వేమన శతకము

ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి
వేరేపోవువాడు వెర్రివాడు
కుక్కతోక పట్టి గోదారీదినా?
విశ్వదాభిరామ వినుర వేమ!

ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులు 
కట్టుపడుచు ముక్తిగానరైరి 
జ్ఞానఖడ్గమునను ఖండింప రాదొకో 
విశ్వదాభిరామ వినురవేమా!

ఆశయనెడు దాని గోసివేయగాలేక 
మొహబుద్ది వలన మునుగువారు 
కాశివాసులైన గనబోరు మోక్షము 
విశ్వదాభిరామ వినురవేమా!

ఇంగలంబు తోడ నిల సల్పుతోడను 
పరుని యాలితోడ పతితుతోడ 
సరసమాడుటెల్ల చావుకు మూలము 
విశ్వదాభిరామ వినురవేమ!

ఇంటి ఇంటిలోననీశ్వరుడుండగ 
నంటి చూడలేక యడవులందు 
నుంట మేటంచునుందురా జోగులై 
విశ్వదాభిరామ వినురవేమ!

ఎండిన మా నొకటడవిని 
మండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్‌ 
దండిగల వంశమెల్లను 
చండాలుండొకడు పుట్టి చదుపును వేమా!

ఎలుగు తోలు తెచ్చి ఏడాది యుతికినా 
నలుపు నలుపేకాని తెలుపుకాదు 
కొయ్యబొమ్మ తెచ్చి కొట్టితే గుణియోనె 
విశ్వదాభిరామ వినురవేమ

ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు 
దాని బలిమి నెంతయైన గూడు 
గడ్డి వెంట బెట్టి కట్టరా యేనుంగు 
విశ్వదాభిరామ వినురవేమ!

కదలనీయకుండ గట్టిగా లింగంబు 
కట్టివేయనేమి ఘనత కలుగు 
భావమందు శివుని భావించి కానరా 
విశ్వదాభిరామ వినురవేమ

కనులు పోవువాడు కాళ్లు పోయినవాడు 
ఉభయులరయుగూడి యుండినట్లు 
పేద పేద గూడి పెనగొని యుండును 
విశ్వదాభిరామా వినురవేమ

Pages