయ్య మాత్రం ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని సూచించారు.

Potti Sreeramuluపొట్టి శ్రీరాములు అక్టోబరు 19, 1952లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్‌తో మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 50రోజుల నిరహార దీక్ష తరువాత, మద్రాసును వదులుకొంటే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం సాధ్యపడుతుందని ప్రధాని నెహ్రూ ప్రకటించారు. పొట్టీ శ్రీరాములు అందుకు అంగీకరించకుండా తన నిరాహార దీక్షను కొనసాగించి డిసెంబర్ 15వ తేదీన ఆత్మార్పణ చేసుకొన్నారు. ఆయన ఆత్మార్పణ తరువాత ఆంధ్ర ప్రాంత జిల్లాల్లో పెద్దయెత్తున హింసా కాండ చెలరేగింది. మద్రాసు నగరాన్ని మినహాయించి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రధాని నెహ్రూ లోక్‌సభలో ప్రకటించారు. ఆర్థికపరమైన, పాలనా పరమైన విషయాలను దృష్టిలో ఉంచుకొని విభజన ప్రక్రియలో అవసరమైన సిఫారసులు చేయడానికి జస్టిస్ కైలాసనాథ్ వాంచూ ను ప్రత్యేకాధికారిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. వాంచూ నివేదిక ప్రకారంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును 1953 మార్చి 25న నెహ్రూ ప్రకటించారు.

తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకే రాష్ట్రంగా ఏర్పడాలనే అభిప్రాయాలు ఆంధ్రరాష్ట్ర ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి వినబడుతుండేది. 1938 లో ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య, సమైక్య తెలుగు రాష్ట్రం ఏర్పడే అవకాశాల గురించి మాట్లాడారు. 1940లో, 1942లో ఆంధ్ర నాయకులు సమైక్య తెలుగు రాష్ట్రం గురించి తమ ఆశాభావాలను వ్యక్తం చేశారు. హైదరాబాద్ సంస్థానం విమోచన తర్వాత సమైక్య తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు అవకాశాలు పెరిగాయి. 1949 లో అయ్యదేవర కాళేశ్వరరావు విశాలాంధ్ర మహాసభ ఏర్పాటు చేశారు. 1951 లో కూడా కాంగ్రెస్ అఖిల భారత సమావేశాలలో ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు విశాలాంధ్ర విషయాన్ని ప్రస్తావించారు.

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో రాయలసీమ శాసనసభ్యులు రాజధాని విషయంలో శ్రీబాగ్ ఒడంబడిక ను పాటించాలని కోరారు. ఆచార్య రంగా నాయకత్వంలోని కృషిక్ లోక్‌పార్టీ తిరుపతిని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా చేయాలని కోరారు. కమ్యూనిష్టులు విజయవాడను రాజధానిగా చేయాలని కోరారు. చివరకు కర్నూలును ఆంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధానిగా అందరూ ఒప్పుకున్నారు.