బండెనుక బండి కట్టి
పదహారు బండ్లు కట్టి
ఏ బండ్లె వస్తవ్ కొడుకో
నైజాము సర్కరోడా
నాజీల మించినవ్ రో
నైజాము సర్కరోడా
పోలీసు మిలిట్రి రెండు
బలవంతులనుకోని
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
మా పల్లెలు దోస్తివి కొడుకో
నైజాము సర్కరోడా
స్త్రీ పురుషులంత గలిసి
ఇల్లాలమంత గలిసి
వడిసేల రాళ్లు గట్టి
వడివడిగ గొట్టితేను
కారాపు నీళ్లు దెచ్చి
కండ్లళ్ల జల్లితేను
నీ మిలిట్రి బారిపొయెరో
నీ మిలిట్రి బారిపొయెరో…
నైజాము సర్కరోడా
సుట్టుముట్టూ సూర్యపేట,
నట్టనడుమ నల్లగొండ
నువ్వుండేది హైద్రబాదు
దాని పక్క గోలుకొండ
గోలుకొండా ఖిలా కిందా
గోలుకొండా ఖిలా కిందా
నీ గోరి కడుతం కొడుకో
నైజాము సర్కరోడా– బండి యాదగిరి
యాదగిరి పాడిన ఈ గేయం ఆనాడే కాదు ఈ నాటికీ సజీవముగానే నిలుస్తున్నది. ఈ గేయము వలన ప్రజలకు నిజాము మీద ఎంత కసి ఉందో అర్థము అవుతుంది. అంతేకాదు ప్రజల యొక్క ధృడ సంకల్పాన్ని సృష్టంగా చెప్పడము ఇందులో జరిగింది.