వేమన శతకము

బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు 
ప్రాణ మెవరి సొమ్ము భక్తిసేయ, 
ధనమదెవరిసొమ్ము ధర్మమె తన సొమ్ము 
విశ్వదాభిరామ వినురవేమ

బ్రహ్మఘటము మేను ప్రాణంబు తగగాలి 
మిత్రచంద్ర శిఖులు నేత్రచయము 
మఱియు బ్రహ్మమనగ మహిమీద లేదయా 
విశ్వదాభిరామ వినురవేమ

భయమంతయు దేహమునకె 
భయ ముడిగిన నిశ్చయంబు పరమాత్మునకే 
లయమంతయు జీవునకే 
జయమాత్మకు ననుచు జగతిఁ జాటుర వేమా

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు 
దాన హీనుఁ జూచి ధనము నవ్వు 
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును 
విశ్వదాభిరామ వినురవేమ

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు 
దాన హీనుఁ జూచి ధనము నవ్వు 
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును 
విశ్వదాభిరామ వినురవేమ 

భూమిలోన బుట్టు భూసారమెల్లను 
తనువులోన బుట్టు తత్త్వమెల్ల 
శ్రమలోన బుట్టు సర్వంబు తానౌను 
విశ్వదాభిరామ వినురవేమ 

భోగంబుల కాశింపక 
రాగద్వేషంబు రంగుడదమలో 
వేగమె మోక్ష పదంబును 
రాగను నాతండు యోగిరాయుడు వేమా!

యోగిననుచు గొంత యోగముగూర్చక 
జగమునెల్లబట్ట చంపి తినుచు 
ధనము కొఱకు వాడు తగవాడుచుండిన 
యోగికాడు వాడె యోగువేమ

రూపువంక పేరు రూఢిగా నిలుచును 
పేరువంక క్రియలు పెనగుచుండు 
నాశమౌను తుదకు నామరూప క్రియల్‌ 
విశ్వదాభిరామ వినురవేమ! 

లోకమందుబుట్టి లోకమందె పెరిగి 
లోక విభవమోర్వలేక జనుడు 
లోకమందు జనికి లోబడి చెడిపోవును 
విశ్వదాభిరామ వినురవేమా!

Pages