నేయి వెన్న కాచి నీడనే యుంచిన బేరి గట్టిపడును పెరుగురీతి పోరిపోరి మదిని పోనీక పట్టుము విశ్వదాభిరామ వినురవేమ
నోరు పలకవచ్చు నుడి వ్రాయగరాదు వ్రాతకన్న సాక్షి వలవదన్న పరగలేని వ్రాత భంగ పాటుందెచ్చు విశ్వదాభిరామ వినురవేమా!
న్యాయశాస్త్ర మరయ నన్యాయమున దించు ధర్మశాస్త్ర మొసగు రుగ్మతంబు జ్యోతిషము జనముల నీతుల దప్పించు విశ్వదాభిరామ వినురవేమ!
పంచ ముఖములందు బంచాక్షరి జనించె పంచ వర్ణములను ప్రబలె జగము పంచముఖుని మీరు ప్రస్తుతి చేయుండీ విశ్వదాభిరామ వినురవేమ
పండువలన బుట్టె బరగ ప్రపంచము పండువలన బుట్టె పరము నిహము పండు మేలెఱింగె బ్రహ్లాదుడిలలోన విశ్వదాభిరామ వినురవేమ
పగయుడగు గోపముడిగిన పగయుడుగన్ కోర్కెలుడుగు బరజన్మంపుం దగులుడుగు భేదముడిగిన త్రిగుణము లుడుగంగ ముక్తి స్థిరమగు వేమా!
పగలుడుగ నాసలుడుగును వగపుడుగం గోర్కెలుడుగు వడి జన్మంబుల్ తగులుడుగు భోగముడిగిన త్రిగుణంబును నడుగ ముక్తి తెరువగు వేమా!
పట్టుపట్టరాదు పట్టివిడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు విశ్వదాభిరామ వినురవేమ
పతక మందు నొప్పు పలు రత్నముల పెంపు బంగరందు కూర్ప బరువు గనును గాని యితర లోహమైన హీనము గాదె విశ్వదాభిరామ వినురవేమ!
పదుగురాడుమాట పాడియై ధరజెల్లు నొక్కడాడుమాట యెక్కదెందు వూరకుండు వాని కూరెల్ల నోపదు విశ్వదాభిరామ వినురవేమ!