Latest posts
-
పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టి
పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టి పురుషుడవనిలోన పుణ్యమూర్తి పరుల విత్తమరయ పాపసంచితమగు విశ్వదాభిరామ వినురవేమా! తాత్పర్యము పరుల ధనంపై ఆశ లేనివాడే పురుషుల్లో ఉత్తముడు. పరుల సొమ్ము తీసుకున్నా, అది పాపంతో సంపాదించినదే అవుతుంది. అలా చేసేవాడికి ముక్తి ఉండదు.
-
పాల నీటి కలత పరమహంస మెఱుగును
పాల నీటి కలత పరమహంస మెఱుగును నీరు పాలు నెట్లు నేర్చునెమలి లజ్ఞుడైన హీనుడల శివు నెఱుగునా? విశ్వదాభిరామ వినురమేమా! తాత్పర్యము నీటిలో కలిసి ఉన్న పాలను వేరు వేయడం హంసకు తెలుస్తుంది. కానీ ఆ నేర్పు నెమలికి లేదు. అలాగే జ్ఞాని, ఉత్తముడు మాత్రమే పరమేశ్వరుడి పరమతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అంతాకానీ మూర్ఖుడు ఆ తత్వాన్ని అర్థం చేసుకోలేడు.
-
పగలుడుగ నాసలుడుగును
పగలుడుగ నాసలుడుగును వగపుడుగం గోర్కెలుడుగు వడి జన్మంబుల్ తగులుడుగు భోగముడిగిన త్రిగుణంబును నడుగ ముక్తి తెరువగు వేమా! తాత్పర్యము విరోధములు నశించిన ఆశలు నశించును. విచారము లేకున్న కోరికలు నశించును. భోగములు నశించిన జన్మములు నశించును. త్రిగుణములు నశించిననే కొని ముక్తి కలుగును.
-
పంచ ముఖములందు బంచాక్షరి జనించె
పంచ ముఖములందు బంచాక్షరి జనించె పంచ వర్ణములను ప్రబలె జగము పంచముఖుని మీరు ప్రస్తుతి చేయుండీ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము శివుడి అయిదు ముఖాల నుంచి పంచాక్షరి వెలువడింది. పంచాక్షరిలోని అయిదు అక్షరాల నుంచి ప్రపంచం పుట్టింది. అందుకే అందరూ ఆ పరమేశ్వరుడినే స్తుతించాలి.
-
పండువలన బుట్టె బరగ ప్రపంచము
పండువలన బుట్టె బరగ ప్రపంచము పండువలన బుట్టె పరము నిహము పండు మేలెఱింగె బ్రహ్లాదుడిలలోన విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము భగవంతుడు ప్రకృతి నుంచి జన్మించాడు. భగవంతుడు ఈ లోకాలను సృష్టించాడు. ఇన్ని లోకాలను సృష్టించిన భగవంతుడి గొప్పతనం ప్రహ్లాదుడి వంటి భక్తులు మాత్రమే తెలుసుకోగలిగారు.
-
న్యాయశాస్త్ర మరయ నన్యాయమున దించు
న్యాయశాస్త్ర మరయ నన్యాయమున దించు ధర్మశాస్త్ర మొసగు రుగ్మతంబు జ్యోతిషము జనముల నీతుల దప్పించు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము జాతకాలు, ముహూర్తాలు, శుభలగ్నాలు మొదలైనవి వేలం వెర్రిగా పిరణమించాయి. న్యాయం అన్యాయమవుతోంది. శాస్త్రోక్తమైన శుభలగ్నాలు పెట్టినా అవి అప్పుడప్పుడు అశుభాలుగానే మారుతున్నాయి.
-
నిజములాడు వాని నిందించు జగమెల్ల
నిజములాడు వాని నిందించు జగమెల్ల నిజము బల్కరాదు నీచులకడ నిజ మహాత్ముగూడ నిజమాడవలయురా విశ్వదాభిరామ వినుర వేమ! తాత్పర్యము చెడ్డవారితో నిజం చెప్పకూడదు. వారు నిజం చెబితే నమ్మరు. పైగా నిందిస్తారు. ఉత్తముల దగ్గర మాత్రం కచ్చితంగా నిజాన్నే చెప్పాలి.
-
నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు బెళుకు రాలు తట్టెడేల చదువ పద్యమరయ జాలదా యొక్కటి విశ్వదాభిరామ వినుర వేమ! తాత్పర్యము విలువైన నీలమణి ఒక్కటి చాలు. విలువలేని మెరుగురాళ్లు తట్ట నిండా ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. అలాగే చెత్త పద్యాలు వేల సంఖ్యలో ఉన్నా ఉపయోగం లేదు. రసవంతమైన పద్యం ఒక్కటైనా చాలు.
-
నీతి జ్యోతిలేక నిర్మలంబగు నేది
నీతి జ్యోతిలేక నిర్మలంబగు నేది ఎట్లు కలగుబర మదెంతయైన ధనము గలిగియున్న దైవంబు గలుగదు విశ్వదాభిరామ వినుర వేమ! తాత్పర్యము నీతి అనే దీపం సహాయం లేకపోతే అజ్ఞానాంధకారం నశించదు. అది లేకపోతే బ్రహ్మస్వరూపం కనిపించదు. ధనం ఉన్నంత మాత్రాన దైవ కృప ఉండదు.
-
నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని
నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని కడుపు చల్లజేసి ఘనత విడుచు నడుప నేర నేర నతడు నాలి ముచ్చేగదా విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము కన్యాదానం చేసినవారిని, అన్నం పెట్టిన వారిని ఎల్లప్పుడూ గౌరవంతో చూడాలి. వారికి తగిన మర్యాద ఇవ్వనివాడు దుష్టుడితో సమానం.